• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిలకమర్తి పద్యానికి ముందే....

By Staff
|

ఈ శతాబ్దంలో మన దేశాన్నీ, తెలుగు నేలనూ కుదిపేసిన ఉద్యమాల్లో ప్రముఖమైనది జాతీయోద్యమం. ఈ మహోద్యమం మొత్తం భారతీయ సాహిత్యాన్నీ, అలాగే తెలుగు సాహిత్యాన్నీ ఎంతగానో ప్రభావితం చేసింది. దాదాపు అన్ని ప్రక్రియలపైన జాతీయ స్వాతంత్ర్యోద్యమ ప్రభావం మనకు స్పష్టంగా కనబడుతుంది.

తెలుగులో జాతీయోద్యమ సాహిత్యం, చిలకమర్తివారి 'భరత ఖండంబు' పద్యంతోనే ప్రారంభమైందని ఈనాటికీ చాలా మంది సాహితీవేత్తలు విశ్వసిస్తున్నారు. డా|| సి. నారాయణ రెడ్డిగారు తన సిద్ధాంత గ్రంథం 'ఆధునికాంధ్ర కవిత్వం: ప్రయోగాలు, సాంప్రదాయాలు' (పుట:378)లో- 'చిలకమర్తివారి భరత ఖండంబు అన్న పద్యము తెలుగులో భారత జాతీయోద్యమ సంబంధమైన తొలి రచనయని చెప్పవచ్చు' అని భావించారు.

ఆ పద్యం 1907 ఏప్రిల్‌ మాసంలో బిపిన్‌ చంద్రపాల్‌గారి రాజమండ్రి పర్యటనల సందర్భంగా 'పాల్‌' ఆంగ్లోపన్యాసాలను అనువదిస్తున్న చిలకమర్తివారు ఆశువుగా వినిపించింది. అయితే ఈ తేటగీతి పద్యానికి ప్రాణభూతమైన ప్రేరణలు 1905 డిసెంబర్‌ 15 నాటి 'కృష్ణాపత్రిక'లో అచ్చయిన 'ది క్రై ఆఫ్‌ మదర్‌ ఇండియా' గీతంలో కనబడుతున్నాయి. బెంగాల్‌ విభజనతో జాతిజనుల సమరనాదంగా మారిన బంకించంద్రుని 'వందేమాతరం' ప్రేరణతో ఒక అజ్ఞాత కవి ఈ ప్రబోధ గీతాన్ని ప్రకటించారు.

'హిందువులారా! ఎన్నాళ్లీ గతి

మందమతులరై యాటికి జెడెదరో

నందనులగు మీరందఱు స్రుక్కగ

యెందుకు నా బ్రతుకితరుల కోసమ

నా వంటను గల సారంబంతయు

నా వంతయు లేకే వెలికేగెను

చేవ చెడిన నేనే విధి బ్రతుకుదు

జీవించిన సార్ధక్యంబేమిక

దూడనోరు గొట్టి ద్రోహంబు గొల్లలు

పాడి సమస్తము పరులకమ్ము గతి

కూడు లేని నా కొడుకుల గాదని

యేడకో నా ధనమెల్లను బోయెడి

చీము నెత్తురు చిక్కెనో లేదో

ఏమెయి బ్రతుకుదు- నీ దుర్దశతో

ప్రేమ జూపరే- ప్రేమ జూపరే

రామ! రామ! నా లావు చెడియెనిక

ఇకనైనను మీరెల్లరు సౌదరులై

ప్రకటింపుడు నాపై ప్రేమమ్మును' అంటూ సాగుతుందీ గీతం.

అనేక రకాలుగా ప్రత్యేకతలు సంతరించుకున్న గీతమిది. తెలియవస్తున్నంత వరకు జాతీయోద్యమ గీతాల్లో బహుశా తొలి తెలుగు గీతమిది. 'బహుశా' అనేది జాగ్రత్త కోసం అంటున్న మాట.

ఈ గీతం 1905లో వెలువడింది. అంటే చిలకమర్తివారి 'పద్యానికి' దాదాపు రెండేళ్లు ముందన్న మాట. కాబట్టి జాతీయోద్యమం సంబంధమైన సాహిత్యంలో దీన్నే తొలి గీతంగా భావింప వీలున్నది. అంతేగాక చిలకమర్తివారి పద్యానికి పథనిర్దేశం చేసిన గీతంగానూ ఇది కనబడుతుంది. "భతరఖండంబు చక్కని పాడియావు" పద్యంలో వర్ణింపబడిన 'పాడియావు', 'లేగదూడలు', 'మూతులు బిగియగట్టడం' వంటి అంశాల పోలికలు పై గీతంలో కనబడుతున్నాయి.

రచయిత పేరు లేకుండా ప్రచురితమైన ఈ గీతం చిలకమర్తివారే రాసి వుండవచ్చును కదా! అనే దృష్టితో వారి స్వీయ చరిత్రను పరిశీలించడం జరిగింది. అందులోని పుటలు: 224, 225, 226లలో చిలకమర్తివారు ఇలా రాసుకున్నారు: "బిపిన్‌ చంద్రపాల్‌గారి యుపన్యాసములకు (1907) ఇంగ్లీషు రాని జనులు వేలకు వేలు వచ్చుటచే పాలుగారి యుపన్యాస సారమును తెలుగులో జెప్పుడని సభాసదులు నన్ను గోరిరి. సభలు క్రిక్కిరిసి యుండెను. కట్టకడపటి దినమున సభలో కూర్చుండి నా మనసులో యూహించుకొని యీ క్రింది పద్యమును బహిరంగముగా కట్టకడపట జదివితిని. 'భతర ఖండంబు చక్కని పాడియావు...' ఈ పద్యమును విని సభాసదులు సంతోష పారవశ్యమున బ్రహ్మాండము పగులునట్లు చప్పట్లు గొట్టిరి"

దీనిని బట్టి 1907 ఏప్రిల్‌ మాసంలో బిపిన్‌ చంద్రపాల్‌ గారి ఆంగ్లోపన్యాసాలను తెలుగులోకి అనువదిస్తున్న చిలకమర్తివారు అప్పటికప్పుడు తమ మనసులో ఊహించుకొని ఆశువుగా ఈ పద్యాన్ని చెప్పినట్లు తెలుస్తున్నది. అంటే 1905 నాటి 'ది క్రై ఆఫ్‌ మదర్‌ ఇండియా' గీతం చిలకమర్తిది కాదన్నమాట.

చిలకమర్తి పై గీతాన్ని చదివి తమ పద్యంలో ఈ పోలికలు తీసుకున్నారా? ఆయనే స్వయంగా పద్యాన్ని రచించారా?? అనేది కాదు ప్రశ్న. ఒక వేళ అమిత ప్రాచుర్యం పొందని 'క్రై' గీతం నుండి చిలకమర్తివారు ఉత్తేజం పొంది ఉన్నా మునిగిపోయిందేమీ లేదు. జాతీయ భావావేశం పొంగి పొరలే ఆ కాలంలో ఇవి పునరుత్తేజాలవుతాయే కానీ, పునరుక్తులు మాత్రం కావు.

మందమతులుగా ఉన్న జాతి జనులను మేల్కొనమని, తనపనై ప్రేమ చూపుమని 'దేశమాత' గావించిన ఆక్రందన 'ది క్రై ఆప్‌ మదర్‌ ఇండియా' గీతం. కృష్ణాపత్రికలో ఆనాడు రచయిత, తన పేరు ప్రకటించనందువల్ల తొలి జాతీయోద్యమ సంబంధమైన గీతం రాసిన కవి అజ్ఞాతంగా మిగిలిపోవడం మన దురదృష్టం. ఈ గీతాన్ని 'జాతీయోద్యమ గీతాల'పై పరిశోధన చేసిన డా|| మద్దూరి సుబ్బారెడ్డిగారు కూడా సేకరించి, తన సిద్ధాంత గ్రంథంలో పొందుపరిచారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more