• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మరాఠీతోపోల్చలేం: నలిమెల భాస్కర్‌

By Staff
|

బహు భాషావేత్త నలిమెల భాస్కర్‌. ఆయన అనువాదంలో దిట్ట. అనువాద విభాగంలో ఆయన తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం అందుకున్నారు. నలిమెల భాస్కర్‌ను కాలువ మల్లయ్య ఇంటర్వ్యూ చేశారు.

తెలంగాణ నుంచి వస్తున్న కథాసాహిత్యాన్ని ఏ భాషా సాహిత్యాలతో పోల్చవచ్చు.. ఎందుకు?

ఇప్పుడు తెలంగాణ నుంచి వస్తున్న కథా సాహిత్యానికి ఒక ప్రత్యేక దృష్టి వుంది. అది ప్రాంతీయ వాదంతో ప్రకాశిస్తున్న సాహిత్యం. ఈ సాహిత్యాన్ని మనతో పాటు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ముందుకు వెళ్తున్న విదర్భలాంటి ప్రాంతాల సాహిత్యాలతో బేరీజు వేసుకోవాల్సి వుంది. అయితే మన కథను కన్నడ కథలతో పోల్చవచ్చు. (అప్పటి నైజాం స్టేట్‌లో వుండిన బీదర్‌, గుల్బర్గా, రాయచూర్‌ జిల్లాల కథలతో) భౌగోళిక సామీప్యం వల్లనైతేనేమి, హైదరాబాద్‌ రాష్ట్రంతో కలసి వుండడం వల్లనైతేనేమీ వీటి మధ్య పోలికలు సహజం. అట్లాగే మరాఠీ సాహిత్యంతో కూడా పోల్చవచ్చునేమో చూడాలి. తెలంగాణ కథ అనకుండా తెలుగు కథ అన్న విస్తృతార్థంలో చూసినప్పుడు మన కథను బెంగాలీ, మలయాళ కథా సాహిత్యాలతో పోల్చుకోవచ్చు. స్వాతంత్య్రానికి పూర్వం నుండి యిప్పటి దాకా వచ్చిన అన్ని ఉద్యమాలూ, వాదాలూ ఈ భాషా సాహిత్యాల్లో ప్రతిఫలించాయి.

మరాఠా దళిత సాహిత్యానికి తెలంగాణ దళిత కథకు గల సంబంధ బాంధవ్యాలేమిటి?

మరాఠీ దళిత సాహిత్యాన్ని తెలంగాణ దళిత కథతో పోల్చలేం. కారణం-తెలంగాణలో ప్రధానంగా ప్రధానంగా దొరలు, భూస్వాములకు వచ్చిన పోరాట సాహిత్యమే ఎక్కువ. ఇక్కడ కులవివక్ష యితర ప్రాంతాలతో పోలిస్తే తక్కువ. కానీ మహారాష్ట్రలో అట్లా కాదు. అక్కడి దళితులు విపరీత వివక్షకు గురయినవాళ్లు. అందువల్లే అంబేడ్కర్‌ నాయకత్వంలోనూ, దళిత పాంథర్స్‌ ఉద్యమాల వల్లా అక్కడి సాహిత్యంలో దళిత ఛాయలు ప్రగాఢంగా కనిపించాయి. ఆ మేరకు అక్కడి దళిత కథ ఎంతో చిక్కబడింది. సారవంతమైంది. గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చింది. ఆత్మ చరిత్రలతో భారతీయ దళిత సాహిత్యంలోనే తలమానికమైంది. మనకు పోరాట కథ ఎంత చక్కగా వుందో, మరాఠీలకు దళిత కథ అంత చక్కగా, చిక్కగా వుంది. అందువల్ల తెలంగాణ దళిత కథను మరాఠీ కథతో పోల్చడం కుదరదు. పైగా తెలంగాణ దళిత కథ కారంచేడు, చుండూరు లాంటి సంఘటనల్ని విని, యితర సాహిత్యాలను చదివి వచ్చిన కారణం చేత అంత సాంద్రంగా లేదని నా భావన.

దక్షిణ భారతదేశ కథల్లో తెలంగాణ కథ స్థానం ఏమిటి?

సమున్నత స్థానం అయితే విషాదం ఏమంటే - ఈ స్థానాన్ని యితరులకు చూపే ప్రయత్నం మన వపు నుండి చేయకపోవడం. మన కథా సాహిత్యాల్లో దక్షిణ భారత సాహిత్యంలోకి ప్రవహింపజేసినప్పుడు దీని స్వారస్యం వాళ్లకు తెలిసి వస్తుంది. ఆ ప్రయత్నాలు తెలంగాణ ప్రాంతంలో వున్న రచయితలు, అనువాదకులు, సంస్థలు, విశ్వవిద్యాలయాలు, సాహిత్యాభిమానులు వెనువెంటనే చేపట్టాల్సిన అవసరం యివాళ ఎక్కువగా వుంది. భక్తవత్సల రెడ్డి మలయాళంలోకి, భార్గవీరావు కన్నడంలోకి, నా బోటి వాళ్లు తమిళంలోకి అనువాదాలు చేయగలిగినవాళ్లు. పైగా వీళ్లకు తెలంగాణ జీవితం పట్ల అవగాహన వుంది. తెలంగాణ కథకున్న జవజీవాలను తోటి ద్రావిడులకు చూపగలిగినప్పుడు మాత్రమే మన ఎత్తు తెలిసి వస్తుంది. ఏదేమైనా తెలంగాణ కథకు బలం ఎక్కువ.

తెలంగాణ కథలు ఎక్కువగా అనువాదం కాకపోవడానికి మాండలిక భాషా ప్రయోగం కారణమా?

అట్లా ఏం కాదు. ప్రధానంగా శ్రద్ధ లేకపోవడం. కథా రచయితలు సైతం తమ భాషలో కథలొస్తే చాలు అనుకోవడం. వ్యక్తులు కానివ్వండి, సంస్థలు కానివ్వండి... అనువాదాల మీద పెద్దగా దృష్టి పెట్టకపోవడం. మీరన్నట్లు... మాండలికం కొంత వరకు అడ్డంకి కావచ్చు. అయితే మనసుంటే మార్గముంటుంది. అసాధ్యమైతే కాదు గదా! అప్పటి తెలంగాణ కథలను శాంతాదత్‌గారు తమిళంలోకి అనువదించారు. అంటే - అప్పుడెవరో శ్రద్ధ తీసుకుని చేయించారు కనుక అదలా వెలుగు చూసింది. రచయితలు, అనువాదకులు, ప్రత్యేకించి విశ్వవిద్యాలయాలు, అకాడమీలు... సాహిత్య ఆదాన ప్రదానాల మీద దృష్టి పెట్టినప్పుడు మాండలిక సమస్య వుండదు. అయితే.. ఒరిజినల్‌ కథలో వున్నంత బలం అనువాద కథలో వుండదన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం.

తెలంగాణ కథా సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి తీసుకు వెళ్లడంలో మీరు చేసిన కృషిని వివరిస్తారా?

అల్లం రాజయ్య, రఘోత్తమరెడ్డి తదితరుల 'శ్వేతరాత్రులు', బి.యస్‌. రాములు 'పాలు' కథా సంపుటాలను తమిళంలోకి తీసుకెళ్లాను. అయితే అవి పుస్తకాలుగా రావాల్సి వుంది. కొన్ని కథలు అక్కడ పత్రికల్లో అచ్చయ్యాయి. మంచి స్పందన వచ్చింది. పైగా మన సాహిత్యాన్ని కొందరు యితర ప్రాంతాల వాళ్లు ఉన్నతమైనదిగా భావిస్తారు. దానికి కారణం - తెలంగాణ పోరాటం (నిజాం పీడనకు వ్యతిరేకంగా జరిగింది). పై రెండు కథబుూ సంపుటులలోని కథలు తప్ప యింకేమీ చేయలేదు. అయితే.. ఇప్పటి తెలంగాణ కథలు ఒక పదింటిని తమిళంలోకి అనువదించాలనే ప్రణాళిక ఒకటుంది.

తొలి, మలి, ఈ తరంలో తెలంగాణ నుంచి వస్తున్న కథా ధోరణుల గురించి మీరేమంటారు?

తొలి తరం కథారచయితలు అచ్చమైన తెలంగాణ వస్తువును, స్వచ్చమైన తెలంగాణ భాషలో వ్యక్తీకరించినవాళ్లు. అప్పటికి వాళ్లను కోస్తా ప్రామాణిక భాష పెద్దగా ప్రభావితం చేయలేదు. మలితరం రచయితలు చాలా వరకు ఈ ప్రామాణిక భాషా ప్రభావానికి గురయినవాళ్లు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ వల్ల ఏర్పడిన పరిణామమిది. మళ్లీ డెబ్బయ్యవ దశకం నుంచి అంటే తెలంగాణ ప్రాంత పోరాటం యిక్కడి భాషలోనే ఆవిష్కరించడం ప్రారంభమైన నాటి నుంచి ఈ తరం రచయితల దాకా.. తెలంగాణ కథలోని వస్తువు కానివ్వండి, భాష కానివ్వండి వెనుదిరిగి చూసింది లేదు. ఇప్పటి తెలంగాణ కథకు ప్రాంతీయత పెట్టని భూషణం. భాష వరం. శిల్పం బలం. అందువల్లే తొలితరం నుంచి నేటి వరకు, నేటి నుంచి అనంత భవిష్యత్తులోకి ప్రవహిస్తున్న సజీవ నది తెలంగాణ కథ.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X