అమెరికాలో హైదరాబాద్ యువతి మిస్సింగ్
వాషింగ్టన్: అమెరికాలో హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువతి అదృశ్యమైంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో తెలంగాణకు చెందిన 23 ఏళ్ల విద్యార్థిని నితీశ కందుల (Nitheesha Kandula) గత వారం రోజులుగా కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో ఆమె ఆచూకీ కోసం అక్కడి పోలీసులు ప్రజల సాయం కోరారు. ఆమె జాడ తెలిస్తే తమకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ నగరానికి చెందిన నితీశ కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ, శాన్ బెర్నార్డినోలో చదువుతోంది. మే 28వ తేదీ నుంచి ఆమె కనిపించకుండా పోయింది. చివరిసారిగా ఆమె లాస్ ఏంజెల్స్‌లో కనిపించినట్లు యూనివర్సిటీ ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేసింది. ఆ తర్వాత నుంచి నితీశ అదృశ్యమైనట్లు పేర్కొంది.

ఈ మేరకు స్థానికు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నితీశ కోసం గాలింపు చేపట్టారు. యువతి గురించిన సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా స్థానికులను కోరారు పోలీసులు.కాగా, మే నెలలోనే తెలంగాణకు చెందిన రూపేశ్ చంద్ర చింతకింది షికాగోలో అదృశ్యమయ్యారు. ఇప్పటికీ అతడి ఆచూకీ తెలియరాకపోవడం గమనార్హం.
మరోవైపు, ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్ నగరానికి చెందిన మహ్మద్ అబ్దుల్ అరాఫత్ అదృశ్యమై.. నెల రోజులకు క్లీవ్ లాండ్ లోని ఒహాయోలో ఓ సరస్సు వద్ద శవమై తేలాడు. క్లీవ్ లాండ్ లోని ఓ డ్రగ్ ముఠా అబ్దుల్‌ను కిడ్నాప్ చేసి, అతడి తండ్రికి ఫోన్ చేసి డబ్బు పంపాలని డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కాగా, ఇటీవల కాలంలో భారతీయులు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు యువతీయువకులు వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications