కవిస్వరం: పసి పాప
ఈ వారం శారద కవిసంగమం గ్రూప్‌నకు ఓ లాలిత్యమైన, మాధుర్యమైన కవితను అందించారు. ప్రేమలోని మాధుర్యాన్నే కాదు, పసితనంలోని లాలిత్యాన్ని ఆమె మనకు చాలా సరళంగా, అందంగా అందించారు. పక్కలో పడుకోబెట్టుకున్న పసిపాపను చందమామతో పోల్చడం ద్వారా ఓ చల్లదనాన్ని, హాయిని మన మనసులకు కూడా తాకేలా చేశారు.
ప్రేమ నుంచే సమాజం ప్రేరణ పొందుతుంది. ద్వేషం నుంచి పొందలేదు. ఆ విషయాన్ని కూడా ఆమె చాలా అలవోకగా, అనాయసంగా చెప్పినట్లు అనిపించింది. ప్రాణం నుంచే ప్రాణం పుడుతుందనే సృష్టిరహస్యం తల్లికి కలిగే అనుభూతిని అందించారు.
మాతృత్వంలోని మమకారాన్ని, మాటలతో చెప్పలేని అనుభూతిని మన హృదయాలను స్పర్శించి, హాయిగా ఫీలవుతాం. పసితనంలోని అమాయకత్వం, లాలిత్యం, ఆనందం క్రమంగా కోల్పోవడంలోని ఆవేదనను కూడా ఆమె అత్యంత ప్రతిభావంతంగా వ్యక్తీకరించారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ అనుభవాలు వెంటాడుతుంటాయి. క్రమంగా లాలిత్యాన్ని, జీవితంలోని ఆనందాన్ని కోల్పోతూ వస్తుంటాం.

దానికారణంగా కొంత శాడిస్టులుగా కూడా మారుతామేమో.. అదే అందవిహీనలుగా మారుస్తూ పోతుంటుంది. ఆ అందవిహీనం కారణంగా, మనం శాడిస్టులుగా మారడం వల్ల నిర్మలత్వాన్ని కూడా కోల్పోతూ వస్తాం. జీవితంలోని, ముఖ్యంగా ఆత్మకు సంబంధించిన పరిణామ క్రమాన్ని అత్యంత లలితమైన పదాల్లో, పొదుపుగా చెప్పి పాఠకుల హృదయాలను తాకే కవితను శారద అందించారు.
- కాసుల ప్రతాపరెడ్డి
చందమామని తెచ్చి దుప్పటి కప్పి
మా పక్కనే బజ్జోపెట్టుకోవడం ఎంత గర్వకారణం!
నీ లేత అర చేతులు ఆకాశాన్ని చూసినపుడు
చుక్కలు చిరునవ్వులు చిందించాయి!
ప్రేమ నుండి ప్రేరణ పొందడం
ప్రాణం నుంచీ ప్రాణం మొలవడం
సృష్టి రహస్యమని నిన్ను చేతుల్లోకి
తీసుకున్నప్పుడే తెలిసింది!
నీ లేత బుగ్గల్లో లాలిత్యం
నా గుండెని తాకినప్పుడు
తియ్యని సంగీతమేదో
నా కళ్ళల్లో చెమ్మగా ప్రవహించింది!
పుట్టినప్పుడు అందరం నీలానే పసివాళ్ళం
పెరిగేటప్పుడు ఆనందాన్ని కొద్ది కొద్దిగా మర్చిపోయాం
ఇప్పుడు అనుభవ శూరులమే కానీ అందవిహీనులం
నిర్మలత్వాన్ని నిర్మూలించడమే పనిగా పెట్టుకున్నాం
నువ్విచ్చే చిరునవ్వు కానుకల్ని
నీ పెదవుల్లో విచ్చుకున్న రోజాపూల కాంతుల్ని
ఆ మృదుత్వాన్ని అమృతత్వాన్ని
అమరత్వంగా మార్చమని నిన్ను సృష్టించిన వాణ్ణి ప్రార్థిస్తాను!
- శారద సివి
05.10.2014












Click it and Unblock the Notifications