కేసీఆర్ చేతిలో గాయపడ్డ 'తెలంగాణ పాట': అనంత శ్రీరామ్ అవసరమా?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 1200మంది బలిదానాలు.. పదేళ్లకు పైగా సుదీర్ఘ పోరాటం.. మలిదశ తెలంగాణ ఉద్యమం ఓ చారిత్రక ఘట్టం. అంతకుమించి అనునిత్యం ఓ సంఘర్షణ.. ఒక అస్తిత్వ వేదన. ఇంతటి ఘనమైన నేపథ్యం కలిగిన తెలంగాణ చరిత్రను.. కళ్లముందున్న వర్తమానం ఎలాంటి నైతికతకు అన్వయించుకుంటుందో తెలిస్తే నిజమైన తెలంగాణవాది మనసు కకావికలం కావడం ఖాయం.

తెలంగాణ తెర మీద జరుగుతున్న ప్రస్తుత పరిణామాలను గమనిస్తే.. ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ రైతులకు భరోసా ఇవ్వడం కోసం, వారిలో నూతనోత్తేజాన్ని రగిలించడం కోసం సీఎం కేసీఆర్ కొంతమంది కవులు, రచయితలో ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ సమావేశంలో చంద్రబోస్, ఉత్తేజ్, అనంతశ్రీరామ్ వంటి వ్యక్తులు దర్శనమివ్వడమే ఎవరూ ఊహించని, జీర్ణించుకోలేని అంశం.

అప్పుడెక్కడ ఈ గొంతుకలు:

అప్పుడెక్కడ ఈ గొంతుకలు:

ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడ్డప్పుడు.. మనతో కలిసిరాని గొంతుకలు ఇప్పుడు మాత్రం మన రైతులకు భరోసానిచ్చేందుకు భుజాలు ఎగిరేయడం ఒక కఠిన వాస్తవం. అదే సమయంలో.. తుపాకీ పదఘట్టనల నుడమ, రబ్బర్ బుల్లెట్ల నడుమ ప్రతిఘటన పోరును సలిపిన అసలైన 'తెలంగాణ పాట' ఇప్పుడు అనామకంగా మిగిలిపోయే పరిస్థితి రావడం ఇప్పటి నైతికతకు నిదర్శనం.

అందెశ్రీ అనామకుడేనా?

అందెశ్రీ అనామకుడేనా?

'జయ.. జయహే' అని తెలంగాణాన్ని ఒక్కటి చేసిన అందెశ్రీ పాట ఇప్పుడు తెలంగాణకు అవసరం లేదని పరోక్షంగా గుర్తుచేస్తున్నారు. ఒక్క అందెశ్రీ మాత్రమే కాదు, ఉద్యమం సందర్భంగా పుట్టుకొచ్చిన వేల గొంతుకలు ఇప్పుడు వారి దృష్టిలో గడ్డిపోచల కంటే హీనంగా కనిపిస్తున్నాయేమో!. కానీ ఆ గొంతుకలే లేకపోతే తెలంగాణ ఇంతటి చైతన్య స్పూర్తిని సంతరించుకునేదా? అన్న అంశాన్ని బంగారు తెలంగాణవాదులు ఇప్పటికైనా ఆలోచన చేయాల్సిన అవసరముంది.

అనంత శ్రీరామ్, ఉత్తేజ్, చంద్రబోస్.. నయా తెలంగాణ వాదులు:

అనంత శ్రీరామ్, ఉత్తేజ్, చంద్రబోస్.. నయా తెలంగాణ వాదులు:

అనంత శ్రీరామ్ లాంటి తెలంగాణయేతర వ్యక్తులు ఇక్కడి రైతుల కోసం పాటలు రాయడంలో ఎలాంటి అభ్యంతరం లేకపోయినా.. ఇక్కడి ప్రజాకవులు విస్మరణకు గురైన చోట.. పరాయి వ్యక్తులు ప్రభుత్వాల చేత కీర్తించబడటమే అసలైన అభ్యంతరం. అంతకుమించి.. ఒక దృక్పథం అంటూ లేని, ఒక నిబద్దతకు కట్టుబడి లేని సినీ కవులు తెలంగాణ పాటను భుజానికెత్తుకోవడం మరింత అవమానకరం.

ఇక చంద్రబోస్ అనే కవి.. ఏనాడు తెలంగాణ ఉద్యమం వైపు తొంగిచూసిన దాఖలా లేదు. తనకు తాను చెప్పుకుంటే తప్ప.. చంద్రబోస్ అనే వ్యక్తి తెలంగాణ వాడేనా? అన్న సోయి రాదు. తెలంగాణ ఉద్యమం పట్ల, ఇక్కడి సమాజం పట్ల ఆయన పెన్నుకు ఉన్న సోయి అలాంటిది. అలాంటి వ్యక్తి ఇప్పుడు వేదికనెక్కి తెలంగాణను బహుగొప్పగా గానం చేస్తుంటే.. మనమంతా చూసి తరించాలేమో!

ఎక్కడ తెలంగాణ పేరెత్తితే.. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు దెబ్బ తింటాయో అని కలుగులో దాక్కున్న వీళ్లంతా.. ఇప్పుడు తెలంగాణ ఫలాలను ఆబగా తినేందుకు మాత్రం రెడీ అయిపోతున్నారు. చోద్యం చూసే స్థితిలో తెలంగాణ జనాన్ని నిలబెట్టి కేసీఆర్ సర్కార్ మరో వివాదాన్ని రక్తి కట్టిస్తోంది.

తెలంగాణ పాటకు అసలు సిసలు గొంతుకలు:

తెలంగాణ పాటకు అసలు సిసలు గొంతుకలు:

ఏదేమైనా.. అసలు సిసలు తెలంగాణ పాటకు ప్రాతినిధ్యం వహించగలిగేది ప్రజా గొంతుకలు మాత్రమే. డబ్బుల కోసం ఏ ప్రభుత్వాలకైనా పాటలు రాసేవారితో.. 'తెలంగాణ'ను పాడుకోవడం కచ్చితంగా దుస్థితే తప్ప మరొకటి కాదు. ఎందుకు?.. ఉత్తేజ్ అనే సినీ కవిని హుదూద్ తుఫాన్ వంటి పృకృతి విలాపం కరిగించింది గానీ, దశాబ్దాల తెలంగాణ ప్రజాకాంక్ష మాత్రం ఆయన్ను కరిగించలేకపోయింది. అందుకే వైజాగ్ విలాపం పేరుతో ఆయన కలం కదిలింది తప్పితే.. తెలంగాణ కోసం ఏనాడు ఆయన కలం కలదలేదు.

నిజానికి సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణకు కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయనే వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. గతంలో ఆంధ్ర ప్రభుత్వాల హయాంలో ఉన్నత స్థాయిలో పనిచేసిన వ్యక్తే.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో గతం కన్నా ఉన్నత స్థాయిలో పనిచేస్తూ.. తెలంగాణ సాంస్కృతిక శాఖను నిర్దేశించే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శ ఉంది. ఈ శక్తుల పీడ నుంచి తెలంగాణ విముక్తి అయిన రోజే.. ఇక్కడి గొంతుకలకు ప్రాతినిధ్యం దక్కుతుందేమో!

(సోషల్ మీడియాలో తెలంగాణ జనం ఆవేదన చూసిన తర్వాత..)

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Controversies keep stalking telangana Chief minister KCR, Recently Another controversy was revolving around him regarding writing songs for telangana farmers
Please Wait while comments are loading...