వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిష్‌ ట్లా కవిత

By Staff
|
Google Oneindia TeluguNews

తండ్రి
పోతావా యెంకట లచ్చీ
పొద్దుపొయ్యేదాక రావా!
పొద్దు పోయా మద్దూ మణిగా
సుద్దు పాటలు ఇందువు రాయే!

కొడుకు
అయ్యోవ్‌ ఆకలవుతుందే!
అమ్మేదిరయ్యోవ్‌! ఆకలవుతుందే!
ముందే పోయిందా అయ్యా, మాయమ్మ!
మన్నిడిసి మనయీటి కెళ్లిందా మాయమ్మ!

తండ్రి
నీకు నాకూ దూరమాయా!
కోటప్పకొండ లడ్డమాయా!
కోటయ్య దేముడి తిరునా లాయా!
కొడుకు కళ్ళూ కాలవ లాయా!

కొడుకు
అయ్యోవ్‌, ఆకలవుతుందే!

తండ్రి
యేడేండ్ల కొడుకే, యేడుత్తుండాడే!
యీడ ఆడా కెందు కీడకే రాయే!
కొడుకూ తండ్రీ కన్న కానోళ్ళు గొప్పా!

ప్రజ
నాయముగా నిన్నాదరించరు రారా!
పొద్దుపోయెనాగులుమాకు సుద్దులేల రారా!

తండ్రి
అబ్బీ, సిక్కంగా పొయరో ముంతలో,
ఆకలి ఆరాటాలణిగి పోవాల్రో!
కైపుతో కైలాసం తొంగి సూడాల్రో!
కతలు సెపుతాను!

ప్రజ
రావోయి రావోయి నాగులు మయ్యా
బొందితో కైలాసం తొంగి సూద్దాం!

తండ్రి
యిశారం పడుతుండే యెర్రిపిల్లాడా!
తొందరగ పోతుందని సైత్రమాసాన్ని
యిడిసిపొయ్యే యెర్రి కుర్రాడా!
ప్రామెలుగానీ యీశారంగానీ
సూపించటానికి సిగ్గడే పిల్లాడా!
సూడరా యీశోద్దెపు కష్టం!
నిద్రోటమైనా సౌక్కం గాదురా!
నిద్దర్లోనైనా నల్లసీకటేరా!

ప్రజ
పోదామా సావాసంగా
నిద్రలేనీ బద్రలేనీ లంకకేసీ!

తండ్రి
యెనకదినాల యెన్నెలలోనే
మనసు మాగిన మట్టిలోనే
మాయమాట మరుగులోనే
యింద్రబోగాలున్నాయి పిల్లో!

పోదామా...........................
ముద్దూ సుద్దూ పాడేరోజున
అద్దు దాటీ పోనీరోజున
యెన్నెల గిన్నెలో యేశానె పిల్లో
యెంకన్నసామికి యెండిముడుపులు!
పోదామా....

ప్రజ
వై రాజ్జ గుమ్మడియలో
ముద్దు లేదు ముడుపు లేదు
సుద్దు సిలక పాడయే!
వై రాజ్జ.......

తండ్రి
యెన్నెల గిన్నెలో యెంగిలి తిన్న
యెర్రమూతి యేడిమీద
మంచు పారినా కంచు పారినా
యెంగిలియేడి యెండలుండునే
పోదామా.....

కొడుకు
అయ్యోవ్‌, ఆకలవుతుందే!
అమ్మేది రయ్యోవ్‌ ఆకలవుతుందే!

తండ్రి
దూరా నుందిరోవ్‌ దేముడి లంక!
దేవ తుంది రోవ్‌ లంక దీపంలో!
గందమాని గాలిలంక రా!
పొన్నమాని మాట లంకరా!
పోదామా ముద్దుల కొడుకా
పొన్నమాని పొలిమేరలంకకి!
ఆకులాకులు సల్లం గుండయ్యోయి!
అడక్కుండానే దేము డుండాడోయి!
దేముడి దగ్గిరి సుట్టా లైనారోయి
దేముడి లంకలో దేవత లందరు!
పోదామా సావాసంగా
దేముడి లంక దిక్కు కేసి!

ప్రజ
ఏటికి ఒక రాజూ యెన్నెల
యాతా మెత్తాడూ యెన్నెల!
యాతా మెత్తీ యేర్లో యేత్తే
అడివికి పోయిందీ యెన్నెల!

తండ్రి
కల్లో లంకగా కానొత్తుందిరా
మంచు ముసుగులో దూరా నుందిరా!
నీడ సంద్రంలో నీడ నేల మీద
పున్నెం మడుసుల పురిటికల్లో లంకరా!
పోదామా....
యెన్నెల సంద్రంలో యెండీ బూముల్లో
యిసిత్రం పూలల్లో యాల పాటల్లో
గందాల గందర్వ కలవపూలంకలో
పిల్ల మనసుందిరో!

ప్రజ
పోదామా సావాసంగా
కలవపూల లంక కేసి!

తండ్రి
యెన్నెల యెలుతురు తెల్లారిపోగానె
పిల్ల పాట పొంగి పోగానే,
యేకువ పాటా, యెన్నెల్ల ఆటా,
ఆట పాటలో కలిసి పోవురా!
పోదామా.....
ఆరిపోయే ఆటపాటా
మాగిపోయే మరుగుమాటా
ఎరుపుకలవతో బంగారు మబ్బుతో
కలిసి మెలిసి తెల్లవారున్రా!
సీకటి పాటలో సిగిరించు రారా
సిగిరించుపాటలో సుక్క లున్నైరా!
సుక్కల్లవనంలో గొల్లభా ముందిరా
భామకళ్ళలో మిణుగురు లున్నైరా!

ప్రజ
పోదామా సావాసంగా
గొల్లభామ గోటులంక కేసీ!

తండ్రి
నీడలు నీడలు నీరుగా పారే
కన్నీళ్ళ మంచున కానొచ్చి కాన్రాక
నీడగా నిలిచినా నీటు గుందీ పిల్ల!
సోద్దెంగా సూసినా సక్కగుందీ పిల్ల!
రేతిర్లో రాయిగా మారినా చాల్రా
రేతిరి మనసుల రాయిగుండె లేన్రా!
సచ్చి నసంబరాలు సుక్కిన యింటిలో
మరుపులు రాని మాపటియింట్లో
మిడిగుడ్లు యేసుకుని మూలుగుతుండాల్రో!

ప్రజ
పోదామా సావాసంగా
మాపటియిల్లు మూసియేసి!

తండ్రి
రండ్రా రండ్రా!
తలో ముంత తాటిపానకం
తాగి తందనాల తబ్బిబ్బు లౌదాం
పాత పాటల్లో పాతకత లన్నీ,
పాతర తవ్వీ తూర్పార పోద్దాం!

కొడుకు
అయ్యోవ్‌ ఆక లవుతుందే.
అమ్మేది రయ్యోవ్‌, ఆక లవుతుందే!

తండ్రి
ముంతకల్లుతో మరిసి పోరా
కొడకో ! కల్లుర కొడకో!
తాగర కొడకో!
తాగి తాగి తాగి ఇప్పట్నుంచీ
తలపు లన్నీ అన్ని మరిసిపోరా!
పోతావా వెంకట లచ్చీ!
నువ్వు పోతే ముం తుంది లేవేవ్‌!

అందరూ
పోదామా సావాసంగా
కెపుతో కైలాసం!
చేదామా ముంత కల్లుతో
ఈశ్వరుడికి అబిశేకం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X