యుగపురుషుడు ఎన్టీఆర్.. దుబాయ్‌లో ఘనంగా 30వ వర్ధంతి కార్యక్రమం !!
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, మంత్రి నారా లోకేష్.. నందమూరి బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ సహా పలువురు కుటుంబ సభ్యులు ఆయనను స్మరించుకొని నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో దుబాయ్‌లో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పిస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారై టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. వెండితెరపై అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించడమే కాకుండా, రాజకీయాల్లోకి వచ్చి అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రిగా ఎదిగి, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలు కాలాతీతమైనవని, తెలుగు ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాలనలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సామాజిక సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని నేతలు గుర్తుచేశారు. ముఖ్యంగా 'రెండు రూపాయలకే కిలో బియ్యం' పథకం ద్వారా పేదల ఆకలిని తీర్చిన మహానాయకుడిగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయిందన్నారు. పేదరిక నిర్మూలన, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని వ్యాఖ్యానించారు. అలాగే మహిళలకు ఆస్తి హక్కులు, మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం వంటి అంశాల్లో ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు సువర్ణాక్షరాలతో లిఖించదగినవని వక్తలు ప్రశంసించారు. రాజకీయాల్లో విలువలు, ప్రజాసేవ అనే భావనలకు ఎన్టీఆర్ కొత్త నిర్వచనం ఇచ్చారని అన్నారు.
ఈ సందర్భంగా ఎన్నారై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటామని, తెలుగు ప్రజల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణే లక్ష్యంగా ప్రజాసేవకు పునరంకితం అవుతామని ప్రతిజ్ఞ చేశారు. ప్రవాసులుగా ఉన్నప్పటికీ, మాతృభూమి అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబాయ్‌లో నివసిస్తున్న ఎన్నారై టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రియతమ నేతకు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ పేరు, ఆయన ఆదర్శాలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని కార్యక్రమం అంతా భావోద్వేగభరిత వాతావరణంలో కొనసాగింది.












Click it and Unblock the Notifications