
తెలంగాణ రచయితకు తోవ దొరికింది

నిజానికి తెలంగాణ సాహతీవేత్తలు ఆనాడు కట్టమంచి రామలింగారెడ్డి మాదిరే సాహిత్యం 'గీత' కాదన్నారు. సూక్తి ముక్తావళిగా సాహిత్యాన్ని చూడడానికి వారు నిరాకరించారు. విశాలాంధ్ర అనే అమూర్త భావన ఆంధ్రప్రదేశ్‌గా రూపం దాల్చిన పిదప కాలంలో తెలుగు సాహిత్యాన్ని హస్తగతం చేసుకొన్న వారు తెలంగాణలో అప్పటికి రంగంలో ఉన్న సాహితీ రూపాలను, కేవలం అవి వారి ఆధునికత ఎజెండాకు అనుకూలంగా లేవు కనుక వాటిని గుర్తించ నిరాకరించారు. చరిత్రలో వాటికి స్థానం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దీని మూలంగా తదనంతర కాలంలో వచ్చిన తెలంగాణ పాఠకులు, రచయితలు, కవులు, విమర్శకులకు తమ ముందు తరం వారు సాహిత్య రంగంలో చేసిన కృషి ఏమిటో తెలియకుండా పోయింది. దీని మూలంగా సాహిత్యం అంటే నీతి గ్రంథం, సిద్ధాంతం - కాదంటే రాజకీయాస్త్రం అనుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు.
అంతేకాదు ఈ కారణంగా తెలంగాణలో పుట్టి పెరిగి సాహిత్య ప్రపంచంలో కాలుపెట్టిన సరికొత్త పాఠకుడికి ఎక్కడివాడో అయిన గురజాడ అప్పారావు, అయనకన్నా ఇంకా దూరపువాడైన గిడుగు రామమూర్తి పంతులు చిరపరిచితు లవుతారు. అనేక సందర్భాలలో బహుదగ్గరివారు అవుతారు కూడా. అదే తాను పుట్టి పెరిగిన చోట తన తండ్రి, తాతలకు సమకాలీనంగా బతికి కవిత్వాలు, కథలు రాసిన వారిని మాత్రం ఈ నవ పాఠకుడు ఎన్నటికీ కనిపెట్టలేకపోతాడు. దీనికి కారాణాలు అనేకం. కుట్రలు లెక్కకు మిక్కిలి. శతాబ్దకాలంగా ఒక పథకం ప్రకారం అదృశ్యశక్తులు పన్నుతూ వస్తున్న కుయుక్తుల కారణంగా, దుర్మార్గాల కారణంగా ఈ స్థితి తలెత్తింది. ఉదాహరణకు వానమామలై వరదాచార్యులు, పాములపర్తి సదాశివరావు, పల్లా దుర్గయ్య, అనుముల కృష్ణమూర్తి వంటి కవులు, రచయితల రచనలు సరేసరి, కనీసం పేర్లు కూడా తెలుసుకొనే అవకాశం మన సాహితీ చరిత్ర మనకివ్వలేదు. వారికి ముందుతరం రచయితలు ఉదాహరణకు ఒద్దిరాజు సోదరులు. మనకు అసలుకే తెలువదు. సురవరం బాటను విడిచినందుకే ఇలా అయిందనుకుంటే తరువాతి కాలంలో మనం తొక్కిన బాట ఏమిటో ఇప్పుడు కొంత సావకాశంగా పరిశీలిద్దా. కోస్తా కమ్యూనిస్టు - బ్రాహ్మణ సాహిత్య చరిత్రకారులు మేధావులు, అభ్యుదయవాదులు, క్రాంతదర్శులు వేసిన కొత్త బాటలో నడిచి మనం ఏం తెలుసుకున్నామో ఒకసారి చూద్దాం.
తనది కాని భాషలో తను పుట్టిన ఇంట్లో, పెరిగిన ఊరిలో ఎన్నడూ వినని భాష, కేవలం పుస్తకాలలో (పాఠ్యపుస్తకాలో సహా), పత్రికలలో, సినిమాలలో మాత్రమే వినే భాష. తానెన్నడూ మాట్లాడ నేరని భాషలో తన అంతరంగాన్ని ఆవిష్కరించవలసివచ్చినందువల్ల తెలంగాణ రచయిత న్యూనతకు లోనయ్యాడు. కోస్తా సాహితీవేత్తలు, ఆధునికులు అందించిన జాఢ్యం ఇది. తనది కాని భాషలో రాయడం ఒక్కటే కాదు. తన అనుభవాల సంపుటిలో చేరనిది తనది కానిది మరెవరిదో అనుభవం - దానిని తన రచనకు ముడిసరుకుగా తీసుకోవాలని ఆగంతకులెవరో పెట్టిన షరతులకు తల ఒగ్గి రాయవలసి రావడం ఇక్కడి రచయితను ఇంకా కుంగదీసింది. న్యూనత పెరిగి పెరిగి పెద్దదై తన రచనాశక్తిని కూడా అతను కోల్పోయేలా చేసింది. రాసి రాసి ఎంత అరగదీసినా ప్రయోజం లేక చివరికి మన రచయిత శల్యమైపోయాడు. ఇదంతా ఇప్పుడు గత చరిత్ర. గతించిన గతం.
కాలంలో వచ్చిన, వస్తున్న పెనుమార్పుల మూలంగా గత మూడు దశాబ్దాలుగా ఈ పరిస్థితి క్రమంగా మారుతూ వస్తున్నది. అల్లం రాజయ్య కథలతో మొదలైన ఈ మార్పు ఈనాటికి గోసంగి రచయితలు రచనలతో ఒక స్పష్టమైన రూపు తీసుకుంది. తెలంగాణ కవులు, రచయితలు చివరికి కందుకూరి వీరేశలింగం అప్పుడెప్పుడో అక్కడెక్కడో వేసిన బాటను (అది మనకోసం వేసిన బాట కాదు) వీడి కట్టమంచి బాటకు మరలినట్టు ఈ మార్పులు సూచిస్తున్నాయి.
తనది కాని భాషలో (దానినే ప్రామాణిక భాష అంటారు) రాయడానికి స్వస్తి చెప్పి తన చిన్ననాటి భాషలో తెలంగాణ రచయిత రచనలు చేయడం మొదలుపెట్టింది. ఆదిగా విమర్శనారంగంలో సంక్షోభం చోటు చేసుకుంది. తెలంగాణ కవులు, రచయితలు రాస్తున్న రాతలను అంచనా వేయలేక, వేయడం చాతగాక, ఇష్టంలేక అవి వస్తున్నా రానట్టుగానే వ్యవహరిస్తూ ఈ సోకాల్డ్ విమర్శకులు తమను తాము వంచించుకోవడమే కాదు, తెరమరుగైపోతున్నారు కూడా. కొత్త రచనలకు కొత్త పాఠకులైతే ఏర్పడ్డారు కాని విమర్శకులు ఏర్పడలేదని ఈ పరిస్థితి చెప్పక చెబుతున్నది. కవులు, రచయితలలో వచ్చిన మార్పులు విమర్శకులలో రాకపోవడానికి సిద్ధాంతాల మీద (అవి కాలం చెల్లినవైనా సరే) వారికి వున్న ఎనలేని వ్యామోహమే కారణమనుకోవాలి.
రాయడం తెలిసి, బాగా తెలిసి రాసే కోస్తా బ్రాహ్మణ, బ్రాహ్మణీయ రచయితలు అనుసరించిన మార్గంలో నడిచినంతకాలం తనకు రాయడం రాదనుకున్న తెలంగాణ రచయిత ఇప్పుడు నిజంగానే రాయడం రాకున్నా రాస్తున్నాడు. బహుశా మొదటిసారి రాస్తున్నాడు. రాయడం తెలియని రచయిత రచనా వ్యాసంగం/సంప్రదాయం/వారసత్వం ఉన్న రచయిత కన్నా ఎందుకు బాగా రాస్తాడో తెలంగాణ రచయిత ఇప్పుడు రుజువుచేస్తున్నాడు. తిరుగులేని విధంగా రుజువు చేస్తున్నాడు. కోస్తాకు (ఉత్తరకోస్తాను కలుపుకొని) తెలంగాణకు మధ్య ఎంత దూరమో ఇప్పుడు కోస్తా సాహిత్యానికి, సాహిత్యంలో వాళ్ళు వేసిన తోవలకు, తెలంగాణ సాహిత్యానికి, సాహిత్యంలో వాళ్ళు వేస్తున్న కొత్త తోవలకు మధ్యకూడా అంతే దూరమనే కటిక నిజం నుంచి ఇప్పుడు మనం పలాయనం చిత్తగించడం లేదు.
భాషరాని, సంస్కారం లేని, సహృదయం అసలే లేని, నాగరికత నేర్వని తెలంగాణ కవులు రచయితలు - కోస్తా బ్రాహ్మలు, విప్లవ బ్రాహ్మలు మెచ్చే వెన్నుతట్టే సాహిత్యాన్ని ఇకపై సృష్టించబోమని ఖరాఖండిగా ప్రకటించి సురవరం వేసిన తోవను తెలిసీ తెలవక తొక్కిన, తొక్కుతున్న తెలంగాణ కవులు రచయితలు ఇప్పుడిక వెనకకు తిరిగి చూడరు. వెన్నుతిప్పరు. తెలుగుసాహిత్యంలో ఇప్పుడు వీస్తున్నది తెలంగాణ గాలి.
- అంబటి సురేంద్రరాజు