భారత్ లో సెమికండక్టర్, చిప్ ఇండస్ట్రీకి అదాని యూనివర్శిటీ ఊతం
భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ కేంద్రంగా మార్చేందుకు పారిశ్రామిక రంగానికి, విద్యా సంస్థలకు మధ్య బలమైన భాగస్వామ్యం అత్యంత అవసరమని అదానీ యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రీతి అదానీ స్పష్టం చేశారు. తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా అత్యాధునిక సాంకేతికతను రూపొందించే నైపుణ్యం కలిగిన మానవ వనరులను సృష్టించడంపై దృష్టి సారించాలని ఆమె పిలుపునిచ్చారు.
'చిప్స్ (CHIPS) 2026' సదస్సులో ప్రీతి అదాని మాట్లాడారు. సాంకేతిక అభివృద్ధి అనేది యంత్రాలు, పరికరాల పనితీరుపై కాకుండా మానవ మేధస్సును మనం ఎంత సద్వినియోగం చేసుకుంటున్నామనే దానిపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. దేశీయంగా సెమీకండక్టర్ పరిశ్రమ స్వయంసమృద్ధి సాధించాలంటే చిప్ డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లీ, ప్యాకేజింగ్ వంటి అన్ని విభాగాల్లో సమగ్ర పురోగతి సాధించాల్సి ఉందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) ఈ దిశగా పరిశ్రమకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తోందని ప్రీతి అదాని పేర్కొన్నారు. గుజరాత్‌లోని ధోలేరా, సానంద్ ప్రాంతాలు ఇందుకు వేదికలుగా మారుతున్నాయని వివరించారు. సెమీకండక్టర్ల తయారీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక వసతులు, డేటా సెంటర్లు, సర్వర్లు, నిరంతర విద్యుత్ సరఫరా వ్యవస్థలు ఒకదానికొకటి అనుసంధానమై అభివృద్ధికి తోడ్పడతాయని ఆమె వెల్లడించారు.
సెమీకండక్టర్ రంగానికి అవసరమైన పరిశోధనలు, నైపుణ్యాలు
పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా యువ ఇంజనీర్లు, నిపుణులను తీర్చిదిద్దేందుకు అదానీ యూనివర్సిటీ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. అహ్మదాబాద్‌లోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సెమీకండక్టర్ డిజైన్, ప్రొడక్షన్ అంశాలపై దృష్టి సారించి నిపుణులకు, బోధనా సిబ్బందికి అవసరమైన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనా శక్తి, సంక్లిష్ట సమస్యలను పరిష్కరించే నేర్పరితనాన్ని పెంపొందించడం ద్వారానే సరికొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని డాక్టర్ ప్రీతి అదానీ అన్నారు. విభిన్న రంగాలు కలిసి పనిచేసినప్పుడే సాంకేతిక విప్లవం వేగవంతమవుతుందని అభిప్రాయపడ్డారు.
100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక వసతుల విస్తరణలో అదానీ గ్రూప్ కీలక పాత్ర పోషిస్తోంది. 2035 నాటికి పునరుత్పాదక ఇంధన ఆధారిత ఏఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గ్రూప్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రీతి అదాని గుర్తుచేశారు. విశాఖపట్నంలో గూగుల్ సంస్థతో కలిసి ప్రత్యేక ఏఐ హబ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అందించే దిగ్గజ సంస్థలతో చేతులు కలుపుతోంది. ఇది దేశంలో వేగంగా పెరుగుతున్న డిజిటల్, కంప్యూటింగ్ అవసరాలకు ఎంతగానో తోడ్పడనుంది.
ఐఐటీ- మండీ, వీఎల్ఎస్‌ఐ సొసైటీ ఆఫ్ ఇండియా, సిరిల్ అమర్‌చంద్ మంగళదాస్ భాగస్వామ్యంతో జరిగిన ఈ సదస్సులో క్వాల్‌కామ్, మైక్రాన్ టెక్నాలజీ, సినాప్సిస్, ఎన్‌ఎక్స్‌పీ సెమీకండక్టర్స్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వైర్‌లెస్ టెక్నాలజీ, చిప్ డిజైనింగ్, మెమరీ స్టోరేజ్, పవర్ సిస్టమ్స్ వంటి అంశాలపై చర్చలు జరిపారు. పారిశ్రామిక జగత్తు ఎదుర్కొంటున్న వాస్తవ సవాళ్లను విశ్వవిద్యాలయాల పరిశోధనశాలలకు తీసుకువచ్చినప్పుడే నిరంతర భాగస్వామ్యాలు ఏర్పడతాయని నిపుణులు స్పష్టం చేశారు.
ఆచరణాత్మక పరిష్కారాలుగా
ప్రాథమిక పరిశోధనలు ఆచరణాత్మక పరిష్కారాలుగా మారి పారిశ్రామిక వ్యయాన్ని ఎలా తగ్గిస్తాయో డాక్టర్ ప్రీతి అదానీ వివరించారు. డేటా సెంటర్ల కూలింగ్ వ్యయాన్ని తగ్గించే సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా విద్యుత్ ఆదాతో పాటు కంప్యూటింగ్ వ్యయం తగ్గుతుందని ఈ సందర్భంగా ఆమె ఉదాహరించారు. పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన మాత్రమే కాకుండా యువత అందించే ఆవిష్కరణలు సామాన్యుల జీవితాలను ఏ మేరకు మెరుగుపరుస్తున్నాయనేదే సాంకేతిక విజయానికి నిజమైన ప్రమాణమని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
