సిలికాన్ వ్యాలీలో ‘నమో’ టీ స్టాల్
న్యూయార్క్: నమో మంత్రం మనదేశంలోనే కాక విదేశాల్లోనూ జోరందుకుంది. విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతుగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులు తమ మద్దతును తెలిపేందుకు తొలి నమో టీ స్టాల్‌ను సిలికాన్ వ్యాలీలో ప్రారంభించారు.
త్వరలో భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి తమ మద్దతును తెలపడంలో భాగంగానే తాము నమో(నరేంద్ర మోడీ) తొలి టీ స్టాల్‌ను అమెరికాలో ప్రారంభించినట్లు వారు తెలిపారు. మైక్రోసాఫ్ట్, సిస్కో, యాపిల్, ఈబే, ఓరాకిల్ వంటి బహుళ జాతి సంస్థల్లో పని చేస్తున్న సుమారు 60 మంది ప్రవాసులు ఒక్క చోట కలిసి సన్నీవేల్‌లోని ఓర్టెగా పార్క్ వద్ద టీ స్టాల్‌ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వారు ‘ఐ కేర్ ఫర్ ఇండియా' అనే నినాదానిచ్చారు. భారతదేశంలోని గ్రామాల్లో ఉండే విధంగా సాంప్రదాయ టీ స్టాల్‌ను ఇక్కడ ఏర్పాటు చేసినట్లు ప్రవాసీలు తెలిపారు. భారతదేశంలో పాలనాపరమైన సమస్యలకు పరిష్కరించడంలో సాంకేతికత పాత్ర అనే అంశంపై ఈ సందర్భంగా వారు చర్చలు జరిపారు. చర్చల్లో పాల్గొన్న చాలా మంది ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ తమ అమూల్యమైన సూచనలు చేశారని నిర్వాహకులు తెలిపారు.
ప్రస్తుతం దేశంలో ఉన్న సమస్యలు విద్యుత్ కోత, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందజేసే విషయాలపై వారు తమ అభిప్రాయాలను, విలువైన సూచనలను తెలియజేశారని చెప్పారు. ఇక్కడ తాము చేసిన పలు సూచనలను భారతదేశంలోని బిజెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీకి అందజేయనున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications