అసలు సిసలు సృజనశీలి
''నన్ను నేను అభివ్యక్తి పర్చుకోవడానికి రాస్తాను. నాలో ఓ శూన్యం వుంది. ఏకాంతం వుంది. దాన్ని భర్తీ చేసుకోవడానికి ఏదో చేయాలన్పిస్తుంది. దీన్ని సైకాలజీలో ఇంటెన్సివ్ డ్రయివ్ అంటారు. దీన్ని తృప్తి పరుచుకోవడానికే నా రచనా వ్యాసంగమంతా'' అని డాక్టర్ కేశవరెడ్డి ఒకనొక ఇంటర్వ్యూలో చెప్పారు. సమాజాన్ని ఉద్ధరించడానికి రచనలు చేస్తున్నాననేంత అహం కేశవరెడ్డికి లేదు. అందుకే ఇంకా మంచి రచయితగా, ఆ కాలం రచయితగా వున్నారు. నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లిలో ఒక ఆస్రత్రిలో ఆయన పని చేస్తున్నారు. పుట్టిందో ఎక్కడో చిత్తూరు జిల్లాలో.
మధరాంతకం రాజారాంను ఎక్కువగా ఇష్టపడే కేశవరెడ్డి సమకాలీన తెలుగు రచయితలెవరూ అందుకోలేని ఎత్తులో ఉన్నారిప్పుడు. ఆయన సృజనాత్మకత అటువంటిది.ఆయన రాసినవి కొద్ది రచనలే. కానీ, ఒక్కో నవల లేదా నవలిక ఒక్కో కావ్యం. 'బానిసలు- భగవానువాచ', 'స్మశానం దున్నేరు', 'అతడు అడవిని జయించాడు', 'రాముండాడు రాజ్జివుండాది', 'సిటీ బ్యూటిఫుల్', 'ఇన్ క్రెడిబుల్ గాడెస్', 'చివరి గుడిసె', 'మూగవాని పిల్లనగ్రోవి' ఆయన రచనలు.
మెడికోల జీవితాల గురించి రాసిన 'సిటీ బ్యూటీఫుల్' నవలను కాస్తో కూస్తో సాహిత్య పరిచయం వున్న వైద్య విద్యార్థులు ఇప్పటికీ పరవశంతో చదువుకుంటారు. ఇది ఒక పత్రికలో సీరియల్‌గా వచ్చింది. ఇప్పటి వరకు పుస్తకంగా రాలేదు. 'బానిసలు-భగవానువాచ' కూడా పుస్తకంగా రాలేదు. అలాగే 'ది రోడ్' అనే పెద్ద కథ వుంది. ఈ రెండు కేశవరెడ్డి తొలినాళ్లలో రాసినవి. ఉత్కంఠ భరితంగా సాగే ఈ రెండు కూడా పాఠకులను తమ వెంట తీసికెళ్లి హృదయంలో అలజడి రేపుతాయి. బయటకు సాధు జంతువుగా కనిపించే మనిషి లోపల ఎటువంటి హంతకుడో 'ది రోడ్' కథ చెప్తుతుంది. మనస్సరోవరంలో అల్లకల్లోలం రేగి మనల్ని పక్షాళన చేస్తుంది.
కేశవరెడ్డి రాసిన ''అతడు అడవిని జయించాడు అనే ఈ 60 పేజీల నవలిక మన హృదయంలో, నెత్తురులో, మేధస్సులో ఏకకాలంలో మహా విస్ఫోటనమై పేలుతుంది''. ''ఏమి నేర్చుకున్నాడు మనిషి? అతడు అడవిని జయించాడు లాంటి రసమయ రచనలను రచించడం'' అని సంజీవ్‌దేవ్ అన్నారంటే ఈ నవల విశిష్టత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ''సముద్రంలోకి, అడవుల్లోకి దాని బీభత్సంలోకి నౌక లేదా పడవ జారుకన్నట్లే మనం యిందులోకి తెలియకుండా ముసలివాని వెనుక, అతను వెతికే పందుల వెంట జారిపోతాం. అసలు పందుల కథ చదవడానికి ఎవరికి ఇష్టం వుంటుంది? మీ ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా మిమ్మల్ని ముక్కుతాడు వేసి అడవుల్లోకి మీరంగీకరించని, మీకు నచ్చని తావుల వెంట మీకు ఏ విధంగానూ యిష్టం లేని పందుల వెంట మిమ్మల్ని రచయిత హిప్నటైజ్ చేసి తీసుకువెళ్లడం ఆశ్చర్యం కదా!'' అని ఈ నవల గురించి పురాణం సుబ్రహ్మణ్య శర్మ అన్నారు. అతడు అడవిని జయించాడు అనే నవల హెమింగ్వే 'ఓల్డ్ మాన్ అండ్ సీ' అనే నవలకు అనుసరణ అని అన్నారు కొంత మంది. ఈ రెండు నవలలకు పోలికలున్నాయి. అయితే, ఓల్డ్ మాన్ సీ ప్రభావం అతడు అడవిని జయించాడు నవల మీద వుంది. ఈ కారణంగా అతడు అడవిని జయించాడు నవలకు వచ్చిన నష్టమేమీ లేదు. ఈ నవల సర్వ స్వతంత్ర రచనగానే విరాజిల్లుతుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే- అంటే నేను హెమింగ్వేను చాలా సమర్థంగా అనుసరించానన్నట్లే కదా, హెమింగ్వేను అనుసరించి విజయం సాధించడం చిన్న విషయమేమీ కాదు' అని కేశవరెడ్డి ఒకానొక సందర్భంలో అన్నారు.
'ఇన్ క్రెడిబుల్ గాడెస్' దళితుల గురించి రాసిన నవల. ఎక్కడికి వెళ్లినా, ఏ వూరు వెళ్లినా బాధలూ అవే, అణచివేత రూపమూ అదే అని చెప్పిన నవల. ఇటీవల వచ్చిన 'చివరి గుడిసె', 'మూగవాని పిల్లనగ్రోవి' చదివి అనందించాల్సిందే కానీ వర్ణించడం సాధ్యం కాదు. మూగవాని పిల్లనగ్రోవి ఒక రసమయ కావ్యం. దీన్ని మించిన రచన బహుశా తెలుగులో లేదు.
ఎంతో కాలంగా నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో వుంటున్న కేశవరెడ్డి తన ఊరి యాసను, బాసను మర్చిపోలేదు. ఆయన నవలలకు ఇతివృత్తాలన్నీ అక్కడివే. తన చిన్ననాటి సంఘటనలను నెమరేసుకుంటూ బాల్యంలోకి వెళ్లి పోయి ఆయన తన రచనలు చేస్తుంటారు కాబోలు. ఇంతటి సృజనాత్మక రచయిత తెలుగులో వుండకపోవచ్చు. ఆయన నవలలు పాఠకులను డిస్టర్బ్ చేస్తాయి. మనలోకి మనం తొంగి చూసుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయి. పాఠకులను తన రచన వెంట నడిపించే ఏ మత్తు మందో ఆయన తన రచనలకు పోస్తుంటారు కాబోలు! ఇన్నాళ్లుగా మీరు ఇక్కడ వుంటూ తెలంగాణా జీవితాన్ని చిత్రించే నవల ఒక్కటైనా రాయరా అంటే 'తప్పకుండా రాస్తా. దళం అనే నవల రాస్తా' అని ఆయన అంటున్నారట. కేశవరెడ్డి నవలలు చదివి తీరాల్సిందే గానీ వాటి గొప్పదనం గురించి మాటల్లో చెప్పలేం. ఇప్పటికింతే..
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications