టాంటెక్స్ నూతన కార్యవర్గం
న్యూయార్క్: అత్యధిక తెలుగు ప్రజలు నివాసముండే టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్- ఫోర్ట్ వర్త్ నగరంలో తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించేందుకు 1986లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) స్థాపించడం జరిగిందని ఆ సంఘం నిర్వహక సభ్యులు తెలిపారు. ఈ స్థానిక సంస్థ తెలుగువారికి అండగా ఉంటూ అన్నీ జాతీయ సంస్థలకు ధీటుగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలిగిందని వారు పేర్కొన్నారు. ఇటీవలే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, 2014 సంవత్సారానికి గాను నూతన కార్యవర్గాన్ని ప్రకటించిందని వారు తెలిపారు.
ఈ సందర్భంగా టాంటెక్స్ 2014-అధ్యక్షుడిగా విజయ మోహన్ కాకర్ల పదవి బాధ్యతలు స్వీకరించారని చెప్పారు. డల్లాస్‌లో గత 15 ఏళ్లుగా నివసిస్తున్న విజయ మోహన్ టాంటెక్స్ సేవ కార్యక్రమాల్లో ఎంతో చురుకైన పాత్ర వహించారని నిర్వాహక సభ్యులు పేర్కొన్నారు. టాంటెక్స్ అధ్యక్ష పదవి స్వీకరించడం ఎంతో అదృష్టమని, ఆ పదవికి పూర్తి న్యాయం చేస్తానని ఈ సందర్భంగా విజయ మోహన్ తెలిపారు.

తెలుగు భాషా పరిరక్షణ, భావి తరాలకు మన భాష మరియు సంస్కృతి ఔన్నత్యం కోసం ప్రత్యేక కృషి చేస్తానని ఆయన అన్నారు. డల్లాస్‌లో నివసిస్తున్న తెలుగు వారి ప్రయోజనాలను కాపాడి అందరిని ఏక తాటి పైకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. టాంటెక్స్ అధ్యక్షుడిగా కాకర్ల విజయ మోహన్ ఎంపిక కాగా, ఉత్తరాధ్యక్షుడిగా డా. ఊరిమిండి నరసింహారెడ్డి నియమితులయ్యారు. ఉపాధ్యక్షుడిగా జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, కార్యదర్శిగా ఆదిభట్ల మహేష్ ఆదిత్య, కోశాధికారిగా వీర్నపు చిన్నసత్యం, సంయుక్త కోశాధికారి గా శీలం కృష్ణవేణి, తక్షణ పూర్వాధ్యక్షులుగా మండువ సురేష్ ఎన్నికయ్యారు.
కార్యనిర్వహక బృంద సభ్యులుగా బాల్కి చామకూర, చంద్రశేఖర్ కాజ, జ్యోతి వనం, నీరజ పడిగెల, రఘు చిట్టిమల్ల, రఘు గజ్జల , శారద సింగిరెడ్డి, శశికాంత్ కనపర్తి, శ్రీలక్ష్మి మందిగ, సుభాషిణి పెంటకోట, సునీల్ దేవిరెడ్డి, వెంకట్ దండ, వేణుమాధవ్ పావులూరి ఎన్నికయ్యారు. మూర్తి ములుకుట్ల (అధిపతి), అజయ్ రెడ్డి (ఉపాధిపతి), డా.సి.ఆర్.రావు, శ్రీనివాస్ రెడ్డి గుర్రం, సుగన్ చాగర్లమూడిలు పాలకమండలి బృందంలో సభ్యులుగా ఉన్నారు.
ఈ సందర్భంగా టాంటెక్స్ నిర్వాహకులు వారు చేపట్టనున్న పలు కార్యక్రమాలను వివరించారు. "గానసుధ" రేడియో కార్యక్రమాలను తిరిగి AM/FM లోకి తీసుకొనిరావడం, విభిన్న సంస్కృతి మరియి సాహిత్య కార్యక్రమాలతో పాటు, సభ్యుల ఆరోగ్యం మరియు సుహ్రుద్బావం పెంపొందించడానికి క్రికెట్, కబడ్డీ, వాలీ బాల్, టెన్నిస్ లాంటి వివిధ క్రీడల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ క్రీడలలో మహిళలకు, పిల్లలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించనున్నట్లు చెప్పారు.
హృద్రోగం, కాన్సర్, మధుమేహం, మహిళల , చిన్నపిల్ల ఆరోగ్య సమస్య లను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక "ఆరోగ్య అవగాహన సదస్సులు" నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతినెలా నిర్వహించే తెలుగు సాహిత్య వేదిక "నెల నెలా తెలుగు వెన్నెల", ప్రవాసంలో పర్యటిస్తున్న తల్లిదండ్రుల ప్రాయోజనార్ధం నిర్వహించే "మైత్రి", వనితలచే వనితల కోసం నిర్వహించే "వనితా వేదిక", యువతకోసం "స్ఫూర్తి" తదితర కార్యక్రమాలను బలోపేతం చేయనున్నట్లు వారు వివరించారు.
2013 సంవత్సరంలో టాంటెక్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి ఇటీవలే పదవీ విరమణ చేసిన తక్షణ పుర్వాధ్యక్షుడు శ్రీ సురేష్ మండువ మాట్లాడుతూ... గత సంవత్సరంలో భాషా సంస్కృతులతో పాటు మరెన్నో సేవా కార్యక్రమాలతో మన సంస్థ సభ్యుల అవసరాలకు అనుగుణంగా పురోభివృద్ది సాధించింది అనడంలో ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. విజయమోహన కాకర్ల నేతృత్వంలో నిర్వహించబోయే కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. తమ సంస్థకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకునేవారు www.tantex.org సందర్శించాలని నిర్వాహక సభ్యులు కోరారు.












Click it and Unblock the Notifications