నల్లకలువలు పూయించిన ప్రజాసాహితి

ప్రపంచ వ్యాప్తంగా రచయితలు తమ తమ దేశాల్లో ఏం జరుగుతుందో రాయాలనుకుంటారనేది నిజం. అయితే ఆధునిక ప్రపంచం గురించి విపరీతమైన విషయం ఏమిటంటే తాము పుట్టిన దేశంలో ఏమి జరుగుతుందో వ్యాఖ్యానించడానికి ఎంతో మంది రచయితలు ఇంకొక దేశానికి వలస పోవలసి వచ్చింది. ఈ విషాదం మనం ఆఫ్రికా దేశాలలో చూస్తాం. ఆ క్రమంలో ఆ విషకోరల్లో ఎంతో మంది ఆఫ్రికా కవులు తమ ప్రాణాలను అర్పించారు. మరికొంత మంది దేశ బహిష్కారానికి గురైనారు.

21వ శతాబ్దంలోనికి దూసుకుపోతున్న ప్రపంచ సాహిత్యంలో రష్యా, చైనాల తర్వాత గొప్ప సాహిత్యం నేడు ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాలలోనూ మరియు లాటిన్‌ అమెరికా దేశాల నుండీ వెలువడుతోంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మట్టికాళ్ళ మహారాక్షసిలా పట్టిపీడిస్తూ విశృంఖలంగా వ్యాపిస్తున్న నయావలస విధానం, గ్లోబలైజేషన్‌ మూడవ ప్రపంచ దేశాలను నేడు ఒక తెగులుగా పట్టి పీడిస్తున్నాయి. ఆ క్రమంలో ఆయా దేశాల నుండి వెలువడుతున్న సాహిత్యం నేడు తెలుగు పాఠకులకు అంతంత మాత్రమే అందుబాటులో వుంది. "రాజకీయాలు తెచ్చే మార్పులకన్నా సాహిత్యం తెచ్చే మార్పులు లోతైనవీ దీర్ఘకాలం నిలబడేవి" అన్నాడు మారియో వెర్గాస్‌ ల్లోసా.

సాహిత్యోద్యమాన్ని ఒక సామాజిక బాధ్యతాయుత కర్తవ్యంగా స్వీకరించి, కాలం చెల్లినా కొనసాగుతున్న కుళ్ళి కంపుకొడుతున్న భూస్వామ్య సంస్కృతిని అంతం చేసే లక్ష్యంతో సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తించి దాన్ని నిరంతరం కాపాడుకుంటూ, భారత సమాజంలో వివిధ చారిత్రక దశల్లో వర్గ సంఘర్షణల ఫలితంగా వ్యాప్తిలోకి వచ్చిన ప్రగతిశీల పురోగామిక సాంస్కృతిక భావజాలాన్నీ కళాసాహిత్యాలనూ 'జనసాహితి" తన వారసత్వంగా స్వీకరించింది. అనువాద సాహిత్య సృజన పట్ల ఎంతో శ్రద్ధ వహించి 'ఆఫ్రికా స్వేచ్ఛా గానం" పేరుతో ఓ కాలమ్‌ను నిరంత రాయంగా నడిపిన ఏకైక పత్రిక 'ప్రజాసాహితి". ఆ అనువాద కృషిని వివరించే ప్రయత్నమే ఈ వ్యాస ఉద్దేశ్యం.

ఆ క్రమంలో వాళ్ళు కెన్‌ సారో వివా, ఒలె సొయింకా, చినువాఅచిబి, గూగీ వా థియాంగో, బ్రేటన్‌ బ్రేటన్‌బా, లియోపాల్డ్‌ సెగార్‌ సింఘార్‌, బెంజిమన్‌ మొలైసీ, పాట్రిస్‌లుముంబా, డెనిస్‌ బ్రూటస్‌, జీన్‌ జోషప్‌, రబి రోవేలా, ఫ్రెడరిక్‌ డగ్లస్‌, సిజైర్‌లాంటి ఎంతో మందిని గూర్చి ఎన్నో విలువైన వ్యాసాలను మరికొంతమంది మీద ప్రత్యేక సంచికలు 'ప్రజాసాహితి" తీసుకువచ్చింది. చినువా అచ్‌బీ రాసిన 'ధింగ్సు ఫాల్‌ ఎపార్ట్‌" అనే నవలను 'చెదిరిన సమాజం" పేరిట తెలుగులోకి అనువాదం చేయించి ప్రజాసాహితిలో ధారావాహికగా ప్రచురించారు. దీనినే జనసాహితి ప్రచురనగా వెలువరించారు. ఆయా సంచికల్లో చర్చించిన ఆఫ్రికన్‌ సాహిత్యం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

"సంక్షోభ సమయాల్లో సాహిత్యాన్ని రాజకీయాల నుండి విడదీయకూడదు. నిజానికి సాహిత్యం రాజకీయాలలో నిలబడి జోక్యం చేసుకొని సమాజానికి ఉపయోగపడాలి. రచయితలు కేవలం సంతోషపెట్టడానికో గందరగోళంలో ఉన్న సమాజాన్ని విమర్శనాత్మకంగా చూడడానికో రచనలు చేయకూడదు" అని నైజీరియన్‌ రచయితా, ఒగోని ప్రజలనేతా అయిన కెన్‌ సారో వివా వెలిబుచ్చారు. నైజీరియాకు చెందిన కెన్‌ సారో వివా ఇబదానె యూనివర్శిటీలో ఫ్రభుత్వ స్కాలర్‌షిప్‌తో చదివాడు. రివర్స్‌ రాష్ట్రంలో 1941 అక్టోబర్‌ 1న జన్మించిన కెన్‌ సారో వివా, అత్యంత ఫ్రతిభావంతమైన విధ్యార్థి, గొప్ప జాతీయవాది, మహా మేధావి. విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా ఒగోని ప్రజల స్వయంనిర్ణయాధికారం కోసం హక్కుల కోసం ఉద్యమించాడు. 1970వ దశకంలో గొప్ప సృజనాత్మక రచనలు చేశాడు. వలస పాలనకు వ్యతిరేకంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సామ్రాజ్యవాదానికీ, బహుళజాతి సంస్థ అయిన 'షెల్‌" కంపెనీ సాగిస్తున్న పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా సమర్ధవంతమైన ప్రజా పోరాటాలను సమీకరించిన వాడు కెన్‌సారో వివా.

1994 మే నెలలో అక్రమంగా అతనితోబాటు 13 మంది ఉద్యమకారులపై హత్యానేరారోపణ చేసి జైల్లో చిత్రహింసల పాలు చేసింది సామ్రాజ్యవాద ప్రపంచ కనుసన్నలలో పనిచేస్తున్న నైజీరియా ప్రభుత్వం. హత్యానేరం తర్వాత ప్రాసిక్యూషన్‌ జరుగుతున్న సమయంలో ఉరిశిక్ష ఖాయం అని తెలిసిన తర్వాత విలేకరులు ఆయన్ను ఇంటర్‌ర్వ్యూ చేస్తున్నప్పుడు మీ సమాధి మీద ఉండే శిలాఫలకం మీద ఏమి వ్రాస్తే బాగుంటుందనుకుంటున్నారని అడగా - "నైజీరియా పాలకుల చేత మోసపోయిన మర్యాదస్తుడు ఇక్కడ శాశ్వత నిద్రపోతున్నాడు. వారు ఆయనకు ఆరడుగుల నేలను కూడా తిరస్కరించారు" అని వ్రాయమన్నాడు.

కెన్‌ సారో వివా జీవితమూ, పోరాటమూ ఇచ్చిన స్ఫూర్తితో నైజీరియా ప్రజలు ఉద్యమిస్తున్నారు. ప్రతి నియంత తాను శాశ్వత మనుకుంటాడు కానీ, ఏ నియంతా శాశ్వతం కాడు. ప్రజలు మాత్రమే సత్యమూ, శాశ్వతమూ. వారి ఉద్యమం ఉద్భవింపజేసిన కెన్‌ సారో వివా వంటి అద్భుత వీరుల్ని బలిగొన్న నియంతృత్వాన్ని వారు తప్పక మట్టి కరిపిస్తారు.

ఆఫ్రికాలో ఫ్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా వచ్చిన సాహిత్యాన్ని, సాహిత్యకారుల్ని, వారి విజయాల్ని తుడిచివేయడానికి ప్రభుత్వం మూర్ఖమైన నిర్ణయం తీసుకుంది. 1966లో ప్రభుత్వ గెజిట్‌ 46గురు ప్రవాసులను చట్టప్రకారం కమ్యూనిస్టులని ముద్రవేసింది. వారిలో పీటర్‌ అబ్రహమ్స్‌, మ్ఫాలేలే, మాడిసేన్‌, థాంబా, మైమానే లాగుమా మొదలైనవారి రచనలను దక్షిణ ఆఫ్రికాలో చదవరాదు. కోట్‌ చేయరాదు అని చట్టం చేసింది. అయినా ఆ చట్టాలను ధిక్కరించి అనేక మంది తమ స్వరాల్ని ఎక్కుపెట్టారు.

దక్షిణ ఆఫ్రికా కవుల్లో డెనిస్‌ బ్రూటస్‌ ముఖ్యుడు. ఇతన్ని ప్రభుత్వం ఏ రాజకీయ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనకుండా నిషేధించింది. 1962లో అతన్ని ఉద్యోగం నుండి తొలగించారు. 1963లో అరెస్టు చేశారు. జైలు నుండి తప్పించుకొనే ప్రయత్నంలో వెన్నులోంచి తుపాకీ గుండు దూసుకుపోయింది. తర్వాత 18 నెలల కారాగారశిక్ష తర్వాత 1966లో దేశాన్ని వదిలి అమెరికా చేరుకొని అక్కడి నుండి వెలి విధానానికి వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. ఇతను చిన్నప్పటి నుండి వర్ణవివక్షను అనుభవించాడు. పోర్ట్‌ ఎయిర్‌ యూనివర్శిటీలో ఉన్నత విద్యను అభ్యసించి ఇతను చాలా కాలం జైలులోనే జీవితం గడిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+