• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'కన్యాశుల్కం' స్థాయి రచన మళ్లీ ఏది?

By Staff
|

నిజామాబాద్‌కు 12 కిలోమీటర్ల దూరంలో డిచ్‌పల్లి. అక్కడ 1917లో బ్రిటిష్‌ హయంలో నెలకొల్పిన విక్టోరియా ఆస్పత్రి వుంటుంది. కుష్టు రోగులకు అక్కడ చికిత్స చేస్తారు. ఈ ఆస్పత్రిలో డాక్టర్‌ కేశవ రెడ్డి గత 22 ఏళ్లుగా పనిచేస్తున్నారు. చిత్తూరు జిల్లా తలుపులపల్లె అను ఒంటిల్లు అనే కుగ్రామంలో జన్మించిన ఆయన ఇక్కడ పనిచేయడం విచిత్రమేమీ కాకపోవచ్చు గానీ ఇప్పటికీ తన సొంత జిల్లా మాండలికంలో నవలలు రాయడం విచిత్రంగానే వుంటుంది. తాను మార్క్సిస్టునని చెప్పుకునే కేశవరెడ్డి మార్క్సిస్టు విమర్శకుల నుంచే దాడిని ఎదుర్కున్నారు. సాహిత్య విలువల విషయంలో ఆయన నవలలకు సాటి వచ్చే రచనలు చాలా తక్కువ. అంటే, అసలు సిసలు సృజనాత్మక రచనలయిన కేశవరెడ్డి నవలలను తెలుగు సాహిత్య విమర్శకులు సరిగా అర్థం చేసుకోలేదని అనుకోవాల్సిందేనా?

'బానిసలు, భగవానువాచ' నుంచి ఇటీవలి 'మూగవాని పిల్లనగ్రోవి', 'చివరి గుడిసె' వరకు కేశవరెడ్డి రాసిన నవలికలు చాలా తక్కువ. కేశవరెడ్డి 'అతడు అడవిని జయించాడు' నవల హెమింగ్వే 'ఓల్డ్‌మాన్‌ అండ్‌ సీ' నవలకు కాపీ అనే దుమారం చెలరేగింది. కేశవరెడ్డి హెమింగ్వే శైలిని అనుకరించినప్పటికీ 'అతడు అడవిని జయించాడు' నవల దానంతటది స్వతంత్రమైందని తెలుగు సాహిత్య లోకం అంగీకరించడానికి చాలా కాలమే పట్టింది. హెమింగ్వేను అనుకరించగలగడం కూడా ఒక క్రెడిటేనని ఒకానొక సందర్భంలో అన్న కేశవరెడ్డి 'అతడు అడవిని జయించాడు' నవల ఆంగ్లంలో కూడా వెలువడింది.

ఇప్పటి వరకు వచ్చిన తన రచనలన్నీ తన బాల్యజ్ఞాపకాలేనని అంటున్న కేశవరెడ్డి తన మాండలికాన్ని కూడా మర్చిపోలేదు. తన 'ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌' నవల రెండవ ముద్రణ ఆవిష్కరణ సభలో పాల్గొనడానికి ఆయన ఇటీవల హైదరాబాద్‌కు వచ్చినపుడు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ వివరాలు-

''శ్రీనాథుడు 'నూనూగు మీసాల నూత్న యవ్వనమ్మున రచియించితి మరుత్తరాట్చరిత్ర' అని అన్నాడు. ఆ యవ్వనదశలో ఎవరైనా రచయిత కావడానికి బీజం పడుతుంది. రచనలు చేయాలనే ఆలోచన ఎప్పుడు, ఎట్లా ఉద్భవించిందనేది 30 ఏళ్ల తర్వాత ఏ రచయితకూ గుర్తుండదు. ఆ వయస్సులో పుస్తకాలు చదువుతుంటాం. ఏదో ఒక కథ హృదయానికి హత్తుకుంటుంది. దాంతో మనం ఐడెంటీఫై అవుతాం. అప్పుడు ఆ కథ రాసిన రచయిత పేరు గుర్తు పెట్టుకుంటాం. నాకు తెలిసిందే ఆ రచయిత రాశాడు, నాకు తెలిసిన విషయాలను నేనెందుకు రాయకూడదని అనుకుంటాం. దాంతో అచ్చులో పేరు చూసుకోవాలనే కుతూహలం కొద్ది మొదట రచనలు చేస్తాం. ఒకరు రచయితగా మారే క్రమంలో ఇది మొదటి దశ'' అని కేశవరెడ్డి చెప్పారు. ''చేయి తిరిగిన తర్వాత సిద్ధాంతం కోసం రాస్తాం. ఇది రెండవ దశ. ఈ విధంగా రచయిత పుడుతాడు'' అని అంటున్న కేశవరెడ్డి ''మధురాంతకం రాజారాం మా వూరు వాడే. నాలాగే వుంటాడు. ఆయన రాయగా లేనిది, నేను రాయకపోవడమేమిటని రాయడం మొదలు పెట్టాను'' అని తాను రచయితగా మారడానికి ప్రేరణ పొందిన విషయాన్ని చెప్పారు.

''మూగవాని పిల్లనగ్రోవి'' మినహా మిగతా నవలలన్ని సొంత ఆస్తి లేని వర్గాల గురించే రాసిన ఆయన-'' నేను ఇప్పుడేది రాసినా సిద్ధాంతం కోసమే రాస్తున్నానని అనుకుంటున్నాను. సమాజంలోని చెడును గురించి, జనాల కష్టాలూ, కడగండ్ల గురించి రాస్తున్నాను'' అని చెప్పారు. ''మార్క్సిజాన్ని మించిన సిద్ధాంతం లేదు. నేను ఏది రాసినా దానికి దోహదపడేటట్లుగా రాస్తున్నాను'' అని అంటున్న కేశవరెడ్డి ఏ సంస్థలోనూ సభ్యుడు కారు. ''సిద్ధాంతానికి కట్టుబడి రాయడానికి ఏ వామపక్ష సంస్థలోనూ ఉండనవసరం లేదు. అలా వుండకున్నా మనం చేయాల్సిన పని చేయవచ్చు'' అన్నారాయన.

''వర్గపోరాటమంటేనే ఏదో అంటరాని మాట అన్నట్లు చూస్తున్నారు. మార్క్సిజానికి కాలం చెల్లిపోయిందనే మాటలో వాస్తవం లేదు. ఇప్పుడు జరుగుతున్న కుల, ఆస్తిత్వ పోరాటాల మీద నాకు సదభిప్రాయం లేదు'' అని ఆయన నిర్మొహమాటంగా చెప్పారు. ''పార్శీల వంటి చిన్న కమ్యూనిటీలకు తమ మతాన్ని, కట్టుబాట్లను, సంస్కృతిని కాపాడుకోవాలనే బాధ లేదు. ఆర్థికంగా అవి బలంగా వున్నాయి కాబట్టి వాటికి గుర్తింపు పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. ఆర్థిక స్థిరత్వం లేనివారికే ఆ బాధంతా. ఆర్థికంగా నిలదొక్కుకుంటే ఆ బాధ వుండదు. ఈ దిశలో ఆలోచించి పనిచేయాలి'' అని కేశవరెడ్డి అంటున్నారు.

మార్క్సిజాన్ని విశ్వసించి రచనలు చేస్తున్నానని అంటున్న డాక్టర్‌ కేశవరెడ్డి మార్క్సిస్టు విమర్శకులుగా పేరపొందిన త్రిపురనేని మధుసూదనరావు వంటివారి నుంచి విమర్శలకు గురయ్యారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తే- ''కొందరు మార్క్సిస్టులమిని భావించుకున్న వాళ్లు నన్ను అపార్థం చేసుకున్నారు. వారికి సిద్ధాంతబలం వుంది గానీ సాహిత్య సౌందర్య విలువలు (ఈస్తటిక్‌ వ్యాల్యూస్‌) తెలియవు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అటువంటివాళ్లు రియలైజ్‌ అయ్యారు'' అని అన్నారు. ''విప్లవ రచయితల సంఘం (విరసం) చాలా బాధ్యతాయుతమైన సంస్థ. అది లేకుంటే తెలుగు సాహిత్యం భ్రష్టు పట్టేది. వాచ్‌డాగ్‌ లాగా పనిచేసింది'' అని అంటున్న ఆయన దానిలోని లోపాల గురించి కూడా స్పష్టంగానే మాట్లాడారు. ''అప్పుడప్పుడు విరసంలో కొందరు కర్రపెత్తనం చేశారు. భ్రూణహత్యలు కూడా చేశారు. బి. నరసింగరావు తీసిన 'మా భూమి' సినిమా మీద విమర్శలు చేశారు. కమర్షియల్‌ మసాలా పెట్టాడని, 'మా భూమి' నాటకం పాపులర్‌ కాబట్టి సినిమాకు ఆ పేరు పెట్టుకుని క్యాష్‌ చేసుకుందామనుకున్నాడని విమర్శలు చేశారు. మంచి కళాకారులలను కూడా ఆ రకంగా నిరుత్సాహపరిచారు'' అని వాస్తవాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారాయన.

పి. రామకృష్ణారెడ్డి (ఇప్పుడు రామకృష్ణ) కేశవరెడ్డి 'ఇన్‌ క్రెడిబుల్‌ గాడెస్‌' నవలపై 20 ఏళ్ల కింద విమర్శలు చేశారు. మళ్లీ ఇటీవల 'మూగవాని పిల్లనగ్రోవి' నవలికపై విరుచుకుపడ్డారు. కేశవరెడ్డి దీనికి సమాధానం రాస్తూ తనను రచయితగా చంపేయడానికి పనిగట్టుకుని ఆయన రాస్తున్నారని వ్యాఖ్యానించారు. ''మిమ్ముల్ని కూడా రచయితగా భ్రూణహత్య చేయడానికి ప్రయత్నం జరిగిందా?'' అని ప్రశ్నిస్తే- ''ఇన్‌ క్రెడిబుల్‌ గాడెస్‌ 1979లో వచ్చింది. దానిలోని తప్పులను ఎత్తి చూపి న్యాయమైన విమర్శ చేసి వుంటే అంగీకరించవచ్చు. ఆయన కువిమర్శ చేశారు. మొన్న కూడా మొదలుపెట్టాడు. ఆయన లేవనెత్తిన అంశాలు ఏ మాత్రం సమంజసమైనవి కావు'' అని జవాబిచ్చారు కేశవరెడ్డి.

తెలుగులో సరైన విమర్శకులు లేకపోవడం వల్లనే ఇలా జరుగుతున్నదా అని అడిగితే- ''వారు సిద్ధాంతాన్ని మాత్రమే పట్టించుకుంటున్నారు. సౌందర్య విలువల జోలికి వెళ్ల లేదు. తెలుగులో ఈ రెంటినీ పట్టించుకునే విమర్శకుడెవరనేది నేను చెప్పలేను'' అని అన్నారు.

తెలుగులో నవలలే లేవని ఆ మధ్య ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేశవరెడ్డి అన్నారు. దాన్ని తిప్పికొడుతూ ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య వ్యాసం రాశారు. దీన్ని ప్రస్తావిస్తూ తెలుగులో నవలలే లేవని అనడంలోని మీ ఉద్దేశమేమిటని అడిగితే- '' తెలుగులో నవలలున్నాయి. కానీ, ప్రపంచస్థాయిలో నిల్చే నవలలేవి? ప్రపంచ సాహిత్యంతో పోల్చుకోగలిగే నవలలు లేవనేదే నా ఉద్దేశం. 'కన్యాశుల్కం' తర్వాత అంతటి రచన తెలుగులో ఏది?'' అని అన్నారు.

మంచి నవలలు రాకపోవడానికి ''సాహిత్యాభినివేశం, సమాజం పట్ల నిబద్ధత- ఈ రెండు గొప్పగా వున్నవారు లేరు. సమాజం పట్ల కమిట్‌మెంట్‌ వున్నవాడికి సాహిత్యాభినివేశం తక్కువ. సాహిత్యాభినివేశం వున్నవాడికి సమాజం పట్ల నిబద్ధత లేదు. అందుకే మంచి నవలలు రావడం లేదు'' అని అన్నారాయన.

కేశవరెడ్డి నవలలు చాలా వరకు ట్రాజెడీలు. అంతేకాకుండా ఆయన నవలల్లో దుర్మార్గాన్ని అంతం చేసే విధానం మానవ ప్రయత్నంతో జరుగవు. ఇక్కడే తెలుగు మార్క్సిస్టులు కేశవరెడ్డిని తప్పు పట్టారు. దీని గురించి కేశవరెడ్డి వివరణ ఇస్తూ-''ట్రాజెడీలలో గొప్పదనం వుంది. రచన ఏదైనా పాఠకుని హృదయాన్ని బలంగా హత్తుకోవాలి. 'మూగవాని పిల్లన గ్రోవి' నవలికలో బక్కిరెడ్డి ప్రాయోపవేశం చేస్తాడు. అది ఒక రకమైన ఆత్మహత్య. ఇటువంటి ట్రాజెడీలు చదివినపుడు పాఠకునిలో మథనం చెలరేగుతుంది. పరిస్థితిని బాగు చేయడానికి తానేమైనా చేయగలనా అని ఆలోచిస్తాడు. ఏ రచనకైనా కావాల్సింది అదే. రచన సుఖాంతం కాకుండానే రచయిత ఉద్దేశం నెరవేరింది'' అని అన్నారు.

దాదాపు 22 ఏళ్ల నుంచి తెలంగాణాలో వున్నా ఆయన తన చిత్తూరు భాషను, అక్కడి ఇతివృత్తాన్ని మాత్రమే రాస్తున్నారు. సమకాలీన ఇతివృత్తాలు గానీ, తాను జీవిస్తున్న సామాజిక స్థితిగతుల గురించి గానీ ఆయన పట్టించుకన్నట్లు లేదు. దీనికి కూడా ఆయన సమాధానమిచ్చారు. ''నా చిన్నతనంలో జరిగిన ఇతివృత్తాలను తీసుకునే రాస్తున్నాను. ఇంకా రాయాల్సినవి చాలా వున్నాయి. సమకాలీన సమస్యల గురించి కూడా రాయాల్సి వుంది. నేను ప్రొఫెషనల్‌ రైటర్‌ను కాను. నేను రాసేదే చాలా తక్కువ. అన్నీ రాయాలంటే విస్తృతంగా రాయాల్సి వుంటుంది. అయితే, సమకాలీన సమస్యల గురించి రాయకపోవడం బాధ్యతారాహిత్యమే. ఎల్లకాలం బాల్యజ్ఞాపకాల గురించే రాయడం కూడా మంచిది కాదు. సమకాలీన సమస్యల గురించి కూడా రాస్తా. కానీ ఎప్పుడు రాస్తానో చెప్పలేను'' అని చెప్పారాయన. '' నా మాండలిక భాషను కూడా ఇకముందు పవర్‌ఫుల్‌గా రాయలేను. తెలంగాణ మాండలికమూ రాయలేను. ఈ రకంగా నేను పెద్ద సమస్యను ఎదుర్కోబోతున్నాను. ఇక మాండలికం అవసరం లేని ఇతివృత్తం తీసుకుని రాయాల్సి వుంటుంది. అదే చేస్తా'' అని కేశవరెడ్డి కించిత్తు ఆవేదనతో అన్నారు.

''నవల ఎలా వుండాలనేదానికి శక్తివంతమైన నిర్వచనం ఏదీ లేదు. నవల స్థల, కాలాలను బట్టి వుంటుంది. నవల సమాజానికి వర్గదృక్పథం నేర్పి, వర్గకసిని కల్పించాలి. నవలారచన వినోదం, కాలక్షేపం అనుకోకూడదు'' అని డాక్టర్‌ కేశవరెడ్డి కచ్చితమైన తన అభిప్రాయం వెల్లడించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more