• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నా చూపులో పదును తగ్గింది: కాళీపట్నం

By Staff
|

''1960 దశకం చివర్లో శ్రీకాకుళం జిల్లాలో వెంపటాపు సత్యంగారి నాయకత్వంలో రైతాంగం తిరుగుబాటు చేసింది. సత్యం మేష్టారిని వ్యవస్థ బలి తీసుకుంది. ఆయన పట్ల ఉత్తరాంధ్ర మధ్యతరగతి ప్రజానీకానికి ఆరాధనాభావం, గాఢమయిన అభిమానం వుండేవి. కానీ ఆయన వెంట నడిచే తెగువ గానీ, చొరవ గానీ కనిపించేవి కాదు. మిడిల్‌ క్లాస్‌ సత్యం మేష్టారు పట్ల ప్రకటించింది లిప్‌ సింపతీ మాత్రమే. రిస్క్‌ చెయ్యడం ఆ వర్గానికి ఇష్టం వుండదు. కానీ తెగింపు వున్నవాణ్ని నోరారా ప్రశంసించేందుకు వెనకాడదు. ఈ ద్వంద్వాన్ని తీసుకునే నేను 'భయం' అనే కథ రాశాను. ఆనాటి వ్యవస్థాగత జీవితం గురించీ, సామాజిక జీవితం గురించీ నాకు స్పష్టత వుండేది. అందువల్లనే అలాంటి కథలు రాయగలిగాను. ఇప్పుడు అలాంటి అవకాశంలేకపోయింద''న్నారాయన.

''1970లో విప్లవ రచయితల సంఘం ఏర్పడేనాటికి నాకు మార్క్సిజం బొత్తిగా తెలీదు. కమ్యూనిస్ట్‌ మేనిఫెస్టో చదివాను. గొప్పగా వుందనుకున్నాను అంతే! ఇక సాహిత్యం విషయానికి వస్తే నేను చెహోవ్‌ను చదివినంతగా గోర్కీని చదవలేదు. చదివే అవకాశం కూడా నాకు పెద్దగా లేదు. పెద్ద చదువుల్లేవు. సెకండరీ స్కూలు మేష్టారిగా వుండే వాణ్ణి. రావిశాస్త్రిగారి పుణ్యమా అని కొంత ఇంగ్లీష్‌ సాహిత్య పరిచయం జరిగింది. అదయినా, ఆయన ఎంపిక చేసి ఇచ్చిన పుస్తకాలు మాత్రమే చదివేవాణ్ని. సొంతంగా నేను పూనుకుని చదివిన ఇంగ్లీష్‌ పుస్తకాలు తక్కువ. అందువల్లనే విరసంలో చేరక ముందుగానీ, తర్వాత గానీ నాకు మార్క్సిస్టు సిద్ధాంతం గురించి తెలిసింది చాలా తక్కువ. కానీ నాకు తెలిసినంతలో ఒక్క విషయం మాత్రం చెప్పగలను. మరింత మెరుగయిన జీవిత విధానాన్ని మనకివ్వగలిగింది మార్క్సిజం మాత్రమే. అందులో ఏమన్నా లోపాలుంటే ఉండొచ్చు. కానీ అదే మనకు ముక్తినిచ్చే సిద్ధాంతం. అందులో సందేహం లేద''న్నారు రామారావు మేష్టారు.

''ప్రస్తుత వ్యవస్థలో నాకు చిత్రమనిపించే విషయం ఒకటుంది. బిచ్చంతో మధ్యతరగతినీ లంపెన్స్‌నీ కొనిపారేయడం దోపిడీవర్గాలకి కొత్తేం కాదు. కానీ ఇప్పుడు కార్మికవర్గాన్ని కూడా బిచ్చంతో- అది కూడా వీరముష్టితో-కొనిపారేస్తోంది వ్యవస్థ'' అని కాళీపట్నం మేష్టారు తన ఆవేదన వ్యక్తం చేశారు. ''నేను విరసంలో ఉన్నది అయిదారేళ్లు మాత్రమే. విరసం లక్ష్యం గురించి తెలిసినంతగా ఆ సంస్థ క్రమశిక్షణ గురించి నాకు తెలియదు. తెలిసి వుంటే అసలు విరసంలో చేరేవాణ్నే కాదు. శివారెడ్డి లాగా బయటే ఉండి సమర్థిస్తూ వుండేవాణ్ని'' అన్నారు కాళీపట్నం రామారావు. ''మనిషన్నవాడికి ఆర్థిక రాజకీయ సామాజిక భద్రతలనేవి మూడూ ముఖ్యమే. వాటిల్లో మొదటి రెండింటినీ రిస్క్‌ చెయ్యడానికి నేను సాహసించగలిగాను కానీ మూడో దాన్ని- సామాజిక భద్రతను- వదులుకోవడానికి తెగించలేకపోయాను. ఆ కారణంగానే నేను విరసంలో కొనసాగలేకపోయాను. 1976లో మా తండ్రిగారికి ఉత్తరక్రియలు- శాస్త్రోక్తంగా- నిర్వహించి విమర్శలనెదుర్కున్నాను. ఆ నేపథ్యంలోనే విరసం ప్రధాన కార్యదర్శి పదవికీ, సాధారణ సభ్యత్వానికీ రాజీనామా చేశాను. మూడేళ్ల తర్వాత దాన్ని ఆమోదించారు'' అన్నారు రామారావు మేష్టారు.

''మా వల్ల విరసం పరువు దెబ్బ తింటోందని భావించినందు వల్లనే నేనూ రావిశాస్త్రిగారూ రాజీనామా చేశాం. మేం ఇక మారలేమనీ, అలాంటప్పుడు ఆ సంస్థలో సభ్యులుగా కొనసాగడంలో అర్థం లేదనీ వాదించాం. విరసం మా వాదనను ఒప్పుకుంది'' అన్నారాయన. ''కొడవటిగంటి, శ్రీపాద. విశ్వనాథ- ఇక రావిశాస్త్రి సరేసరి- పదేపదే ఈ మహానుభావుల రచనలు చదువుతూనే వుంటాను. చదివిన ప్రతిసారీ ఎదో కొత్త విషయం స్ఫురిస్తూనే వుంటుంది కూడా. కానీ చలం విషయంలో అలా కాదు. ఒకసారి వరస పెట్టి చలం రచనలన్నీ తదేకంగా చదివాను. మరింక చదవాలని ఎప్పుడూ అనిపించలేదు'' అన్నారు రామారావు మేష్టారు.

''రాచకొండ విశ్వనాథశాస్త్రి అసదృశత్వం'' గురించి మేష్టారు దీర్ఘంగా విశ్లేషించారు. ''శాస్త్రిగారు వస్తుతః సున్నిత మనస్కులు. చాలా ఎమోషనల్‌. నిజానికి ఆయన కవి కావాలసినవాడు. కులం- ధనం- అధికారం బలం ఉన్నవాళ్లు అవి లేనివాళ్ల పట్ల వ్యవహరించే తీరుకు శాస్త్రిగారు బాల్యం నుంచీ హర్ట్‌ అవుతూ వచ్చారు. అలాంటి క్రౌర్యాన్ని ద్వేషించడం ఆయన స్వభావంలో భాగంగా మారిపోయింది. ఇక న్యాయవాద వృత్తిలో ప్రవేశించాకా ఆయన వందలాది మంది ఆవేదననూ దుఖ్కాన్నీ కష్టాన్నీ దగ్గర నుంచి చూడగలిగారు. పోలీసు విభాగం, న్యాయ వ్యవస్థ ఎంత మంచివాణ్నయినా చెడగొట్టే దుర్మార్గపు వ్యవస్థలని ఆయన గుర్తించారు. అందుకే ఆయన ప్రధానంగా ఆ రెండింటి మీదే దాడి చేశారు. దోపిడీ వ్యవస్థ గురించి కన్నా, దోపిడీకి సాధనాలుగా వున్న ఈ రెండు విభాగాలపైనే ఆయన కేంద్రీకరించారు. కథకుడిగా, నవలాకారుడిగా ఆయన చెలరేగిపోయారు. అసలు పోలీసు ఉద్యోగాల్ని గానీ- న్యాయవాదుల్ని గానీ ఎవరన్నా తల్చుకుంటే వాళ్ల ముందు దర్శనమిచ్చే రూపం, రావిశాస్త్రిగారు చెక్కిన విగ్రహమే. ఈ ప్రభావం నుంచి తప్పించుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదు. ఇకపోతే, ప్రజల్లో కలిసిపోవాలని పాపం పోలీసులు పడరాని పాట్లు పడుతున్నారు. కానీ అది ఎన్నటికీ జరిగే పని కాదు. రావిశాస్త్రి సాహిత్యం పోలీసు వ్యవస్థకు చేసిన డామేజ్‌ ఇంతా అంతా కాదు'' అన్నారు రామారావు మేష్టారు.

''భూషణం మేష్టారంటే నాకు గౌరవం. ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంత ప్రజల జీవితం గురించి ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. గౌర్నాయుడు, అప్పల్నాయుడు, సువర్ణముఖిగార్లను భూషణంగారి వారసులుగా గుర్తిస్తాన్నేను. అయితే ఇప్పుడు రాస్తున్నవాళ్లలో పతంజలికి సాటీసమానుడూ మరెవరూ లేరని మాత్రం చెప్పాల్సి ఉంద''న్నారాయన.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more