వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరిగిన రెక్కల సీతాకోకచిలుక శివాజీ

By Staff
|
Google Oneindia TeluguNews

నలుపూ తెలుపూ కలనేత గెడ్డం-నుదుటి మీద బారెడు బట్టతల-పాత తెలుగు సినిమాల్లో ఫ్లాష్‌బ్యాక్‌ రింగుల్లాంటి కళ్ళద్దాలు-చిరుబొజ్జ (పోదురూ! మోడెస్టీ మరీనూ!!)

రాంనగర్‌ గుండులో మాత్రమే దొరికే చవకరకం కాన్వాస్‌ షూస్‌-జందెప్పెట్టున వేలాడే నేవీ బ్లూ రెక్సిన్‌ బ్యాగూ-లైట్‌ కలర్‌ శ్లాక్‌; ముదుర్రంగు ప్యాంటు-పైన పేర్కొన్న పోలికలు కలిగినటువంటి పెద్దమనిషి హైదరాబాద్‌ నగరం రోడ్ల మీద మీకు ఎక్కడయినా ఎదురుకావచ్చు. ఆయన మీ కంటబడిన మరుక్షణం ఈ కింది దస్కత్‌దారునకు తెలియచేసే ప్రార్థన. సదరహీ జెంటిల్మెన్‌ పేరు శివాజీ. ఆయన ప్యాంటుకు ఎక్కడా చిరుగులుండవు కానీ అలంకారికార్థంలో ఆయన్ని 'ర్యాగ్డ్‌ ట్రౌజర్డ్‌ ఫిలాంత్రఫిస్ట్‌' అనవచ్చు. శివాజీ సొంతూరు ఒంగోలు. తండ్రి తల్లావజ్ఝల కృక్తివాసతీర్ధులు ప్రముఖ రచయిత, పండితుడు, విమర్శకుడు. తీర్థులు మేష్టారు ట్రిపుల్‌ ఎమ్మే. శివాజీ తల్లి - మొక్కపాటి నరసింహశాస్త్రి గారి కుమార్తె - చక్కని వైణికురాలు. శ్రీరంగం గోపాలరత్నంలాంటి ఉత్తమశ్రేణి సంగీతజ్ఞులతో శివాజీకి పరిచయం ఏర్పడ్డానికి కారణం ఆయన తీర్ధులుగారి అబ్బాయి కావడమే. ఇక తీర్ధులు మేష్టారు సభాపతి శివశంకరశాస్త్రిగారి ఏకైక కుమారుడని అందరికీ తెలిసిన సంగతే. శివాజీ తమ్ముడు లలితాప్రసాద్‌ మనకున్న మంచి అనువాదకుల్లో ఒకరు. ఒక అన్నగారు పతంజలిశాస్త్రి, మరో అన్నగారు తల్లావజ్ఝల సుందరం సుప్రసిద్ధులు - వారి వారి రంగాల్లో.

రెండున్నర దశాబ్దాలకుపైగా రాష్ట్ర రాజధానీ నగరంలోనే తిరుగాడుతున్న చిరిగిన రెక్కల సీతాకోకచిలుక శివాజీ. ఆయన్ని అత్యధికులు నడిచే నవ్వుల ఖజానాగా పొరబడ్డం కద్దు. నిజానికి శివాజీకి విషాదాత్మక హాస్యం వెన్నతో పెట్టిన విద్య. దాన్ని ఆయన కాలక్షేపం సరుగ్గానో, సరదా వ్యవహారంగానో ఎప్పుడూ పరిగణించలేదు. అందుకే ఆయన రాసిన 'అదిగదిగో గగనసీమ' లాంటి పొడుగు కథల్లో అడుగడుగునా పైకి హాస్యంలా కనిపించే క్యాజువల్‌ రిమార్క్స్‌లో కూడా లోతయిన వేదాంతపు పాతర్లు కనిపిస్తుంటాయి. ''ఆ నీలినగరిలో'' లాంటి విషాద భరిత కథాకావ్యంలో సైతం ఏడవలేక నవ్వే ట్రాజిక్కామెడీ తొంగి చూస్తూనే ఉంటుంది. ఇక 'ఉదయం' దినపత్రిక మూసివేత నేపథ్యంగా శివాజీ రాసిన రెండు నవలికల్లో 'రంగుల గొంగళి', 'వరదొచ్చింది'లలో - కడుపుబ్బ నవ్వించే విషాద ఘట్టాలు కోకొల్లలు. తెలుగుమధ్యతరగతి జీవితాన్ని ఈ కోణంలోంచి చూసి రాసిన రచయిత శివాజీ ఒక్కడేనేమోనని బెంగేస్తుంటుంది అప్పుడప్పుడు. (అయినా, బడాయి కాకపోతే ఆ ఒక్కడూ చాలడూ మనకి?)

పత్రికలతో శివాజీ చుట్టరికం ఈనాటిది కాదు. తాతతండ్రుల కథలు తవ్విపోసే తాపత్రయం పక్కన పెడితే, హైస్కూల్‌ విద్యార్ధిగా ఉన్నప్పట్నుంచీ సాహిత్య, సాంస్కృతిక పత్రికలు తీసుకొచ్చిన అనుభవం శివాజీది. మెయిన్‌స్ట్రీమ్‌ జర్నలిజంలో అతగాడిని శివాజీ 'పెన్‌ఫార్మెన్స్‌' 'కలం'కారీ కళాకారులంతా గుర్తించి కీర్తించిందే. ఉదయం వీక్లీలోనూ, డైలీలోనూ శివాజీ శతానేక అంశాలకు విస్తరించి తన బహుముఖాలు ప్రదర్శించాడు. కార్టూనిస్టు రాజుతో కలిసి ఆయన నడిపించిన 'చిగురు' పత్రిక - పిల్లల గురించి పెద్దలనుద్దేశించింది. పట్టణ ప్రాంతపు తెలుగు ప్రజానీకాన్ని ఒక వూపు ఊపింది. శివాజీ - రాజు ఉమ్మడిగా ప్రారంభించిన ఫన్‌ ఫీచర్స్‌ సిండికేట్‌ ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. కానీ కొత్త కోణాలను జయప్రదంగా పబ్లిక్‌లోకి తీసుకురాగలిగింది. 'వార్త' దినపత్రికకు అనుదిన అనుబంధంగా వెలువడిన 'మొగ్గ'ను తీర్చిదిద్దడంలో శివాజీ కీలక పాత్ర పోషించారు. ఆయన రాత, రాజు గీతతో వెలువడిన 'లింగా ది గ్రేట్‌' కామిక్‌ డైలీ సీరియల్‌కు అనూహ్యమయిన స్పందన లభించింది. అందులో ప్రస్తావనపరంగా, ఆదివాసుల భూవారసత్వ హక్కుల గురించి అత్యాధునిక అభిప్రాయాలను ఆలంకారికంగా వ్యక్తం చేశారు శివాజీ. పైకి అమాయకులుగా కనిపించే ఆదివాసులు అందులోని అంతరార్థాన్ని గ్రహించి, వేలసంఖ్యలో ఆ బొమ్మలకు కాపీలు తీయించి వాల్‌పోస్టర్లలా అచ్చు వేయించారని శివాజీకి చాలా ఆలస్యంగా తెలియవచ్చింది. అంతకన్నా ఇంకేం కావాలి ఓ కళాకారుడికి?

అరడజను పొడుగు కథలు, డజను చిన్న కథలతో సాహిత్య లోకంలో స్థానం - పరమ పదిలమైనదాన్ని - సంపాదించుకోవడం అంత చిన్న షీటేం కాదు. అయితే, అంత గొప్ప విజయం సాధించిన గర్వం శివాజీ మొహంలో ఎక్కడా ఛాయామాత్రంగా కూడా కనిపించకపోవడం గమనార్హం. అసలు తనో రచయితనే కాదన్నట్టు - కేవలం ఓ కాన్షియస్‌ రీడర్ని మాత్రమే అన్నట్టు మాట్లాడే శివాజీ ఏది చెప్పినా, ఏం రాసినా గొప్పగా ఉంటుంది. అది అరవిందుడి మిస్టిసిజం కానీండి - మేడారం జాతర కానీండి!

శివాజీ రెండో అన్నగారు - 'గుండెగోదారి' కవితాసంపుటినీ, 'వడ్ల చిలకలు' కథా సంకలనాన్నీ, ఇటీవల 'మాధవి'నాటకాన్నీ విడుదల చేసిన ఉత్తమశ్రేణి కావ్యకర్త - పర్యావరణ కార్యకర్త - పతంజలి శాస్త్రి తమ్ముడి చేత (కనీసం) మూడు మంచి పన్లు చేయించారు. వాటిల్లో మొదటిది 'మొలక'. కౌమారప్రాయంలో ఉండే వాళ్ళలో పర్యావరణ చైతన్యం కలిగించే లక్ష్యంతో కట్టిన చిరుపొత్తం అది. అందులో శివాజీ, స్కెలిటన్‌ ఆర్ట్‌ ఫక్కీలో వేసిన బొమ్మలు అద్భుతంగా ఉన్నాయి. ఇటీవలే ఆయన మరో రెండు చిన్న పుస్తికలను వెలువరించారు. జానపద విజ్ఞానంతో కూడినది 'కతల తంగేడు' అనే పుస్తకమయితే , జీవ వైవిధ్యాన్ని వివరించేది 'గూడు' అనే పొత్తం. ఇవి కూడా మొదటి పుస్తకంలాగే దిగ్విజయమవుతాయని ఆశిద్దాం.

శివాజీ గురించి నాలుగు ముక్కలు రాయాలన్న నా సరదా చిరకాలంగా తీరని కోరికగా మిగిలిపోవడానికి ఆయనే సింగ్యులర్లీ రెస్పాన్సిబుల్‌. చిన్న రైటప్‌ లాంటిది రాయడానికి సైతం ససేమిరా సహకరించని మొండితనం శివాజీది. నేనూ మొండితనంతో ఆయనకేం తీసిపోని వాణ్ణి కాబట్టి కానీ లేకపోతే ఇది మీ ముందుకసలు వచ్చేదేకాదు. చిత్తగించండి!!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X