అందమైన మోడల్ ఫొటోతో తెలుగు ఎన్నారైకి రూ. 2.68 కోట్ల టోకరా!
ఇటీవల కాలంలో మ్యాట్రిమోనీయల్ మోసాలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లలో తప్పుడు వివరాలు ఇచ్చి.. తమ చేతికి చిక్కినవాళ్ల వద్ద పెద్ద ఎత్తున డబ్బులను కాజేస్తున్నారు. తాజాగా, ఇలాంటి మోసానికే గురయ్యాడు ఓ తెలుగు ప్రవాసుడు. మంచి అమ్మాయి కోసం మ్యాట్రిమోనీని ఆశ్రయించిన తెలుగు ఎన్నారైని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌కు చెందిన అన్నా చెళ్లెల్లు పెద్ద మోత్తంలో టోపీ పెట్టారు.
అమెరికాలోని నార్త్ కరోలినా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువకుడికి 2023లో మ్యాట్రిమోనీ ద్వారా ఇండోర్ యువతి బర్ఖా జైస్వానీతో పరిచయమైంది. ఈ క్రమంలో తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మాయమాటలు చెప్పి ఆమె విడతలవారీగా ఎన్నారై యువకుడి నుంచి రూ. 2.68 కోట్లను వివిధ ఖాతాల్లో బదిలీ చేయించుకుంది.

అయితే, ఇటీవల వీడియో కాల్ చేసిన సమయంలో మాట్లాడిన అమ్మాయి మ్యాట్రిమోని ప్రొఫైల్‌లో ఉన్నట్టు లేకపోవడంతో ఆ యువకుడికి అనుమానం వచ్చింది. దీంతో డబ్బు గురించి అడగ్గా పొంతన లేని సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలో బాధితుడు అమెరికా నుంచి నేరుగా ఇండోర్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుల ఆటకట్టించారు. బర్ఖా అసలు పేరు సిమ్రన్ అని, వివాహిత అయిన మె మ్యాట్రిమోనీ ప్రొఫైల్‌లో ఓ మోడల్ ఫొటో పెట్టి తన సోదరుడు విశాల్ తో కలిసి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తేల్చారు. నిందితులైన అన్నాచెల్లెళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications