ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ మెడిసిన్ విద్యార్థిని అనుమానాస్పద మృతి: పుట్టినరోజునే
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైద్య విద్య కోసం ఫిలిప్పీన్స్ వెళ్లిన ఇంద్రేశం గ్రామానికి చెందిన యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. ఇంద్రేశం గ్రామానికి చెందిన స్నిగ్ధ.. ఫిలిప్పీన్స్ దేశంలో మెడిసిన్ అభ్యసిస్తున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా అర్ధరాత్రి సమయంలో స్నేహితులు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లారు.
ఇంతలోనే ఆ యువతి తన గదిలో శవమై కనిపించారు. అది చూసిన స్నేహితులంతా ఒక్కసారిగా ఏం జరిగింది అనే భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నిగ్ధ తల్లిదండ్రులకు ఈ ఘటన గురించిన సమాచారం తెలియజేశారు.

సమాచారం అందుకున్న పటాన్‌చెరులోని ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. యువతి తండ్రి అమృత్‌రావు తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ శాఖలో డీఈ(డివిజినల్ ఇంజినీర్)గా విధులు నిర్వర్తిస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశం రప్పించేందుకు ఫిలిప్పీన్స్ దేశ అధికారులతో సంప్రదింపులు జరపాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కాగా, విదేశాల్లో విద్య, ఉపాధి కోసం వెళుతున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఇటీవల కాలంలో ప్రాణాలు కోల్పోవడం శోచనీయంగా మారింది. కొందరు ప్రమాదాల్లో చనిపోతుండగా.. మరికొందరు దుండగుల దాడుల్లో ప్రాణాలు కోల్పోపోతున్నారు. ఇంకొందరి మరణాలకు కారణాలు కూడా తెలియకపోవడం గమనార్హం.
వరంగల్ జిల్లాకు చెందిన దేవులపల్లి రమేష్-రజితల కుమారుడు దేవులపల్లి ప్రణయ్ ఏడాదిన్నర క్రితం లండన్ వెళ్లాడు. లండన్‌లో ప్రణయ్ అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాడు. స్నేహితుల ద్వారా ప్రణయ్ మరణించిన వార్త తల్లిదండ్రులకు అందింది. తమ కుమారుడు మరణించాడనే వార్త విన్న తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
హనుమకొండకు చెందిన ఉత్తేజ్ అనే విద్యార్థి ఇటీవల అమెరికాలో మృతి చెందాడు. సెయింట్ లూయిస్ కాలేజీలో ఎమ్మెస్ చదువు కోసం అమెరికా వెళ్లాడు. చెరువులో స్నేహితుడు మునిగిపోతుండగా కాపాడే ప్రయత్నంలో నీటిలో గల్లంతయ్యాడు. రెస్క్యూ సిబ్బంది వెతకగా తన స్నేహితుడు శివ, ఉత్తేజ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. తమ పిల్లలు ఎంతో వృద్ధిలోకి వస్తారని విదేశాలకు పంపిస్తే విగత జీవులుగా తమ కళ్ల ముందుకు వస్తుండటంతో ఆ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు తీరని వేదననే మిగులుతోంది.












Click it and Unblock the Notifications