దారుణం: ఇద్దరు బాలికలపై అత్యాచారం

ఘటనలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... దైలాపూర్ అనుబంధ గ్రామం ముకుందాపూర్ చెందిన 12ఏళ్ల బాలిక ఇంట్లోనే ఉంటూ పశువులను మేపుతోంది. అదే గ్రామానికి చెందిన తిమన్నగుంట భీమప్ప తాండూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నవంబర్ 2న పని నిమిత్తం బాలిక తల్లిదండ్రులు తాండూరుకు వెళ్లారు.
ఈ విషయాన్ని గమనించిన భీమప్ప బాలికకు మాయ మాటలు చెప్పి గ్రామ శివారులోని పొలాల్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత విషయం బయటపడుతుందనే భయంతో బాలికను పొలాల వద్దే కాళ్లు, చేతులు కట్టేసి నిర్బంధించాడు. ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు తమ కూతురు కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అదృశ్యమైన రోజు తమ కూతురు భీమప్పతో మాట్లాడుతుండగా వారు వారించారు. భీమప్పే తన కూతురును అపహరించి ఉంటాడని భావించిన వారు భీమప్పను ప్రశ్నించడంతో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న భీమప్ప బాధిత బాలికను తీసుకుని పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను తాండూలోని ఆస్పత్రికి తరలించారు.
మరో ఘటనలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పెద్దేముల్ మండలంలోని మన్సాన్ పల్లికి చెందిన 16ఏళ్ల బాలికపై మంగళవారం రాత్రి అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పంచాయతీ పెట్టి ఆ బాలికను పెళ్లి చేసుకోవాలని లేదా రూ. 5 లక్షలు చెల్లించాలని పెద్దలు తీర్పు ఇవ్వడంతో వివాహితుడైన లక్ష్మణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కాగా అతని కుటుంబ సభ్యులు లక్ష్మణ్ ఎలాంటి తప్పు చేయలేదని తెలుపుతున్నారు. ఇరువర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications