కొద్దిరోజులు వేచి చూద్దాం- తేల్చేసిన మంత్రి నారా లోకేష్
Nara Lokesh on H1B Visa: నేడు- తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ- మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు. తన 42వ జన్మదిన వేడుకలను జరుపుకొంటోన్నారాయన. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి దావోస్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఏర్పాటైన ప్రపంచ ఆర్థిక సదస్సు 2025లో పాల్గొంటోన్నారు.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో వివిధ మల్టీ నేషనల్ కంపెనీల ఛైర్మన్లు, సీఈఓలతో వరుస భేటీలను నిర్వహిస్తోన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, ఇన్‌ఫ్రా.. వంటి రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులను సాధించడానికి కృషి చేస్తోన్నారు. నెక్ట్స్‌జెన్, డాటా ఫ్యాక్టరీ, ఏఐ యూనివర్శిటీ ఏర్పాటు వంటి అంశాలపై ఎన్‌విడియా, గూగుల్ వంటి సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరవుతున్నారు.

ఈ సందర్భంగా దావోస్‌లో ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రత్యేకించి- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేయదలిచిన విధానాల గురించి ప్రస్తావించారు. నాన్ అమెరికన్లకు జన్మించే పిల్లలకు ఆటోమేటిక్‌గా వర్తించే పౌరసత్వాన్ని రద్దు చేసిన నేపథ్యంలో హెచ్1బీ విసాలపై డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి నిర్ణయాలను తీసుకోవచ్చనే విషయంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
డొనాల్డ్ ట్రంప్ పాలనలోనూ ప్రస్తుతం అమెరికా అనుసరిస్తోన్న ఇమిగ్రేషన్ విధానాలు, హెచ్1బీ విసాల పాలసీల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని నారా లోకేష్ అంచనా వేశారు. దీని గురించి పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు దీని ప్రభావం కొంత ఉండేదని, ఆ తరువాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందని భావిస్తున్నట్లు చెప్పారు.
ఈ విషయంలో వేచి చూడాల్సిన అవసరం ఉందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ- తమ రాష్ట్రంలో మాత్రం ఐటీ రంగం స్థిరంగా పురోగమిస్తోందని నారా లోకేష్ చెప్పారు. ఐటీ సహా అన్ని రంగాల్లోనూ రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఈ క్రమంలో పెట్టుబడిదారులకు అద్భుతమైన అవకాశాలను అందిస్తోన్నామని తెలిపారు.
ఐటీ రాజధాని విశాఖపట్నంలో పెట్టుబడులను పెట్టడానికి పలు గ్లోబల్ కేబిలిటీ సెంటర్లు ముందుకొస్తోన్నాయని నారా లోకేష్ పేర్కొన్నారు. వచ్చే రెండు సంవత్సరాల కాలంలో ఏపీని ఐటీ డెస్టినేషన్‌గా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వివరించారు. అన్ని రాష్ట్రాలు పురోగమించగలిగితే భారత్ రెండంకెల వృద్ధిని సాధించగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2047 నాటికి వికసిత భారత్ సాధించగలుగుతామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications