వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ నవల - నగర జీవితం

By Pratap
|
Google Oneindia TeluguNews

Naveen
Urbanity అనే పదానికి సమానార్థకంగా నేను నగర జీవితం అనే పదాన్ని తీసుకుంటున్నాను. Urbanity అంటే నగరంలో లేదా పట్టణంలో జీవన ప్రమాణం లేదా వ్యక్తిత్వం అని అర్థం. Urbanity అనేది నగరం లేదా నగర ప్రాంతాల్లోని ప్రత్యేక లక్షణాలను, వ్యక్తిత్వ నమూనాలను, ఆలోచనా సరళిని వివరిస్తుంది. Urbanity అనేది Urbanitas అనే పదం నుంచి పుట్టింది. అర్బనిటీని సిటీఫైడ్ అని కూడా అంటారు. అది ప్రవర్తనకు సంబంధించింది కూడా. సానదీరిన, మెరుగులు దిద్దుకున్న, మర్యాదపూర్వకమైన ప్రవర్తనకు అది ప్రాతినిధ్యం వహిస్తుంది. నగర జీవనం అంటే మృదుస్వభావానికి ప్రతీక, నాగరికమైంది. కిరాతకత్వానికి దూరమైంది. అంటే, ఉన్నతమైన నాగరికతను అతి ప్రతిబింబిస్తుందని చెప్పవచ్చు. మానవత్వానికి ఉన్నతదశగా దాన్ని నిర్వచించారు. అయితే, ఆధునిక దృక్కోణంలో దాని అర్థం మారిపోయింది. ఫ్రాన్సిస్ మర్పీ అనే మేధావి మాటల్లో చెప్పాలంటే – నగర జీవితం వెర్రితలలు వేస్తున్న పరిణామాలను, వికృత రూపాలను కూడా ప్రతిబింబిస్తుంది.

పాత కాలం నిర్వచనం ప్రకారం చూస్తే – నగర జీవితంలో మానవ ప్రవత్తులు, స్వభావం, ఆచార వ్యవహారాలు, జీవనశైలులు నగర జీవితం కిందికి వస్తాయి. అలా చూస్తే, మనకు తెలంగాణలో నగర జీవితాన్ని ప్రతిబింబించిన నవలలు లేవనే చెప్పవచ్చు. ఆధునిక కాలంలోని నిర్వచనం ప్రకారం చూస్తే కూడా మనకు చాలా కొద్దిపాటి నవలలు మాత్రమే లభిస్తాయి. అలాంటి నిర్వచనాల జోలికి వెళ్లకుండా నగరంలోని ప్రజల జీవితాలను, అంటే ఏ వర్గానికి, కులాలకు సంబంధించిన నవలలైనా అన్నప్పుడు కూడా పెద్దగా ఫలితం కనిపించదు. చెప్పాలంటే, నగర జీవితం అనేది కేవలం భౌతికమైంది మాత్రమే కాదు, మానసికమైంది కూడా. భౌతిక జీవితాలతో పాటు మనుషుల మానసిక స్వభావం కూడా నగరీకరణను సంతరించుకోవడమంటే ఆలోచనా సరళిలో కూడా ఆధునికత ప్రతిబించాలి. సమాజం ఆధునికతను సంతరించుకుంటున్న కొద్దీ ఆధునిక స్వభావాలు, జీవన శైలి, వ్యక్తిత్వ లక్షణాలను మనుషులు సంతరించుకుంటారు. గ్రామీణ జీవితానికి, గ్రామీణ భౌతిక స్వరూపానికి భిన్నమైంది కూడా అయి ఉండాలి.

ఆ తరహాలో ఆలోచినప్పుడు నగర జీవితాలను ప్రతిబింబించిన నవలలు తెలంగాణ నుంచి వచ్చినవి తక్కువే. తెలంగాణ నవలలు అన్నప్పుడు తెలంగాణ రచయితలు, తెలంగాణ నగరజీవితాన్ని ప్రతిబింబించిన నవలను మాత్రమే నేను పరిగణనలోకి తీసుకుంటున్నాను. వడ్డెర చండీదాస్ రాసిన అనుక్షణికం, ఇతర తెలంగాణేతర రచయితలు రాసిన హైదరాబాదు నగర జీవిత చిత్రణను నేను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఎందుకంటే తెలంగాణేతరులు రచించిన నవలల్లో తెలంగాణ అంశ ఏ మేరకు వ్యక్తమైందో చూడాల్సిన అవసరం ఉంటుంది.

తెలంగాణ సాయుధ పోరాటంపై వచ్చిన నవలల్లో నగర జీవితం ప్రతిబింబించలేదనే చెప్పాలి. తెలంగాణ విమోచనోద్యమానికి వేదికగా హైదరాబాదును ప్రతిబింబించిన నవలలు తెలుగులో లేవనే చెప్పాలి. తమ పోరాటంలో భాగంగా వివిధ నవలల్లోని పాత్రలు అలా హైదరాబాదు వచ్చి పోయిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ రకంగా చూసినప్పుడు వట్టికోట ఆళ్వారుస్వామి గంగు నవలలో కొంత మేరకు హైదరాబాదు ఉనికి కనిపిస్తుంది. కానీ, అది పూర్తిగా హైదరాబాదు నగరజీవితాన్ని, హైదరాబాదు సంస్కృతీ స్వభావాలను, రీతులను వివరించిందని చెప్పలేం. ప్రజల మనిషి నవలలో కూడా కథానాయకుడు కంఠీరవం హైదరాబాదు రావడం ఉంటుంది. తెలుగులోని తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో పూర్తిగా జిలానీ భాను ఉర్దూలో రాసిన ఐ వాన్ గజల్ నవలలో మాదిరిగా ప్రతిబింబించలేదు. ఈ నవల తెలుగులో కూడా వచ్చింది. కనీసం హైదరాబాదు నగర జీవితానికి సంబంధించిన ఒక పార్శ్వాన్ని కూడా ఈ నవలలు చిత్రించలేదని చెప్పవచ్చు.

ఇకపోతే, భాస్కరభట్ల కృష్ణమూర్తి రాసిన వెల్లువలో పూచిక పుల్ల నవలలో నగర జీవితం దర్శనమిస్తుంది. గ్రామీణ జీవితంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని జీర్ణించుకోలేక నగరానికి చేరుకుని, ఇక్కడ జీవితాన్ని కొనసాగించిన ఓ యువకుడు మధుసూదనరావు కథ ఇది. ఈ నవలలో సికింద్రాబాద్, హైదరాబాద్ నగర జీవితం మనకు కనిపిస్తుంది. హైదరాబాదు నగర జీవితాన్ని ప్రతిబింబించిన తొలి తెలంగాణ నవలగా దీన్ని పరిగణించవచ్చు.

దాశరథి రంగాచార్య రాసిన మాయాజలతారు నవలలో పొట్ట పోసుకోవడానికి నగరానికి చేరిన బడుగుల జీవితాలను చిత్రించారు. వారు నగరంలోని మురికివాడల్లో జీవిస్తూ ఇక్కడ మోసాలకు, అన్యాయాలకు గురయ్యే విధానాన్ని ఆయన మాయాజలతారు నవలలో చిత్రించారు. ఇక, ముదిగంటి సుజాతా రెడ్డి తెలంగాణ విమోచనోద్యమంపై రాసిన మలుపు తిరిగిన రథచక్రాలు నవలలో హైదరాబాదుకు చెందిన అణుమాత్రం వర్ణన ఉంటుంది. హైదరాబాదుకు చేరుకున్న స్త్రీ పాత్రలు జట్కా బండీలో ప్రయాణించడం, హైదరాబాదులో ఆనవాయితీగా ఉన్న చాల్ అనే అద్దె కొంప జీవితం ప్రస్తావన వస్తుంది. అయితే, ఇవేవీ నగర జీవితానికి సంబంధించిన ఆదునిక మానసిక స్వభావాన్ని, ఆదునిక జీవనశైలిని ప్రతిబింబించలేదనే చెప్పాలి.

ఆ రకంగా చూసినప్పుడు, నగర జీవితాన్ని సంపూర్ణంగా ప్రతిబింబించిన తెలంగాణ రెండో నవలగా నవీన్ రాసిన అంపశయ్యను తీసుకోవచ్చు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల జీవితాలనే ఇతివృత్తంగా రచయిత తీసుకున్నారు. అయినా హైదరాబాదు సంస్కృతి ఈ నవలలో ప్రతిబించింది. మానవ స్వభావం, జీవనశైలీ రీత్యా కూడా ఆ లక్షణం ఈ నవలకు ఉంది. మధ్యతరగతి ఎదగడానికి, నగరజీవితాన్ని రచనల్లో వ్యక్తం చేయడానికి మధ్య సంబంధం ఉంటుందని కూడా చెప్పవచ్చు. భాస్కరభట్ల కృష్ణమూర్తి వంటి రచయితలు ఆ మానసిక స్వభావాన్ని సంతరించుకున్నారు. కానీ పెద్ద యెత్తున తెలంగాణ సమాజంలో మధ్యతరగతి ముందుకు రావడం 1960 దశకం చివరలో, 1970 దశకం ప్రారంభంలో చూస్తాం. అది ఒక సామూహిక లక్షణాన్ని సంతరించుకోవడం గమనించవచ్చు. ఆలా సంతరించుకున్న వైనం మనం అంపశయ్య నవలలో చూస్తాం. నవల కథానాయకుడు రవి ఆలోచనా సరళి మొత్తం నగరీకరణ చెందిన యువకుడిని ప్రతిబింబిస్తుంది. ఒక రకంగా నగర జీవితానికి, గ్రామీణ జీవితానికి మధ్య పొంతన కుదరని లక్షణం అతనిలో ఉంటుంది. నగరీకరణ చెందడానికి అతను పడే శారీరకమైన, మానసికమైన క్షోభ కనిపిస్తుంది. కథానాయిక కిరణ్మయి పూర్తిగా నగరీకరణ పొందిన యువతిగా కనిపిస్తుంది. రచయిత ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారనే చెప్పవచ్చు. అలవాట్లలో, నడతలో నగరీకరణ వ్యక్తమవుతుంది. హైదరాబాదు నగరాన్ని కూడా రచయిత వర్ణించారు. హిందీ క్లాసికల్ సినిమాలకు జమృద్ టాకీస్ పేరు పొందింది. అటువంటి థియేటర్లో ఆడే సినిమాలు చూడడమంటే అభిరుచుల్లో నగర సంస్కృతిని ఒంట పట్టించుకోవడమే. రవిలో ఆధునిక భావజాలానికి సంబంధించిన ఆలోచనలు కూడా మనం చూస్తాం. శిల్ప రీత్యా అంపశయ్య గానీ ముళ్లపొదలు గానీ నగర జీవితాన్ని చిత్రించడానికి అనువైనవే. ఆ జీవితాన్ని చిత్రించడానికి ఆ శైలి దానంతటదే సంతరించుకుందని చెప్పవచ్చు. లేదంటే ఆలాంటి జీవితాన్ని ప్రతిబింబంచడానికి అదే అనువైన శిల్పమని రచయిత భావించి ఉండవచ్చు.

ఇక ముళ్లపొదలు నవలలో హైదరాబాదు నగర జీవితం మనకు దర్శనమిస్తుంది. నిరుద్యోగ యువకుల జీవన స్థితిగతులను, వారి ఇబ్బందులను ఈ నవల చిత్రిస్తుంది. నిధి అనే పాత్ర సిగరెట్ కోసం వెంపర్లాడుతూ ఆ అలవాటుకు ప్రాణాన్ని ఫణంగా పెట్టిన వైనం మనం చూస్తాం. వెర్రితలలు వేసిన నగర సంస్కృతికి, జీవితంలో ఏకాకితనానికి, ఒంటరితనానికి మానసికంగా సిద్ధపరిచే నగర సంస్కృతి ఇది. నగర జీవితంలోని మానసిక వైకల్యం అంపశయ్యలోనూ ముళ్లపొదలు నవలలోనూ కనిపిస్తుంది. అంపశయ్య నుంచి ముళ్లపొదలు వరకు ప్రయాణం చేసిన మిత్రులు వారి వారి జీవితాల్లో వారి వారి ఆలోచనా ధోరణులకు అనుగుణంగా ముందుకు సాగుతారు. అంటే, ఆధునిక ప్రపంచంలో వారి వారి స్థానాలకు చేరుకుంటారు. అంతస్స్రవంతి నవల అంతగా నగరజీవితాన్ని ప్రతింబించలేదనే చెప్పాలి. రెండు విరుద్ధ భావజాలాలకు, ఆచరణలకు మధ్య జరిగిన సంఘర్ణణే ఈ నవలలో ఇతివృత్తంగా కనిపిస్తుంది. అయితే, రచయితగా నవీన్ ఆధునికతను ప్రదర్శిస్తాడు. నగరజీవిగా కనిపిస్తారు.

ఒక రకంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యంగానే సాగినా లోకేష్ సలాం హైదరాబాదు నవల నగర జీవితాన్ని పూర్తిగా ప్రతిబింబించిందని చెప్పవచ్చు. నగర జీవితంలోని ఆరాటపోరాటాలు ఈ నవలలో మనకు కనిపిస్తాయి. 1969 ప్రాంతంలో తలెత్తిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి నక్సల్బరీ ఉద్యమం వరకు సాగిన తెలంగాణ సామాజిక చరిత్రను లోకేశ్వర్ చిత్రించారు. అయితే, ప్రధాన పాత్ర స్వామి ఆలోచనా స్రవంతి నుంచి సాగే ఈ నవలలో అంతకు ముందటి హైదరాబాదు సాంస్కృతిక జీవన విధానం కూడా వ్యక్తమైంది. కథలు కథలుగా హైదరాబాదు సంస్కృతిని, హైదరాబాదు జీవశైలులను ఈ నవల చిత్రించింది. వర్తమానం నుంచి మధ్య మధ్యలో భూతకాలానికి నవల ప్రయాణిస్తూ ఉంటుంది. రెంటి మధ్య ఉయ్యాల మాదిరిగా ఊగుతూ ఉంటుంది. ఈ ఊగడంలో మనకు గత కాలం హైదరాబాదు సంస్కృతీసంప్రదాయాలు, కళా ధోరణలు, చారిత్రక విశేషాలు మన కళ్ల ముందు కదులాడుతాయి. ఈ నవలలో ప్రధాన పాత్ర స్వామియే అయినా అతను నవలలో పూర్తిగా ఓ ప్రేక్షకుడిగా, కథకుడిగా మాత్రమే మిగిలిపోతాడు. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఇక్కడ చర్చనీయాంశం కాదు. కానీ, మొత్తంగా హైదరాబాదు నగర జీవితానికి సంబంధించి కొన్ని దశాబ్దాల చరిత్రను, సంస్కృతిని, జీవన శైలులను, ఆచార వ్యవహారాలను, పోరాటాలను ఈ నవల చిత్రించింది.

హైదరాబాద్ భిన్న సంస్కృతుల సమ్మేళనం. వివిధ సంస్కృతుల మధ్య, ఆచార వ్యవహారాల మధ్య, సామాజిక అంతస్థుల మధ్య భిన్నత్వాన్ని చాటుతూనే ఏకత్వాన్ని ఎలా ప్రదర్సించిందో ఈ నవల చూపిస్తుంది. పాలక, పాలిత వర్గాల సంస్కృతులు కూడా మనకు ఈ నవలలో కనిపిస్తాయి. హైదరాబాదు పాత నగర జీవితం పూర్తిగా మనకు కనిపిస్తుంది. అలాగే, పాలితులుగా ఉన్న వారి సంస్కృతులు, అలవాట్లు, కార్యకలాపాలు కూడా మనకు సవివరంగా దర్శనమిస్తాయి. హైదరాబాద్ జీవితం 1970 ప్రాంతం వరకు ఎలా ఉండేదో మనకు సంపూర్ణంగా ఈ నవల తెలియజేస్తుంది. నగర జీవితం ఆత్మ మనకు కనిపిస్తుంది. రచయితకు గల ఆత్మీయత వ్యక్తమవుతుంది. ఒక రకంగా నిర్మమకారంగా హైదరాబాదు నగర జీవితాన్ని రచయిత చిత్రించారు. వాటిలోని మంచీచెడులను పాఠకులు బేరీజు వేసుకోవాల్సిందే. అలా పాఠకులకు తన నవలలో భాగస్వామిని చేశారు. హైదరాబాద్ బజార్లు, అంగళ్లు, కూడళ్లు, ఇరానీ హోటళ్లు, వాటి సంస్కృతి, ఆచార వ్యవహారాలు రచయిత పాఠకుల ముందుంచాడు. ఇందులోని ప్రధాన పాత్ర మనకు హైదరాబాదుకు సంబంధించి ఒక గైడ్‌లా వ్యవహరిస్తాడు. దాని వల్ల ఈ రచనకు నవలా లక్షణాల కొరత కొంత మేరకు ఏర్పడిందని చెప్పవచ్చు. ఇకపోతే ఖైరున్నిసా, పాట్రిక్‌ల ప్రేమ కథ సలాం హైద్రాబాద్ నవల రావడానికి ముందే వైట్ మొఘల్స్ అనే నవలలో వచ్చింది. అయితే, నవలలో చిత్రితమైన ఇతర కథలను పరిగణనలోకి తీసుకుంటే దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

హైదరాబాద్ రాజ్యం హైదరాబాద్ రాష్ట్రంగా పరిణామం చెందింది. ఆ తర్వాత ఆంద్రప్రదేశ్ అవతరణ తర్వాత రాజధానిగా ఉంటూ వస్తోంది. ఒక రకంగా తెలంగాణకు ఉన్న నగర జీవితం తెలుగు ప్రాంతంలో మరోటి లేదని చెప్పాలి. కానీ తెలంగాణ నుంచి నగర జీవితాన్ని ప్రతిబింబించే నవలలు తక్కువగా రావడానికి కారణమేమిటి, కనీసం 1970 నుంచైనా విస్తృతంగా రాకపోవడానికి గల కారణమేమిటని ఆలోచించినప్పుడు నాకు తట్టిన కొన్ని ఆలోచనలు మీ ముందుంచుతాను. మొదటి నుంచి తెలంగాణ ఓ పోరాట ప్రాంతంగానే ఉంటూ వచ్చింది. అదీ గ్రామీణ ప్రాంతాలను ఆలంబనగా చేసుకుని వచ్చిన పోరాటాలు, సాగిన ఉద్యమాలు. ఇక్కడి రచయితలు ఆ పోరాటాల పక్షాన నిలిచి, ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు సృజనాత్మక రచనలను ఓ వాహికగా ఎంచుకున్నారు. ఇతురుల గురించి రాయడమే తెలంగాణ రచయిత పెద్ద పనిగా పెట్టుకున్నాడు. అందుకే హైదరాబాదు వంటి సంపూర్ణమైన నగరంలో జీవిస్తూ కూడా గ్రామీణ ప్రజల గురించి మాత్రమే రాశాడు. తన గురించి తాను రాసుకున్న సందర్భాలు గానీ తన అనుభవాలను వ్యక్తీరించే పని గానీ పెట్టుకోలేదు. అందువల్లనే నగర జీవితానికి సంబంధించిన నవలలు మనకు ఎక్కువగా రాలేదని చెప్పవచ్చు. హైదరాబాదు నగరంలో జీవించే రచయితలు కూడా గ్రామీణ జీవిత వాతావరణాన్ని మాత్రమే రాస్తున్నారు. కనీసం, తన హైదరాబాదు నగర జీవిత ఆలోచనా సరళి నుంచి తన పాత గ్రామీణ జీవితాన్ని చూసే ఆలోచనా సరళిని కూడా ప్రతిబింబించడం లేదు. రచయిత తన ఆలోచనా సరళి ద్వారా తనకు ఆత్మీయమైన, స్వానుభవం నుంచి విషయాలను చూసి ప్రదర్శించడం నేటి అవసరంగా మారింది. ఒక రకంగా ఇప్పటి రచయితలు తమ తమ అత్మకథలకు సృజనాత్మక నవలా రూపం కల్పించాల్సిన అవసరం ఉంది.

ఇంకో మాట చెప్పాలి – తెలంగాణకు సంబంధించిన వరకు హైదరాబాదుకు చాలా మంది రచయితలు స్థానికులు కాలేకపోయారు. స్థానీయతను అంటే నేటివిటీని సంతరించుకోలేకపోయారు. దానివల్ల దాని పట్ల ఆత్మీయతను పొంది, దాన్ని జీర్ణించుకుని నవలలు రాయలేకపోయారు. కోస్తాంధ్రకు సంబంధించినంత వరకు నగరజీవితాన్ని ప్రతిబింబించడానికి అనువైన నగరాలు చాలానే ఉన్నాయి. మద్రాసు వారికి ఓ గనిగా ఉండేది. ఉత్తరాంధ్రకు విశాఖపట్నం, దక్షిణాంధ్రకు గుంటూరు, ఇతర జిల్లాకు విజయవాడ వంటి నగరాలు ఉన్నాయి. తొలుత తెనాలి అటువంటి నగరమే. ఈ నగరాల నుంచి వచ్చిన సాహిత్యం నగరీకరణను ఎంతగానో సంతరించుకుంది. తెలంగాణకు హైదరాబాదు మాత్రమే కాకుండా అద్భుతమైన చరిత్ర, సంస్కృతి గల వరంగల్ ఉంది. అయితే, అటువంటి నవలలు వరంగల్ నుంచి కూడా ఇప్పటి వరకు రాకపోవడం మన శాపమే. రచయితలు తమను తాము అంటే, తమ ఆత్మలను ఆవిష్కరించుకోవడం మానేసి సామాజిక ప్రయోజనం పేరుతో ఇతరులను చైతన్యవంతులను చేయడానికి పూనుకోవడం వల్లనే నగరీకరణ చెందిన నవలలు రాలేదని చెప్పవచ్చు. ఆలా చైతన్యవంతులను చేయడానికి సాహిత్యాన్ని ఆవిష్కరించడం తప్పని అనడం లేదు గానీ మనలోకి మనం తొంగిచూసుకుని లోతుగా విశ్లేషించుకునే పని చేయలేకపోయామనేదే నా అబిప్రాయం. కోస్తాంధ్ర రచయితలు మానసికంగా ఆధునికతను, మధ్యతరగతి మనస్తత్వాన్ని సంతరించుకున్నారు కాబట్టే వారి రచనల్లో అర్బనిటీ వ్యక్తమవుతూ వచ్చింది. హైదరాబాదు వంటి నగరాన్ని మన జీవితాల్లోకి తీసుకోలేకపోయామనేదే నా ఆవేదన. వివిధ తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాదు చేరుకున్న రచయితలు మానసికంగా ఈ నగరాన్ని తమ జీవితాల్లోకి తీసుకోలేకపోయారని చెప్పవచ్చు. ఏదో మేరకు హైదరాబాదు నగర జీవితంలో లీనమయ్యారు కాబట్టే లోకేశ్వర్ నుంచి ఆ మాత్రం నవల వచ్చింది. నేను ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, ఎవరినో తప్పు పట్టాలని కాదు.

(ఫిబ్రవరి 19వ తేదీన కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సులో సమర్పించిన పత్రం)

- కాసుల ప్రతాప రెడ్డి

English summary
Kasula Pratap reddy depicts the urbanity projected in Telangana novels. Ampasayya Naveen's novels reflected urbanity, he opins.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X