తావు
పిల్లర్లున్నా
భవంతి కాదు
గోడలున్నా
ఇల్లు కాదు
రాతి టోబూళ్లూ కేన్ కుర్చీలూ
బన్నూ చాయ్ లూ బ్రెడ్లూ బిస్కిట్లూ
పన్నెండూ రూపాల అన్నసత్రమది
కొమ్మలు లేకున్నా
అసొంటి మొలకలమే
ఊడలు లేకున్నా
అదే సంరంభం
వానల తడిసిన మనసుకు కౌగిలి
పొగలు కక్కె టీకప్పు కుంపటి
ఎండకాలం సేద మజిలీ
అయ్య మీద అలిగి చాకప్పులు కడిగేది
వయసు పోరలు
అలాయి బలాయీలూ
వన్ బైటూలుగా కలిసి మెలిగేదీ
దోమే తీన్ లుగ అల్లుకునేదీ
బాతాఖానీలు
బచ్చేదానీలు
అక్కడే....
భావుకతల మాధుర్య మాద్యమమయ్యేదీ
కారిన చెమటను కప్పుల్లో కలబోసుకునేదీ
చాయల సప్పరింతలల్ల పెదవుల బురదను కడిగేసుకునేది
అక్కడే.... కవిత్వాలు
ఉద్రేకాల మానిఫెస్టోలయ్యిందీ
ఉద్యమాలు
ఉద్వేగాల ఎజెండాలయ్యేదీ
ఆలోచనలు పేజీల్లోని పుస్తకమయ్యిందీ
అక్కడే...
అక్కడేమున్నదీ
గ్లోబల్ పబ్బుల్లోకి
పబ్బుల్లాంటి వెబ్బుల్లోకి
శిశిరం ముందు ఆకుల్లా
కన్నీటి బొట్లను రాల్చలేను
తావు కోసం
పక్షులు గిరికీలు కొడుతున్నయి












Click it and Unblock the Notifications