మోడీ కోసం ఎన్నారైల ప్రచారం
అహ్మదాబాద్: భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి భారతదేశంలోనేగాక విదేశాల్లో ఉంటున్న భారతీయుల నుంచి కూడా భారీ మద్దతు లభిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కోసం 2012 ఎన్నికల్లో నిధులు సేకరించిన పలువురు ప్రవాస భారతీయులు, మనదేశంలో మోడీకి మద్దతుగా ప్రచారం చేసేందుకు ఇక్కడికి వచ్చారు.
‘గ్లోబల్ ఇండియన్స్ ఫర్ భారత్ వికాస్ అసోసియేషన్', డాక్టర్ భరత్ బరాయ్ నేతృత్వంలో 650 మంది ఎన్నారైలు స్వచ్ఛందంగా మోడీ కోసం ప్రచారం చేసేందుకు గుజరాత్ రాష్ట్రానికి వచ్చారు. ‘మోడీ ఫర్ పిఎం' ప్రచారాన్ని విస్తృతం చేయనున్నట్లు వారు తెలిపారు. దేశంలోని వివిధ లోకసభ స్థానాల్లో మోడీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా డాక్టర్ భరత్ బరాయ్ మాట్లాడుతూ.. తాము 2012 ఎన్నికల సమయంలో బరాక్ ఒబామా కోసం నిధులు సేకరించామని తెలిపారు. ఆయన గెలుపుకోసం పని చేశామని చెప్పారు. ప్రస్తుతం తాము నరేంద్ర మోడీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. తామేగాక అమెరికాలోని భారతీయులందరూ మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని చెప్పారు.
దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగల సమర్థుడు మోడీనేనని భరత్ తెలిపారు. మోడీ దేశానికి స్ఫూర్తిదాయక నాయకుడని అన్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలతోపాటు మరిన్ని రాష్ట్రాల్లో మోడీకి మద్దతుగా ‘గ్లోబల్ ఇండియన్స్ ఫర్ భారత్ వికాస్' సంస్థ ప్రచారం నిర్వహిస్తుందని తెలిపారు. ఉగ్రవాదం, పెరిగిన ధరలు, అవినీతి లాంటి సమస్యలకు పరిష్కారం లభించాలంటే మోడీ ప్రధాని కావాలని ఆయన అన్నారు. అందుకే మోడీకే ప్రజలు ఓటు వేయాలని భరత్ కోరారు.












Click it and Unblock the Notifications