బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల రెండో వారంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని ఇస్రో వాతావరణ నిపుణులు వెల్లడించారు. దీని ప్రభావంతో మే 11 లేదా 12వ తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. దీని ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రస్తుతం కొనసాగుతున్న ద్రోణి కారణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా బుధవారం తెల్లవారుజాము నుంచే గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా వాతావరణ హెచ్చరికలు..
రానున్న 48 గంటల్లో గుంటూరు, పల్నాడు, కృష్ణా, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గురజాల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి వంటి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మధ్యస్థ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 40-50 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అమరావతి వాతావరణ విభాగం తెలిపింది.
పార్వతీపురం మన్యం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల మెరుపులతో కూడిన తేలికపాటి ఉరుముల జల్లులు పడే ఛాన్స్ ఉంది. ఇక్కడ గాలి వేగం గంటకు 30-40 కిలోమీటర్లుగా ఉండవచ్చు. ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాలతో పాటు రాయలసీమలో కూడా అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు ఉరుములు, మెరుపుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు తమ పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.














Click it and Unblock the Notifications