సొంతలాభం కొంత మానుకుని....

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: ఆయన ముప్ఫయ్యెనిమిదేళ్ళ తెలుగు యువకుడు. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉద్యోగరీత్యా స్థిరపడ్డారు. సాఫ్ట్‌వేర్‌ సామ్రాజ్య రాజధాని సిలికాన్‌ వ్యాలీలోని ఫ్రీమాంట్‌ ఆయన నివాసం. మెలకువగా ఉన్నంతసేపూ కంప్యూటర్లతో సహజీవనం చేస్తుంటారు. మదన్‌మోహన్‌ పరిగికి సంబంధించిన వివరాలు క్లుప్తంగా యివీ! ఇందులో ప్రత్యేకంగా పేర్కొనవలసినవీ, విశేషంగా చెప్పుకోవలసినవీ ఏమున్నాయి? ఏమీ లేవనే చెప్పాలి. కానీ అసలయిన సమాచారం మీకింకా అందించనేలేదు. ఫ్రీమాంట్‌లోని స్వగృహం నుంచే మదన్‌ పరిగి అనే వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్నారు. అందులో తెలుగు భాష గురించిన, సంస్కృతి గురించిన వివరాలను ఆయన అందిస్తున్నారు. మౌలికంగా ఈ వెబ్‌సైట్‌ ఒన్‌ మ్యాన్‌ షో. అందువల్లనే "అది ఉండవలసినంత లోపరహితంగా లేద''ని మదన్‌మోహన్‌ అభిప్రాయం. వెబ్‌సైట్‌లోని telusa లింకు ద్వారా అమెరికాలోని, భారతదేశంలోని బర్మా-మారిషస్‌ లాంటి ప్రాంతాల్లోని తెలుగువాళ్ళతో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నారు మదన్‌. ''అమెరికాలోని భారతీయ భాషలవాళ్లు వాళ్ళ వాళ్ళ భాషలకు ఎంతో సేవ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఆ దిశగా మనవాళ్ళే ఎంతో వెనుకబడి వున్నారు. ఆ బాధతోనే నేను చిన్న ప్రయత్నం ప్రారంభించాను. ఇదేదో ఘనకార్యంగా నేను భావించడం లేదు. అలాగే ఇదో గొప్ప సాంస్కృతిక - సాహిత్య సేవాకార్యక్రమంగా గూడా నేననుకోవడం లేదు. దీన్ని నేను కనీస కర్తవ్యంగా మాత్రమే పరిగణిస్తున్నాను'' అన్నారు పరిగి మదన్‌మోహన్‌. తనను సాహితీ సుగతుడిగా పరిగణించవద్దనీ, సాధారణ ఉత్సాహిగా మాత్రమే గుర్తించాలనీ ఆయన పట్టుబట్టారు. కనీసం ఫోటోగ్రాఫ్‌ ఇవ్వడానికి గానీ, వ్యక్తిగతమైన వివరాలు వెల్లడించడానికి గానీ మదన్‌మోహన్‌ సుతరామూ అంగీకరించలేదు. ఆయన వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకోడానికి ఈ చిన్న వివరం సరిపోదా?

''నేను అమెరికాలోని ఓ ట్రాఫిక్‌ కోర్టుకు ఒకసారి వెళ్ళవలసి వచ్చింది. అదే కోర్టుకు ఒక గుజరాతీ మహిళ కూడా వచ్చారు. ఆమెకు మాతృభాష తప్ప మరో భాష రాదు. దాంతో న్యాయమూర్తి ఆమెకు ఒక దుబాసీని సమకూర్చమని ఆదేశాలిస్తూ కేసు వాయిదా వేశారు. అక్కడ నేను విచారించగా గుజరాతీ, మరాఠీ భాషల ప్రజలకు ఇది దాదాపు నిత్య వ్యవహారమేనని తెలిసింది. మనవాళ్ళు మాత్రం అలాక్కాదు. చచ్చీచెడీ అక్కడి భాష నేర్చుకుని ఆ భాషలోనే వ్యవహారం నడిపిస్తున్నారు. దీన్ని చూస్తే ఏమర్ధమవుతోంది? మనవాళ్ళకు జాతీయ స్పృహ ఉండాల్సినంత గాఢంగా ఉండడం లేదు. ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నది నా ప్రగాఢమైన ఆకాంక్ష. ఆ దిశగానే నా చిరు ప్రయత్నం ప్రారంభించాను'' అని వివరించారు మదన్‌మోహన్‌.

''ఫ్రీమాంట్‌లో మంచి లైబ్రరీలు ఉన్నాయి. విద్యార్ధులు, ఉద్యోగులు, గృహిణులు చాలా ఎక్కువమంది ఈ లైబ్రరీలను ఉపయోగిస్తుంటారు. ఆ లైబ్రరీల్లో అనేక భారతీయ భాషల్లోని పుస్తకాలు కూడా ఉన్నాయి. కానీ తెలుగు పుస్తకాలు మాత్రం దాదాపు లేవనే చెప్పాలి. అలాగే ఆడియో వీడియో క్యాసెట్లు, సీడీల విషయంలో కూడా మనవాళ్ళు ఎంతో వెనుకబడి ఉన్నారు. అక్కడి లైబ్రరీల అధికారులు ఎలాంటి పుస్తకాలు కానీ, క్యాసెట్లు గానీ డొనేట్‌ చేస్తే ఆనందంగా తీసుకుంటారు. వినియోగదారులకు ఉపయోపగడేలా లైబ్రరీలను తీర్చిదిద్దాలన్నదే వాళ్ళ ఉద్దేశం. కానీ మనవాళ్ళకు అనవసరమైన జంకుగొంకులు అడ్డం వస్తున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నదే నా కోరిక'' అన్నారు పరిగి మదన్‌మోహన్‌.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X