తెలుగు కవిత్వానికి కొత్త చూపు

(ముంబయిలో ఉంటున్న తెలుగు కవి సంగెవేని రవీంద్ర రాసిన వలసపత్రం కవితా సంకలనానికి ప్రముఖ కవి, విమర్శకుడు డా. ఎండ్లూరి సుధాకర్ ముందు మాట రాశారు. ఆ ముందు మాటను పాఠకులకు అందిస్తున్నాం)

వాక్యం రసాత్మకం కావ్యం పాత మాట. వాక్యం ప్రవాసాత్మకం కావ్యం ఇది కొత్త మాట. భాష రాని దేశంలో బతుకు పాట... పొట్ట నింపుకునేందుకు పేగుల వేట... జీనా యాహా... మర్నా యవా... ఇస్కే సివా జానా కహా... (నీరజ్ రచన).... ఇదే వలస గీతం. ఇదే వలస తత్వం....

ముంబాయి వలస మిత్రుల్ని చూసినప్పుడల్లా నాకు బొంబై సే ఆయా మేరే దోస్త్... దోస్త్ కో సలాం కరో... అన్న పాట గుర్తుకొస్తుంది. ముంబయి రచయితల సాహిత్యం చదువుతుంటే ఆ మహానగరం మీద షాహిర్ లూధియాన్వి రాసిన హై దిల్ ముష్కిల్ జీనా యహా... జర హఠ్కే... జర బచ్ కే... యహ ముంబాయి మేరి జాన్... అనే ప్యాసా చిత్రగీత నా కళ్ల ముందు కదులుతుంది.

తెలుగు పత్రికలూ, విమర్శకులూ పెద్దగా పట్టించుకోని ప్రధానమైన విషయం వలస సాహిత్యం. జాతీయంగా, అంతర్జాతీయంగా ఎందరో రాస్తున్నారు. అందులో కొందరికే తప్ప అందరికీ పెద్దపీట వేయడం లేదు. వలస సాహిత్యం అందించిన తెలుగు ముత్యం మన సంగినేని రవీంద్ర. వలస జీవులు ఎక్కడున్నా వీళ్ల వేళ్లు మాత్రం వాళ్ల ఊళ్లోనే బలంగా ఉంటాయనడానికి ఆధారం రవీంద్ర కవిత్వం.

వలస రెండు రకాలు. కడుపు నిండిన వలస... పేగు మాడిన వలస. రవీంద్ర వలస కవిత్వమంతా రెండవ కోవలోనిదే. రవి వలసకారుల ప్రతినిధి. ఇతడి వలస గొంతులో లక్షలాది హృదయఘోషలున్నాయి . రవి కవి వలస గరళ కంఠుడు. ఇతని కవిత్వమంతా అమృతమయం... అమ్మమయం....

ముంబయిని ముద్దు పెట్టుకోవడం ప్రేయసినో, భార్యనో పెట్టుకున్నంత సులభం కాదు. మహానగర నాగబాము పడగ మీద పెట్టుకునే భయానక అనుభవం. ఈ పని వలస సాహస వీరులే తప్ప, గడప దాటనివారు, గ్రామం దాటనివారు ఎప్పటికీ చేయలేరు. జీవితపు యుద్ధపు సవ్వడి విన్నవాళ్లే బతుకు పోరాటంలో విజేతలవుతారు. క్షతగాత్ర దేహాలతో శతపత్రనేత్రులవుతారు. వలస చరిత్రలో తామే ప్రధాన పాత్రులవుతారు.

బొంబాయి బస్సు క్షతగాత్రుల శిబిరం ఈ ఒక్క వాక్యం చాలు రవీంద్ర సంఘర్షణనీ, కవిగా అతని సంక్షుభిత అంతరంగాన్ని అర్థం చేసుకోవడానికి...

నిజానికి బొంబాయి బస్సు ఎవరో కాదు. అది సాక్షాత్తు సంగెనేని రవీంద్రే.... ఎందుకంటే అస్తవ్యస్త జీవితాల వ్యధాభరిత కన్నీళ్లు అతడు చూశాడు. చవి చూశాడు. కవిత్వం చేశాడు.... ఇతని ఊరు యాదికొస్తుంది కవిత చదవండి. హృదయం బరువెక్కుతుంది. పల్లె జ్ఞాపకాలతో నుజ్జునుజ్జవుతుంది.... నగరపు ఆక్టోపస్ కౌగిలిలో నలిగిన వాడి అనుభవం అక్షరమైతే అది రవీంద్ర కవితౌవుతుంది.

సంగెనేని రవీంద్ర కవిత్వంలో పల్లెటూరి పిల్లగాడి అమాయకత్వం కనిపిస్తుంది. కూటి కోసం, కూలి కోసం, పట్టణంలో బతకడానికి బయలుదేరిన బాటసారి కళ్లలోని దిగులు వ్యక్తమవుతుంది. రవీంద్ర వలస దృష్టి తెలుగు కవిత్వానికి కొత్త వస్తువును, కొత్త చూపును తెచ్చిపెట్టింది. మరెంతో బలోపేతం చేసింది.

ఇతని జీవితం సంగతి నాకు పెద్దగా తెలియదు. కానీ ఇతని కవిత్వంలో నిఖార్సయిన నిజాయితీ నినదిస్తుంది. అదే నిలబడుతుంది. అది చాలు మంచి కవికి, మంచి కవిత్వానికి....

ఇక్కడెవరూ శాశ్వతం కాదు. వలస కూడ కాదు. అంతా వెళ్లి పోవాల్సిందే. ఏం మిగిల్చావంటే, లక్షలు కాదు.... గుప్పెడు అక్షరాలు... రవీంద్రాక్షరాలు వలస కవిత్వ చరిత్రలో శాశ్వతంగా ఉంటాయి. కొత్త వలస తరానికి అవి కొంత మార్గదర్శకాలౌతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+