తెలుగు కవిత: స్వరాగం
చీకట్లో నగరం
అనాత్మతో ప్రయాణం
ఒంటరి మర్రిచెట్టు కింద వియోగి కేళీ విలాపం
ఉన్నప్పుడే కదా అంతా చూసుకోవాల్సింది
ముఖపుస్తకంలో నన్ను నేను దర్శించుకుని చెంగలించాల్సింది ఇప్పుడే కదా..
చెలిమి ఒక మార్కెట్ మంత్రం, ఒక మాయాతంత్రం
నాకు నువ్వు, నీకు నేనూ అపరిచితులమే
లోపలంతా గాలిదుమారం
స్పర్శ మృత్యుశీతల భీతి
తెగిపడుతున్న నక్షత్రాలు స్వప్నాలు
విరిగిపడుతున్న జలధారలు
గుండెలోని రక్తం కళ్లలోకి రుధిరజలపాతం
శరీరాన్ని విల్లులా వంచి బాణాన్ని సంధించను
బుద్ధిమంతుడ్నవుతాను, మంచివాడినైపోతాను
మంగళారతులు పడుతాను
మాయామోహిత మనస్సీమ
రెండు మూతుల పామై సంచరిస్తుంది
నేను ఒకటి కాదు, రెండు
అక్కడా ఇక్కడా నేనే
సందుల్లో సడేమియానూ నేనే

యుద్ధవీరుడ్నీ, వంచకుడ్నీ నేనే
వెలుగునూ చీకట్నీ నేనే
జనజీవితాల జాతకాలు రాసేదీ నేనే
వేయండి నాకో పూలదండ
కప్పండి శాలువా
చూస్తారేం, బిత్తరపోతారేం
పాము బూర ఉదుతన్నా
సోయి మరిచి నృత్యం చేయండి
రండిరా, రండి
లేదంటే కాళ్ల కింద మట్టిని తొలిచేస్తా...
రాగద్వేషాలుండవు, స్వరాగమొక్కటే..
........
అమాయకంగానో అనామకంగానో దేహం రాలిపడుతుంది
నువ్వొక మరిచిపోయిన యాదివి
- కాసుల ప్రతాపరెడ్డి
కాసుల ప్రతాపరెడ్డి కవిత స్వరాగం. మనిషిలోనే చీకటి వెలుగులనీ చూపించిన కవిత. వన్ ఇండియా తెలుగు పాఠకుల కోసం ప్రత్యేకంగా...