అమెరికాలో రోడ్డు ప్రమాదం: హైదరాబాద్ యువకుడు మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. కాగా, ఈ ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన రాం ఆశీశ్ కుటుంబం గత కొన్ని సంవత్సరాల క్రితం బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి పద్మానగర్ ఫేజ్-2లో నివసిస్తోంది.
రాం ఆశీశ్‌కు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు సంతోష్ కుమార్ యాదవ్(27) రెండేళ్ల క్రితం ఎమ్మెస్ చేయటానికి అమెరికాలోని ఓహియో వెళ్లాడు. అయితే, నవంబర్ 17న రాత్రి సంతోష్ కుమార్ యాదవ్ తన స్నేహితుడితో కలిసి మరో స్నేహితుడిని కలవటానికి కారులో బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టడంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని స్నేహితుడికి స్వల్ప గాయాలు కావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

ఈ విషయం తెలిసిన సంతోష్ కుమార్ యాదవ్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ కుమారుడి మరణ వార్త విని కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఇరుగు పొరుగు వారు కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహాన్ని నగరానికి రప్పించటానికి పలువురు ప్రజా ప్రతినిధులకు విన్నవించారు.
ఇటీవల ఇలాంటి పలు ఘటనలు చోటు చేసుకున్నాయి.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన యువతి ఇటీవల ఫిలిప్పీన్స్ దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఇంద్రేశం గ్రామానికి చెందిన స్నిగ్ధ.. ఫిలిప్పీన్స్ దేశంలో మెడిసిన్ అభ్యసిస్తున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా అర్ధరాత్రి సమయంలో స్నేహితులు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లారు. ఇంతలోనే ఆ యువతి తన గదిలో శవమై కనిపించారు. అది చూసిన స్నేహితులంతా ఒక్కసారిగా ఏం జరిగింది అనే భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నిగ్ధ తల్లిదండ్రులకు ఈ ఘటన గురించిన సమాచారం తెలియజేశారు. సమాచారం అందుకున్న పటాన్‌చెరులోని ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇది ఇలావుండగా, గత ఏడాది డిసెంబర్ నెలలో అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ముమ్మిడివరం వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబ సభ్యులుగా అమెరికా అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో పొన్నాడ నాగేశ్వరరావు, భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ, మనవడు, మనవరాలు అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన అల్లుడు లోకేశ్ తీవ్రంగా గాయపడ్డారు.












Click it and Unblock the Notifications