కొల్లాయిగట్టితేనేమి?

Posted By:
Subscribe to Oneindia Telugu

(ప్రముఖ నవలా రచయిత మహీధర రామమోహనరావు ఇటీవల కన్ను మూశారు. ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవ ఎనలేనిది. ఆయన మన మధ్య లేకున్నా ఆయన రాసిన నవలలుంటాయి. అవి అందించిన సందేశం వుంటుంది. ఆయన రాసిన 'కొల్లాయి గట్టితేనేమి?' నవలను రాచమల్లు రామచంద్రారెడ్డి 'సంవేదన' 1968 ఏప్రిల్‌ సంచికలో సమీక్షించారు. మహీధరకు నివాళి అర్పిస్తూ ఈ సమీక్షావ్యాసంలోని కొన్ని భాగాలను అందిస్తున్నాం)

1919-20 నాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను చిత్రించే ప్రయత్నంలో శ్రీ మహీధర రామమోహనరావుగారు రచించిన నవల 'కొల్లాయి గట్టితేమి?'.
...... ..... .....

ఈ కథా క్రమంలో (కొల్లాయి గట్టితేనేమి? కథాక్రమంలో' 1920 నాటి ఆంధ్రదేశ చారిత్రక పరిస్థితులు విపులంగా గాఢంగా, కన్నులకు కట్టినట్లు చిత్రితమైనాయి. రచయిత దీన్ని కేవలం సాంఘిక నవలగా కాక, చారిత్రక నవలగా ఉద్దేశించినట్లు స్పష్టంగా తెలుస్తున్నది. చారిత్రక నవల కుండవలసిన లక్షణాలన్నీ ఈ నవలకున్నాయి.
...... ...... ......

ఫ్యూడల్‌, బూర్జువా ధర్మాలకు జరిగిన చారిత్రక ఘర్షణే యితివృత్తంగా గల ఈ నవలలో బూర్జువా ధర్మానికి రామనాథం ప్రతినిధి. బ్రాహ్మణ గ్రామమైన ముంగండను కథాస్థలంగానూ బ్రాహ్మణ యువకుడైన రామనాథాన్ని కథానాయకుడుగానూ రచయిత స్వీకరించినాడు. తెలుగుదేశంలోని వేలాది గ్రామాలకు ఒక బ్రాహ్మణ గ్రామం ప్రతినిధి కాజాలదని, తెలుగుదేశంలోని లక్షలాది యువకులకు ఒక బ్రాహ్మణ యువకుడు ప్రతినిధి కాజాలడని అనిపించవచ్చు. కానీ, ఫ్యూడల్‌ ధర్మాలకూ, బూర్జువా ధర్మాలకూ జరిగిన ఘర్షణను చిత్రించేటప్పుడు ఫ్యూడల్‌ వ్యవస్థను అత్యంత ఘనీభూతరూపంలో చిత్రిస్తే తప్ప ఆ ఘర్షణ యొక్క తీవ్రతా, వ్యగ్రతా వ్యక్తం కావు.
...... ...... ........

నవలకు గానీ, యే సాహిత్య రూపానికి గానీ చరమ ప్రయోజనం ఒకటే- పాఠకునికి ఉత్తమ సంస్కారం కలిగించడం. ఇది పాఠకుని హృదయం మీద గాఢమైన అనుభూతుల ముద్రలు వేయడం ద్వారా జరుగుతుంది. కానీ, పాఠకునికి వివేకాన్ని ప్రబోధించడం ద్వారా జరగదు. రామమోహనరావుగారి రచనా తత్వంలో జ్ఞానదాన దృష్టి బలంగా వున్నందు వల్లనే గతంలో ఆయన రచించిన 'ఎవరి కోసం', 'కత్తుల వంతెన' అనే నవలలు కళాత్మకంగా దెబ్బ తిన్నాయి. ఈ జ్ఞాన దాన దృష్టి 'కొల్లాయి గట్టితేనేమి?'లో అంత బలీయంగా లేదు గానీ, ఆ వాసన పూర్తిగా చావనందు వల్లనే నవలలోని సంభాషణలు నిర్జీవంగా తయారైనాయని నా అనుమానం.
..... ...... ......

ఒకటి రెండు లోపాలు వున్నా ఆనాటి చారిత్రక వాస్తవాన్ని చిత్రించడంలో ఈ నవల సంపూర్ణంగా కృతార్థమైంది. ఆనాటి సాంఘిక దురాచారాలు, అంధ విశ్వాసాలూ, కరడు గట్టిన ఛాందస అజ్ఞానమూ, ప్రభుత్వ దమన నీతి, ప్రభుత్వ అధికార్లలోని బానిస తత్వమూ, వీరికి వ్యతిరేకంగా యువకులూ, దేశభక్తులూ, విద్యావంతులూ సాగించిన పోరాటాలూ, ఆ పోరాటాల ఫలితంగా యేర్పడిన హృదయ తాపాలూ, మానసిక సంక్షోభాలు, కుటుంబ విచ్ఛేదాలు అన్నీ కన్నులకు కట్టినట్లు చిత్రితమైనాయి.

అన్నీ పాఠకులకు ప్రత్యక్షానుభూతులుగా రూపు ధరించినాయి. చెప్పుకోదగిన చారిత్రక నవల అంటూ లేని తెలుగు సాహిత్యంలో యీ నవలకున్న స్థానం అమూల్యమైనది. దురదృష్ణవశాత్తు తెలుగులో చారిత్రక నవలాకారులుగా పేరుకెక్కిన వారందరూ ఫ్యూడల్‌ కుసంస్కారానికీ, సనాతన మూఢాచారాలకూ అంతో ఇంతో బానిసలైనవాళ్లే. వాళ్లు రాసిన నవలల్లో గతకాలపు మూర్ఖత్వాలకూ, అజ్ఞానానికి, బానిసబుద్ధికి, భోగలాలసతకూ, ధర్మ పరిరక్షణ పేరుతో పట్టాభిషేకం చేయడం తప్ప నిజమైన చారిత్రకత అనేది దాదాపు శూన్యం. ఫ్యూడల్‌ సంస్కారాన్నే గాక, బూర్జువా సంస్కారాన్ని కూడా అధిగమించి, పరిపూర్ణమైన భౌతికవాద దృక్పథం జీర్ణించుకున్నవాడు తప్ప చరిత్రను సరిగా అర్థం చేసుకోలేడు.

గత కాలపు ఘటనలను యీనాటి విజ్ఞాన వివేకాలతో అధ్యయనం చేయగలిగేదే చరిత్ర. గతకాలపు రాజులను గురించి వారి వంది మాగధులు చెప్పిన స్తోత్ర పాఠాలే తిరుగులేని చారిత్రక ప్రమాణాలుగా స్వీకరించినవాళ్లు రాసినవే యీనాటి వరకు మనకు చారిత్రక నవలలుగా ప్రసిద్ధి పొందుతూ వచ్చినాయి. తెలుగు నవలాకారులలోనే కాదు, మన జాతీయ పోరాట కాలంనాటి తెలుగు కవుల దేశభక్తి కవిత్వం నిండా యీ గత వైభవ సంకీర్తనా జాడ్యం కరుడు గట్టుకొని వుంది. గురజాడ వలె ''మంచి గతమున కొంచెమేనోయ్‌'' అని చెప్పగలిగిన ఆధునిక మనస్తత్వం మన రచయితల కెవ్వరికీ పట్టుబడనే లేదు. గురజాడ కాలంనాడు, రచింపబడిన 'విజయనగర సామ్రాజ్యం' అనే చారిత్రక నవల మీద రాసిన విమర్శను యిక్కడ స్మరించడం అప్రస్తుతం కాదనుకుంటాను. చిత్రమేమంటే గురజాడ మరణించిన 50 యేండ్ల తర్వాత కూడా తెలుగు చారిత్రక నవల దాదాపు అదే స్థాయిలో వుండడం.

అంత కంటే బాధాకరమైన విషయమేమంటే గురుజాడ అంతగా తిట్టిపోయిన ఆ నవల యీ నాటికీ పునర్ముద్రణలు పొందుతూ వుంది. తెలుగుదేశపు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యగ్రంథంగా మన్ననలు పొందుతూ వుంది. తెలుగుదేశపు విద్యావంతుల చారిత్రక పరిజ్ఞానానికి, ఆధునిక మనస్తత్వానికి యింతకు మించిన నిదర్శనం వుండబోదనుకుంటాను. తెలుగు చారిత్రక నవలను ఆవరించిన యీ గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ యీనాటికీ వేగుచుక్కలాగ ఉద్భవించింది, రామమోహనరావుగారి 'కొల్లాయి గట్టితేనేమి?'. అందువల్ల యీ నవలకు మన సాహిత్యంలో ఒక చారిత్రాత్మకమైన స్థానం వుంటుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X