• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శ్రీశ్రీపై ఆరుద్ర వైయక్తిక విమర్శ

By Staff
|

తెలుగుసాహిత్యాన్ని విప్లవ సామిత్యం వైపు, సామాన్య ప్రజల ఆలోచనలను ఆ దిశగా కదిలించి గొప్ప సంచలనానికి కారణమైన శ్రీశ్రీ పట్ల, అతని బంధువు, సమగ్రాంధ్ర సాహిత్య నిర్మాత, విమర్శకుడు, పరిశోధకుడు, కవి అయిన ఆరుద్ర (భాగవతుల సదాశివశంకరశాస్త్రి) కొన్నిసార్లు ఎలా ప్రతిస్పందించారో గమనిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. కవుల మధ్య మేధో వైవిధ్యం సర్వసాధారణంగా ఉంటుంది. అలాంటిది కాకపోయినా 'ఏవో కొన్ని కారణాల' వల్ల ఆరుద్రకి శ్రీశ్రీతో విభేదాలు రావడం, అప్పుడు అతడు ఎలా ప్రతిస్పందించారో కింది విధంగా చూడగలిగే అవకాశం వుంది.

శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) విషయంలో ఆరుద్ర కొన్ని వైయక్తిక అనుభూతులకు లోనైనట్లు కనిపిస్తుంది. అభ్యుదయ కవిగానే కాకుండా 'అభ్యుదయం' అనే పేరుతో ఓ కవితను రాసినవాడు శ్రీశ్రీ. ఆరుద్ర, శ్రీశ్రీ బంధువులు. ఇద్దరూ కొన్నాళ్లు మద్రాసులో కలిసి బతికినవారు. మార్క్సిస్టు జెండాల్ని మోసినవారు. పార్టీ సమావేశాల్లో పొల్గొన్నవారు. మొదట్లో ఆరుద్రని శ్రీశ్రీ ప్రోత్సహిస్తూ కవిత్వంలో గల లోటుపాట్లను తెలియజేసినవాడు. అలాంటి శ్రీశ్రీతో సైద్ధాంతిక విభేదాలు రావడంతో ఇరువురూ తీవ్రంగా విమర్శించుకున్నారు. ఈ విమర్శలు వైయక్తిమైతే పరిశోధకుడుగా ఆరుక్షద్రను గాని, కవిగా శ్రీశ్రీని గాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాని ఈ విమర్శల వల్ల సాహిత్యానికి కొంత నష్టం వాటిల్లింది. అభ్యుదయ, విప్లవ కవిగా మార్క్సిస్టు దృక్పథాన్ని ప్రదర్శించిన శ్రీశ్రీలోనూ కొన్ని ఇజాల పట్ల తొణికిసలాట కన్పిస్తున్నా, ప్రధానంగా కనిపించేది మార్క్సిజమే! దీన్ని సూటిగా విమర్శకుడు, పరిశోధకుడు నిరూపించవలసిన అవసరం ఉంది. కానీ తనతో సంబంధబాంధవ్యాలు సక్రమంగా కొనసాగినంత కాలమూ ఒక పద్ధతిలోనూ, తర్వాత మరొక రకంగానూ విమర్శను కొనసాగించడం ఒక విమర్శకుని దృక్పథాన్ని పట్టి చూసినప్పుడు సద్విమర్శను కొనసాగించలేదని నిరూపితం కావడం తప్పుదు. ఆరుద్రలో శ్రీశ్రీ పట్ల ఇలాంటి విమర్శనా దృక్పథం కనిపిస్తుంది. సమగ్రాంధ్ర సాహిత్యంలో కొన్ని విషయాల్లో ఆరుద్ర వ్యాఖ్యానాలు ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. వాటిని కింది విధంగా పరిశీలించవచ్చు. ఆరుద్ర, శ్రీశ్రీపై వ్యక్తీకరించిన కొన్ని అభిప్రాయాల్ని యధాతథంగా కింద పేర్కొనడం ద్వారా ఆరుద్ర దక్పథం స్పష్టమవుతుంది. "శ్రీశ్రీ ఆరవింద ఘోష్‌ను ఎప్పుడూ అరవింద ఘూస్టు అని పేర్కొనేవాడు'' (స. ఆ. సా. 13 సం. పు. 96).

"మహాప్రస్థానం గీతానికి నజ్రల్‌ ఇస్లామ్‌ కవితా, హరీన్‌ రాసిన 'షురూ హువా హై జంగ్‌' అనే పాటా, శిష్ట్లా రచించిన 'మారో - మారో - మారో' అనే పాటా ప్రోద్బలాలని, అయినీత తన గీతరచనకు ఉత్తేజితమచ్చినవేవో 'చిరకాలం' దాకా శ్రీశ్రీ చెప్పలేదు'' (స. ఆం. సా., 13 సం. పు. 146). దీన్ని ఇటీవల పునర్ముద్రణ చేసిన తెలుగు అకాడమీ (నాల్గవ సంపుటి పు. 764) కూడా మార్చకుండానే ప్రచురించింది.

రుక్మిణీనాథ శాస్త్రి చెప్పిన కొత్త కవులంతా తన అనుయాయులే అని «ధ్వనిస్తూ శ్రీశ్రీ పద్యాలనే వాడుడు అనే గీతాన్ని శ్రీశ్రీ రాశాడు.

"రెండు ట్వింకిల్‌ ట్వింకిల్‌ థియేటర్‌ స్లార్లు

రెండు ఆరుద్రాభిషేకాలు

రెండు రిక్షాపై మౌనశంఖాలు

రెండు విబ్జియార్భాటాలు

రెండు హనుమత్‌ శాస్త్రాలు

రెండు నమస్కరించదగ్గ నారాయణాస్త్రాలు

రెండు నామరహిత ఫిడేలు రాగారా బాలు

రెండు పఠాపిఠా కఠోర కురారాలు

రెండు గోరా వీణా వినాయకా రాగాలు"

ఈ పాదాలలో లిటిల్‌ థియేటర్‌ ఉద్యమాన్ని నడిపిన అబ్బూరివారూ, నేనూ ( ఆరుద్ర) మౌనశంఖం వ్రాసిన నారాయణబాబూ, విబ్జియార్‌ రాసిన సింగరాచార్య, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రీ, విశ్వనాథ సత్యనారాయణ, పఠాభీ, పిఠాపురం యువరాజా, గోరాశాస్త్రి అందరూ శ్రీశ్రీ ప్రభావంలోని వాళ్లే అన్నది కవిహృదయం. కాని వాస్తవానికి వీళ్లంతా శ్రీశ్రీ హృదయంలో మెదిలే కవిసింహాలు, సింహకిశోరాలు'

"శ్రీశ్రీ సాహిత్య జీవితంలో పరిస్థితులకు వ్యక్తిగత జీవితంలో పరిస్థితులకు సమన్వయం సైకాలజిస్టులే చేయగల ప్రయత్నం" (స. ఆం. సా. 13వ సం. పు. 264)

ఇవన్నీ సమగ్ర ఆంధ్ర సాహిత్య 13వ సంపుటిలో శ్రీశ్రీ పట్ల ఆరుద్ర చేసిన వ్యాఖ్యలు. ఆరుద్ర తన 'గురజాడ గురుపీఠం'లో 'సంకల్పం' శీర్షికతో ముందు మాట రాసుకొంటూ...

"జాఢ్యం ముదిరినవాడు తానే ఆద్యుడనుకొంటాడు. 1972లో నేనూ ఈ పాతికేళ్ల సాహిత్యం అనే వ్యాసంలో ఇతగాడు 1939 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడపించింది. ఆ తర్వాత నుంచీ దాన్ని నేను నడిపిస్తున్నానని నిస్సార స్వోత్కర్ష చేసుకున్నాడు. బండిచక్రం మీదనున్న ఈగ ఆ బండిని తానే కదిలిస్తాననుకొంటుంది. చారిత్రక, భౌతికవాది ఎవరూ యిలా అనుకోరు. 1930 నుంచీ తెలుగు సాహిత్య చరిత్ర శ్రీశ్రీ స్వీయ చరిత్ర అని కూడా ఆ ప్రబుద్ధుడు నొక్కి వక్కాణించాడు" అని అన్నారు.

1981లో వేగుంట మోహనప్రసాద్‌ ? అనే తెలుగు కవితల ఆంగ్లానువాదాల సంకలనంలో ? అని అంకిత వాక్యాలు రాయడాన్ని ఆరుద్ర అంగీకరించలేదు. దీన్ని ఆరుద్ర ఖండించినట్లే రోణంకి అప్పలస్వామి కూడా వ్యతిరేకించిన ఉత్తరాన్నీ, కథనాన్ని పేర్కొన్నారు. అంతేకాక, శ్రీశ్రీ తనను కాదన్న వారిపై విరుచుకుపడ్డారని, వార్ధక్యంలో గురువింద గింజవాడిలా ప్రవర్తించారని ఆరుద్ర వ్యాఖ్యానించారు. శ్రీశ్రీని అభ్యుదయ కవిత్వానికి యుగకర్తగా చాలామంది సాహితీవేత్తలు అంగీకరిస్తున్నారు.

1930 నుంచి ఎలా వున్నా 1947 నుండి 1955 సంవత్సరాల మధ్య వెలువడిన అభ్యుదయ కవుల కవితాసంకలనాల్ని పరిశీలిస్తే శ్రీశ్రీ ప్రభావానికి లోనుకాని అభ్యుదయ కవి కన్పించడని రామమోహన్‌ రాయ్‌ పేర్కొన్నారు. ఇలాంటి అభిప్రాయాలు విమర్శకుల్లో వుండగా ఆరుద్ర కూడా శ్రీశ్రీతో సైద్ధాంతిక విభేదాలు ఏర్పడక ముందు అభ్యుదయ కవి, విప్లవకవిగా శ్రీశ్రీ గురించి చెప్పారు. ఈ అభిప్రాయం 1955-69లలో రాసిన కలం చిత్రాలులో సంప్రదాయం తెలిసిన విప్లవకారుడు, తెలుగుతనం జీర్ణించుకున్న జగత్‌ పౌరుడుగా కూడా అభివర్ణించారు. డా. సి. నారాయణరెడ్డి తన సిద్ధాంత గ్రంథంలోనూ శ్రీశ్రీని అభ్యుదయకవిగానే చెప్పారు.

ఆరుద్ర, శ్రీశ్రీ, అబ్బూరివారితో తర్కించి కవిత్వంగా రాసిన 'సాహిత్యోపనిషత్‌'లో శ్రీశ్రీ అభిప్రాయంగా కవి ప్రగతిశీల భావాలు కలవాడు కావాలని ఆకాంక్షించినట్లు వర్ణించడంలో మార్క్సిస్టు దృక్పథాన్ని తనదైన దృక్పథంతో ప్రకటించడం కనిపిస్తుంది.

శ్రీశ్రీ అభిప్రాయంగా ఆరుద్ర రాసిన కవిత్వంలో శ్రీశ్రీ పట్ల ఆరుద్ర దృక్పథం దీనిలోనూ తెలుస్తుంది. అయితే అంతకు ముందే స్వయంగా శ్రీశ్రీ 'దేశచరిత్రలు'లో ఈ భావాల్ని మరింత స్పష్టంగా కవిత్వీకరించారు. దీన్ని 'చరిత్ర నిర్మాతలు ప్రజలు. ఏ రాజులో వారి తాబేదారులో కాదు అన్న చారిత్రక భౌతికవాద దృక్పథాన్ని కవితామయం చేసి, ప్రతిభావంతంగా రాసినవాడ''ని ఎస్వీ సత్యనారాయణ, శ్రీశ్రీలో కనిపించే మార్క్సిస్టు దృక్పథాన్ని వివరించారు. ఇంత స్పష్టంగా చెప్పకపోయినా, డొంక తిరుగుడు పద్ధతిలోనైనా శ్రీశ్రీని అభ్యుదయకవిగా, మార్క్సిస్టు దృక్పథంలోనే ఆరుద్ర వివరించకతప్పలేదు. శ్రీశ్రీని డిస్కవర్‌ చేయడమే కాక, నజ్రుల్‌ ఇస్లాం గీతాలను ఎన్నింటినో మూలం నుండి చదివి వినిపించి, శ్రీశ్రీ తిరుగుబాటులో తిప్పిన ఘనత నిస్సందేహంగా పురిపండా అప్పలస్వామికే దక్కుతుందనడంలో బలవంతంగా మార్క్సిజంలోకి శ్రీశ్రీ లాక్కొని రాబడ్డాడు గాని స్వతహాగా రాలేదనేది స్ఫురించేటట్లు ఆరుద్ర వ్యాఖ్యానించారు. (స. ఆం. సా. 13వ సం. పు. 119)

ట్రాట్‌స్కీ 'రష్యా విప్లవం', క్రో పాట్కివ్‌ 'విప్లవ సందేశం', బుఖారిన్‌ 'చారిత్రక భౌతికవాదం' ఇంకా ఇటలీ విప్లవకారుడు 'మజ్జనీ చరిత్ర' సామ్యవాద సిద్ధాంతం పట్ల శ్రీశ్రీని ప్రభావితం చేశాయన్నారు. అలాంటి శ్రీశ్రీ ప్రత్యక్షంగా పార్టీ కార్యకలాపాల వల్ల మార్క్సిస్టు సిద్ధాంతం తెలియదని తానే చెప్పుకున్న ఉదంతాన్ని వివరించి, ఆదిలో మార్క్సిస్టు లైనులోకి శ్రీశ్రీని తీసుకొచ్చిన అబ్బూరివారు ఎంత ప్రయత్నించినా అతణ్ణి ఆ దారిలోంచి పక్కకు తప్పించలేకపోయారన్నారు. (స. ఆం. సా. 13వ సం. పు. 106)

శ్రీశ్రీ జీవితాన్ని, రచనల్నీ విమర్శించడంలో ఆరుద్ర వ్యవహరించిన తీరును పరిశీలించిన విమర్శకుల్లో కెవియార్‌ వంటివారు, తమ విచారాన్ని వ్యక్తం చేశారు. కవి దాశరథి కూడా దీన్ని 'అనారోగ్యకర విమర్శనారీతి'గా వ్యాఖ్యానించారు.

(సోమసుందర్‌) పుస్తకానికి పీఠిక రాస్తూ ఆరుద్ర శ్రీశ్రీని కించపరిచే మాటలు రాయడం న్యాయమనించదు. శ్రీశ్రీవైపు నుండి తీవ్రమైన శరాఘాతాలు వచ్చినప్పుడు ఆరుక్షద ఉపేక్షిస్తే బాగుండేది. అభ్యుదయ యుగకర్తగా శ్రీశ్రీకి ఇవ్వవలసిన సముచిత స్థానాన్ని పనిగట్టుకొని భంగపరచజూస్తున్నట్లు ఇటీవల ఆయన రచించిన కొన్ని వ్యాసాల వల్ల అనిపిస్తున్నది అని ఆరుద్ర అభినందన సంచికలోనే రామమోహన్‌ రాయ్‌ ఆరుద్ర ఆనందహేల అనే వ్యాసంలో విమర్శించారు. దీన్ని ఆరుద్ర తన అభినందన సంచిక నుండి తొలగించకుండానే ప్రచురించడం విశేషం! ఇదే సంచికలో దేవులపల్లి రామానుజరావు ' ఆరుద్ర కవితలో భావప్రాధాన్యతతో పాటు అభ్యుదయ దృక్పథం ఒక ప్రత్యేకత, శ్రీశ్రీ పక్కన నిలువదగిన కవి ఆరుద్ర' అని రాస్తే, నండూరి రామమోహన్‌ రావు 'అభ్యుదయ కవిత్వానికి ఆదిరుద్రుడైన శ్రీశ్రీ ఆరుద్రను ఆరో రుద్రుడ'ని పేర్కొన్నాడు. నిజానికి ఆరుద్ర రెండో రుద్రుడు, శ్రీశ్రీ తర్వాత వెంటనే స్ఫురించే పేరు ఆరుద్రదే. 'అభ్యుదయ కవిత్వానికి ఒకరు మార్క్స్‌, మరొకరు ఏంగెల్స్‌' అని పేర్కొన్నారు. ఆరుద్ర జీవితం, రచనలపై పరిశోధన చేసిన ఎల్‌. సంగయ్య, ఆరుద్రపై మార్క్స్‌ సిద్ధాంత ప్రభావం ఉంది అని పేర్కొంటే, ఆరుద్ర షష్ఠిపూర్తి అభినందన సంచిక (1985)కి సంపాదకుడిగా వ్యవహరించిన బి. ఎస్‌. ఆర్‌. కృష్ణ 'శ్రీశ్రీ - ఆరుద్ర'ల మధ్య వివాదాన్ని గురించి రాస్తూ 'కొందరికి కోపం, కొందరిలో నిరసన, మరికొందరిలో విచారం కలిగించాయి. వారివారి ఆలోచనాధోరణులను బట్టి ఈ తరతమ భేదాలు.. వ్యక్తివికాసం అందరిలో ఒక లాగ మూసపోసినట్టు జరగదు. ఊహ తెలిసి, ఊహలు పెరిగిన కొలది సాలోచనాపరుల ఆలోచనలు వివిధ దశలలో వేరువేరు దిశలు విస్తరిస్తుంటాయి. శ్రీశ్రీ ఒక సిద్ధాంతానికి నిబద్దుడైన కవి కాగా, ఆరుద్ర ఏ ఒక్క సిద్ధాంతమూ పరిపూర్ణమైనది కాదన్న నమ్మికతో పూర్ణమానవవాది అయినాడు' అని ఇరువురి దృక్పథాల్ని విశ్లేషించారు. ఈ షష్ఠిపూర్తి సభలోనే అధ్యక్షోపన్యాసం చేసిన జస్టిస్‌ చిన్నపరెడ్డి హేతుసమ్మితమై శాస్త్రగతమైన దృక్పథంతో కానీ పాత అంతా రోత అనక, నవ్యతను గ్రహిస్తూ నవీన మార్గాలను సూచిస్తూ రచయితగా, విమర్శకునిగా పయనిస్తాడని ఆరుద్ర ఆలోచనల మీద, రచనల మీద మార్క్సిజం వెలుగు ప్రసరించడం వల్ల మార్క్సిస్టు, హ్యుమనిస్టు అనొచ్చు'' అన్నారు.

ఇంత మంది అభిప్రాయాల్లో కూడా శ్రీశ్రీ, ఆరుద్రల దృక్పథాలు వెల్లడవుతున్నాయి. శ్రీశ్రీ - ఆరద్రల్లో భిన్న దృక్పథాలు కనిపిస్తున్నా శ్రీశ్రీలో మార్క్సిస్టు దృక్పథం స్పష్టంగా కనిపిస్తున్నా, కొన్నిసార్లు మార్క్సిస్టు వ్యతిరేక తాత్త్విక ఆలోచనలూ కనపిస్తిన్నాయి. ఎస్వీ సత్యనారాయణ మాటల్లో దీనికి సరైన సమన్వయాన్ని చూడగలిగే అవకాశం కనిపిస్తుంది. 'సాహిత్యాన్ని తానొక్కడే శ్రీశ్రీ నడిపిస్తున్నాననే భావం ఇలాంటి వాటిలో ఒకటి. కవిత్వరూపం విషయంలో శ్రీశ్రీ ప్రకటించిన భావం కూడా ఇలాంటిదే. ఇవన్నీ శ్రీశ్రీలాంటి ప్రజాకవి స్థాయిని తగ్గించవు కానీ ఆయన ఓ సందర్భంలో రాసినట్లు పబ్లిక్కున నిలబడితే ఏమైనా అంటాం అనే వాళ్లకు అవకాశం కల్గించాయన్నదే బాధ' ఇక ఆరుద్ర అన్నట్లు సైకాలిజిస్టులు కూడా శ్రీశ్రీ కవిత్వం అలా వెలువడడానికి గల కారణాల్ని విశ్లేషించారు. జీవితంలో తటస్థించిన కొన్ని పరిస్థితుల వల్ల సర్రియలిజం వంటి కవిత్వాన్ని రాయడానికి కారణమన్నారు. కానీ ఈ దృష్టితో ఆరుద్ర ఆ వ్యాఖ్య చేయకుండా వ్యక్తిగత రాగద్వేషం కనిపించడం వల్ల ఆరుద్ర విమర్శనాదృక్పథం, శ్రీశ్రీ విషయంలో ప్రత్యేకించి కొంత కళంకాన్ని ఆపాదించుకొన్నదనే చెప్పాలి. పురాణం సుబ్రహ్మణ్యశర్మ భావించినట్లు శ్రీశ్రీ - ఆరుద్రల విభేదాలు జాబిల్లి మీద మరకల వంటివి కావు. ఇరువురి వ్యక్తిత్వాల్లోనూ పెరగడాలు, తరగడాలు లేదనడం సరి కాదు.

వివిధ దృక్పథాలు ఆరుద్రలో కనపిస్తున్నాయని తన అభినందన సంచికలో ప్రకటించినా, ఏ విధమైన దృక్పథం తనదో ఒక మాట కూడా ప్రకటించకపోవడం ఆరుద్ర గురించి ఆలోచించవలసిన పరిస్థితినే కలిగిస్తుంది.

సుమారు వేయి మంది కవులు, రచయితల గురించి సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో విశ్లేషణ చేసిన విమర్శకుడు, పరిశోధకుడు అయిన ఆరుద్రలో కూడా రాగద్వేషాలు తప్పలేదు. రాగద్వేషాలకు అతీతంగా విమర్శ ఉండాలని, సత్యప్రకటనతో కూడి, సత్యాన్వేషణ వైపే పరిశోధకుడు పయనించాలని విమర్శ, పరిశోధన సూత్రాలు చెప్తున్నా ఆరుద్ర కూడా వీటికి అతీతుడు కాలేకపోయాడని శ్రీశ్రీ పట్ల గల ఈ విషయాలే నిరూపిస్తున్నాయి. ఆరుక్షద కూడా సాహితీవేత్త కంటే ముందు మనిషే కదా!

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more