సైద్ధాంతిక వాస్తవికత- సామాజిక వాస్తవికత
ప్రపంచ సాహిత్యంలో ఎక్కడైనా వుందో, లేదో గానీ, తెలుగు సాహిత్యంలో మాత్రం ఒక జాడ్యం వుంది. (సంస్కృత సాహిత్యంలో జరిగిన చర్చను బట్టి ఆ సాహిత్యంలో వుందనుకోవాలి) ప్రాచీన సాహిత్యంలో 'ప్రయోజనానికి', ఆధునిక సాహిత్యంలో 'నిబద్ధత'కు (నిమగ్నతకు కాదు) ఎక్కడ లేని ప్రాధాన్యం ఇవ్వడమే ఈ జాడ్యం. దీన్ని జాడ్యమని ఎందుకనుకోవాలంటే, సృజనాత్మకతను రెండో స్థానంలోకి నెట్టేస్తుంది కాబట్టి. నిజానికి, సాహిత్యానికి ఏదో రకమైన ప్రయోజనం ఉండి తీరుతుందనడంలో భేదాభిప్రాయాలు వుండనక్కర్లేదు. శ్రీశ్రీ చెప్పిన ప్రయోజన రహితమైన pure poetry వుండదు. దేన్నయితే శ్రీశ్రీ pure poetry గా పిల్చిడో, దానికి కూడా ప్రయోజన వుండి తీరుతుంది. సాహిత్యానికి ప్రయోజనం వున్నప్పుడు దాన్ని సృష్టించిన సాహిత్యవేత్తకు 'నిబద్ధత' వుండి తీరుతుందని, రచయిత దేనికి నిబద్ధుడై వున్నాడనే విషయంపై అతను లేదా ఆమె సృజించిన సాహిత్యం నెరవేర్చే ప్రయోజనం ఆధారపడి వుంటుందని చెబుతూ వచ్చారు. అది నిజమే కావచ్చునని మూస రచనలు చేస్తూ వచ్చారు; వస్తున్నారు.
సృజనాత్మక రచనలకు కాల్పనికత (భావ కవిత్వం గురించి చెప్పేటప్పుడు పరిమితార్థంలో వాడే కాల్పనికత కాదు), శైలి ప్రాణాలు. పాఠకులు సృజనాత్మక రచనలను మేధో సంపత్తిని పెంచుకోవడానికి చదువరు. కాబట్టి, సృజనాత్మక ప్రక్రియల్లో రీడెబిలిటీ ముఖ్యం. ఈ రీడెబిలిటీని సాధించి పెట్టేవే కాల్పనికత, శైలి. రీడెబిలిటీ లోపించిందంటే ఆ రచన సృజనాత్మక రచన కాదనుకోవాలి. సృజనాత్మక రచన హృదంతరాళంలో తుఫాను సృష్టించాలి. కానీ, అది జరుగుతోందా? చాలా రచనల విషయంలో, ముఖ్యంగా ఉద్యమాలకు నిబద్ధులై రాసేవారి రచనల్లో ఆ లక్షణం కొరవడుతోంది. అందుకే, రచనలు చేయడానికే కాదు, చదవడానికి కూడా నిబద్ధత వుండాలని కొంత మంది సృజనాత్మక ఉద్యమ రచనల పట్ల నిరసన వ్యక్తం చేయడం. తమ రచనల్లో కొరవడుతున్న లక్షణాన్ని గుర్తించకుండా, గర్తించ నిరాకరించి 'రాజకీయ సాహిత్య ఉద్యమకారులు' పాఠకులను నిందిస్తున్నారు. ఒక రకంగా వారిని కించ పరుస్తున్నారు.
సృజనాత్మక సాహిత్యంలో ఈ అవలక్షణానికి కారణాలేమిటి? దీనికి సమాధానం కోసం ఎవరూ ప్రయత్నించినట్లు లేదు. ప్రయత్నిస్తే జవాబు దొరకడం సాధ్యమే. (ఈ జవాబు దొరికిన ఇద్దరు ముగ్గురు తమ మానాన తాము రాసుకుంటూ పోతున్నారు) సిద్ధాంతాలకు కట్టుబడి ప్రయోజనాత్మక రచనలు చేస్తున్నామనే వారి నుంచే అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. మిగతా వారి విషయంలో ఈ సమస్యలు లేవు. సిద్ధాంతం వెలుగులో రచనలు చేస్తున్నామని చెప్పి తమ రచనలు చదవాలని డిమాండ్ చేసే సృజనాత్మక రచయితలు, తాము నిజంగానే సృజనాత్మక రచనలు చేస్తున్నామా అనే ప్రశ్న వేసుకోవడం అవసరం. 'సామాజిక వాస్తవికత'ను ప్రతిబింబించడానికి రచనలు చేస్తున్నామనే వీరు సృజనాత్మక రచనా లక్షణాలకు తిలోదకాలు ఇవ్వడం లేదా? దీని వల్లనే వారి రచనలు 'నిస్సారంగా' వుండడం లేదా? సిద్ధాంతాలకు కట్టుబడి ఆచరణలో వున్నవారిని అది బాధ పెట్టకపోవచ్చు. కానీ, 'రాజకీయ సాహిత్య ఉద్యమకారులు' పాఠకులను చైతన్య పరిచి, తమ సిద్ధాంతాల వైపు వారిని తిప్పుకోవడానకి రచనలు చేస్తారు. అంటే, జన సామాన్యం కోసం రచనలు చేస్తారు. మరో రకంగా చెప్పాలంటే, తమ సిద్ధాంతాల గురించి తెలియని వారి కోసం రచనలు చేస్తారు. (ఇదే జరగడం లేదు) అటువంటుప్పుడు, తప్పకుండా రీడెబిలిటీ సాధించాలి. అలా సాధించకుండా తమ రచనలు చదవాలని కట్టడి చేసే హక్కు రచయితలకు లేదు.
ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ఒక్క సారి పర్యాలోకిస్తే, సిద్ధాంతాలకు కట్టుబడుతూ, జీవితానికి కట్టుబడని రచనలే ఎక్కువగా వస్తున్నాయి. అంటే, సృజనాత్మక రచనల పేర చాలా వరకు 'సామాజిక వాస్తవికత'ను ప్రతిబింబించే నెపంతో 'సైద్ధాంతిక వాస్తవిక' రచనలు చేస్తున్నారు. అంటే తాము నమ్మిన సిద్ధాంతాలు నిరూపించడానికి (తమ సిద్ధాంతం కరెక్ట్ అని చెప్పడానికి) చేస్తున్న రచనలే ఎక్కువ. మరో రకంగా చెప్పాలంటే, సైద్ధాంతిక వాస్తవిక రచనలు సృజనాత్మక రచనల బోర్డు తగిలించుకుని మన ముందుకు వస్తున్నాయి. అందువల్ల, అవి జీవితాలను, జీవిత వాస్తవికతను, అంతిమంగా సామాజిక వాస్తవికతను ప్రతిబింబించడం లేదు. అంటే, సైద్ధాంతిక వాస్తవిక రచనలే ఎక్కువగా వస్తున్నాయి గాని సామాజిక వాస్తవిక రచనలు రావడం లేదు. అందుకే, వచన ప్రక్రియల్లో ఫ్లాట్ క్యారెక్టర్స్ తప్ప రౌండ్ క్యారెక్టర్స్ వుండడం లేదు. పాత్రల పరిణామక్రమ చిత్రీకరణ లేదు.
ఇది విప్లవ సాహిత్యానికే కాకుండా దళిత, స్త్రీవాద సాహిత్యాలకు కూడా వర్తిస్తుంది. అందుకే, అప్పుడప్పుడు సాహిత్యంలో 'స్తబ్దత' అనేది చర్చనీయాంశంగా మారుతోంది. విప్లవ సాహిత్యంలో లేదా దళిత సాహిత్యంలో లేదా స్త్రీవాద సాహిత్యంలో 'స్తబ్దత' చోటు చేసుకుంటుందే గాని సాహిత్యంలో స్తబ్దత చోటు చేసుకోవడం లేదు. దీనికి సైద్ధాంతిక వాస్తవిక రచనలే కారణం. సిద్ధాంతం గురించి అంతకన్నా ఎక్కువగా చెప్పలేని ఒక 'నిస్సహాయ దశ' వచ్చినప్పుడు సాహిత్యంలో స్తబ్దత చోటు చేసుకున్నట్లు అనిపిస్తుంది. అసలు సిసలు సృజనాత్మక రచయితలకు, కవులకు ఈ సమస్య లేదు. ఎందుకంటే, రచయితలకున్న పరిమితులు జీవితానికి లేవు. ఆ జీవితాన్ని దర్శించే రచయితల కంటి చూపు కొంత దూరమే చొచ్చుకుపోగలుగుతుంది.
మొత్తంగా, తెలుగు సృజనాత్మక రచయితలు ఎక్కువ మంది (అంటే నిబద్ధత గురించి ఎక్కువగా మాట్లాడేవారు) ఒక ప్రధానమైన అంశాన్ని విస్మరిస్తున్నారు. సిద్ధాంతం జీవితాన్ని అంటే సమాజాన్ని అర్థం చేసుకుని, విశ్లేషించే పనిముట్టు మాత్రమేననే విషయాన్ని గమనించడం లేదు. సమాజాన్ని ఒక దశలో విశ్లేషించిన సిద్ధాంతమే సత్యమని నిరూపించడానికి వారు చేస్తున్నారు తప్ప జీవితం చీకటి కోణాల గుట్టు విప్పే పని చేయడం లేదు. ఈ గుట్టు విప్పే సందర్భంలోనే సిద్ధాంతం క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. దాన్నే 'దృక్కోణం' అనవచ్చునేమో! ఈ దృక్కోణమే సామాన్యుడి నుంచి రచయితను వేరు చేస్తుంది. అందుకే, ఒక సంఘటన విషయంలో సామాన్యుడు.
స్పందించే తీరు ఒక రకంగానూ, రచయిత స్పందించే తీరు మరో రకంగానూ వుంటుంది. ఆ సంఘటనలను వున్నదున్నట్లు పేర్చడం 'సామాజిక వాస్తవికత'ను ప్రతిబింబించడం కాదు. మనుషులంతా ఇట్లా వుండాలని అనుకుని కొన్ని నిర్జీవ పాత్రలను సృష్టించి అందుకు అనుగుణంగా రాసుకుంటూ పోవడం కూడా కాదు. దీన్ని అంగీకరించి కూడా తమ రచనలు 'సంఘటనలను వరుసగా పేర్చే కంకాళాల' మాదిరిగా వుంటున్నాయనే విషయాన్ని అంగీకరించరు.
తెలుగు సృజనాత్మక సాహిత్యం సైద్ధాంతిక దారిలో నడుస్తోంది కాబట్టే త్రిపుర కథలను, పతంజలి, కేశవరెడ్డి నవలలను, రాయలసీమ రచయితల నవలలను, కథలను విశ్లేషించే విమర్శకులు కరువయ్యారు. వాటికి దుర్వ్యాఖ్యలు చేసేవారు ఎక్కువ మంది తయారయ్యారు. ఈ స్థితిలోనే కేశవరెడ్డి రాసిన నవలల మీద కొంత మంది ఆ మధ్య దుమ్మెత్తిపోశారు. అంటే, సామాజిక వాస్తవికత అంటే ఎదురుగా కనిపించేది మాత్రమే అనే గుడ్డి నమ్మకం పేరుకుపోవడమేనని అర్థం చేసుకోవాలి. ఈ గుడ్డి నమ్మకం సాహిత్యంలో పేరుకుపోవడమే కాదు కర్రపెత్తనం చేస్తోంది కూడా. ఈ పరిస్థితి వల్లనే కేశవరెడ్డి నవలలు సామాజిక వాస్తవికతను ఎంత సమర్థంగా ప్రతిబింబిస్తున్నాయో, అవి సృజనాత్మక రచనలు నెరవేరాల్సిన ప్రయోజనాన్ని ఎంత బలంగా నెరవేరుస్తున్నాయో తెలుసుకోలేకపోతున్నాం. అందువల్లనే కేశవరెడ్డి నవలలపై వచ్చిన విమర్శలకు జవాబు చెప్పేవారు లేకుండా పోయారు. సృజనాత్మక సాహిత్యం, విమర్శ రెండూ పరస్పర ప్రభావితాలు అనుకుంటే విమర్శకులు లేరని బాధ పడేవారు సృజనాత్మక రచయితలు వేళ్ల మీద లెక్కించ గలిగినంత మంది మాత్రమే వున్నారని గమనించడం అవసరం.
విప్లవ, దళిత, స్త్రీ వాద రచయితలు తాము చేస్తున్న తప్పేమిటో గుర్తించి తాము విశ్వసిస్తున్న సిద్ధాంతాలను కేవలం పనిముట్లుగా మాత్రమే వాడుకున్నప్పుడు సైద్ధాంతిక సృజనాత్మక రచనలకు కాలం చెల్లి (ఇది అత్యాశే అవుతుంది) సృజనాత్మక రచనలు వెల్లివిరుస్తాయి. దీనికి అవకాశం కల్పించడం నేటి అవసరం.












Click it and Unblock the Notifications