ఆస్టిన్‌లో టాలీవుడ్ హంగామా (ఫొటోలు)
ఆస్టిన్: దశాబ్దాల చరిత్ర కలిగిన తానా సంస్థ నభూతో నభవిష్యతి అన్న రీతిలో నిర్వహించిన టాలీవుడ్ సంబరాలు ఆస్టిన్ నగరం లోని మేనర్ హై స్కూల్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్‌లో శనివారం, నవంబర్ 23న ఘనంగా జరిగాయి. ఆస్టిన్ నగరంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన కార్యక్రమాలు హాజరైన 1000 మందికి పైగా ఆహుతులను ఉర్రూతలూగించాయి. గాయనీ గాయకులు, వెండి తెర కథానాయికలు, కమెడియన్స్ తో పాటుగా అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుండి తానా కార్యవర్గ సభ్యులందరూ ఈ వేడుకలకు విచ్చేయడం ఒక విశేషం.
తానా ఇన్సురన్స్ సర్వీసెస్ చైర్ పర్సన్ మురళి తాళ్లూరి, స్థానిక నిర్వాహకులు శ్రీవర్ధన్ పోటవర్థి, ప్రవర్ధన్ చిమ్ముల, లెనిన్ తుల్లూరి, కుమార్ సవిటల కార్యక్రమాన్ని చక్కగా తీర్చిదిద్దారు. వీరికి తానా సౌత్ వెస్ట్ ప్రాంతీయ ప్రతినిధి డా. రాజేష్ అడుసుమిల్లి, టీం స్క్వేర్ చైర్ పర్సన్ శ్రీకాంత్ పోలవరపు, స్టూడెంట్ సర్వీసెస్ చైర్ పర్సన్ సాంబ దొడ్డ చేయూతనందించారు. స్థానిక నృత్య కళాకారులు చేసిన శాస్త్రీయ నృత్యంతో ఈ సంబరాలు ప్రారంభమయ్యాయి.

ప్రముఖ గాయనీ గాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవి, అంజనా సౌమ్య, శారద ఆకునూరి, మధు వీనుల విందైన గానంతో, హీరొయిన్స్ విమల రామన్, సింధుల ఉర్రూతలూగించే నృత్యాలతో, బుల్లితెర కథానాయకుడు ఇంద్రనీల్, కమెడియన్ హరిబాబుల కడుపుబ్బ నవ్వించే హాస్యంతో ప్రేక్షకులను ఎంతో అలరించారు. రాజేష్ అడుసుమిల్లి మరియు ధీం-తానా చైర్ పర్సన్ శారద ఆకునూరి తమ సందర్భోచిత వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించారు.
తానా అధ్యక్షులు శ్రీ మోహన్ నన్నపనేని గారు మాట్లాడుతూ తానా టీం స్క్వేర్ మరియు తానా ఫౌండేషన్ భారత దేశంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను గురించి వివరించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తానా సంస్థలో సభ్యులుగా చేరి, నేను సైతం అంటూ తానా చేపడుతున్న సేవా కార్యక్రమాలకు చేయూతనిమ్మని విజ్ఞప్తి చేసారు. తదుపరి తానా ఫౌండేషన్ చైర్ పర్సన్ శ్రీ జయ్ తాళ్లూరి గారు, తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర గారు ప్రసంగించారు.

తానా కార్యవర్గ సభ్యులు మధు తాత, అంజయ్య చౌదరి లావు, గౌతమ్ గుర్రం, రవి పొట్లూరి, మంజులత కన్నెగంటి తో పాటు వివిధ కమిటీల చైర్ పర్సన్స్, టాంటెక్స్ అధ్యక్షుడు సురేష్ మండువ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్థానిక నిర్వాహకులని , స్పాన్సర్స్ ని, ఆస్టిన్ నగరంలో వివిధ రంగాలలో ప్రముఖులైన తెలుగు వారిని తానా కార్యవర్గం ఘనంగా సత్కరించింది. మున్ముందు కూడా తానా ఇటువంటి చక్కని కార్యక్రమాలను ఆస్టిన్ నగరానికి మరిన్ని తీసుకు రావాలని కార్యక్రమానికి హాజరైన తెలుగు వారు అభిలషించారు.












Click it and Unblock the Notifications