కొంత జ్వర కవిత్వం
ఈ శీతల ఉదయాన
దేహాన్నిలా వెచ్చని జ్వరానికప్పచెప్పి
నాదికాని స్వప్నాన్ని నిదుర కళ్లతో కలవరిస్తుంటే
ఎర్రని గోరింట చేతులతో
నుదుటిపై తడిస్పర్శ........సహచరి....!
అదేపనిగా తడారి పోయే పెదాలు
చలికి ఒణుకుతూ గొంతు దిగనని మొరాయించే శ్వాస
ఉష్ణోగ్రతని పెంచుతుంటే
కన్నుల్లో దాచుకున్న ప్రేమవర్షం
చిత్తడి చిత్తరువై ఒకే ఒక్క పిలుపు
బలవంతంగా తెరిచిన కళ్లముందు
నన్నూ జ్వరాన్నీ తనలో మమేకం చేసుకోవాలనే
ఆర్థ్రనయనాలతో అమ్మ లాంటి సహచరి........!!
అనుకుంటాం గానీ
దిగులేసినప్పుడో......మంచానపడ్డప్పుడో కదా
గుండె బలం తెలిసేది.......?
ఎప్పుడు మొలుస్తాయో తెలియదు
క్షణాలు కూడా ముళ్లై గుచ్చుకుంటుంటే
తన నిదరని చీకటి కళ్లపై కాఫీలా కాసి
తలని హృదయానికి హత్తుకుని
ప్రేమతో ఒక్కో గుటకా గొంతులోకి ఒంపుతుంటే
ఈ జ్వరం ఇలా శాశ్వతంగా ఉండిపోతే మాత్రం ఏం.......??
పదే పదే కలవరింతలు...
మెలకువలోనే ఒక నిద్రావస్థ
ప్రపంచమంతా కళ్లలో గిర్రున తిరుగుతుంటే
నేను మాత్రం నా సహచరి పాదాల వద్ద
ఎప్పుడో నా చిన్నప్పటి టీకాల తాలూకు
అనుభవాన్ని అదేపనిగా నెమరవేస్తుంటాను
మిత్రులంతా యూనివర్శిటీ క్యాంటిన్ లో
కాకపోతే యంత్రానువాద ప్రయోగశాలలో
పదాలను విరుస్తూ.....అర్థాలను వెతుకుతూ....
నేనిక్కడ నా సహచరితో.....
రాకరాక వచ్చిన జ్వరంతో....
ఆనందిస్తూ......ఆక్రోశిస్తూ.......
అప్పుడప్పుడూ మిత్రుల జ్ఞాపకాల నడుమ
చింతై చిగురిస్తూ కూడా...........!!!
బెల్లంకొండ రవికాంత్












Click it and Unblock the Notifications