2000 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమైన 'అద్భుత మూలిక'.. బంగారంతో సమానమైన విలువ!
రెండు వేల ఏళ్ల క్రితమే భూమిపై నుంచి అంతరించిపోయిందని భావించిన ఒక అరుదైన, అత్యంత శక్తివంతమైన మొక్క మళ్లీ వెలుగుచూసింది. ప్రాచీన గ్రీకులు, రోమన్లు, ఈజిప్షియన్లు దీనిని ఒక 'అద్భుత ఔషధం'గా భావించేవారు. అనేక రకాల తీవ్రమైన రోగాలను నయం చేయడంతో పాటు, గర్భనిరోధకంగా కూడా ఉపయోగపడే 'సిల్ఫియం' అనే ఈ మొక్కను టర్కీకి చెందిన ఒక ప్రొఫెసర్ తిరిగి కనుగొన్నారు. ప్రాచీన కాలంలో మధ్యధరా తీర ప్రాంతంలో ఈ పసుపు రంగు పూల మొక్కకు ఎంతో ప్రత్యేకమైన చరిత్ర ఉండేది.
ప్రాచీన రోజుల్లో ఈ మొక్క పూలు, కాడలకు మనుషులు అమితమైన ప్రాధాన్యతనిచ్చేవారు. దీని వేర్లు, కాడల నుంచి రసం తీసి వైద్యంలో వాడేవారు. దీనిని వంటల్లో కూడా ప్రత్యేక రుచి కోసం ఉపయోగించేవారు. జూలియస్ సీజర్ రోమ్‌ను ఏలుతున్న సమయంలో ఈ మొక్క విలువ వెండితో సమానంగా ఉండేదట! సీజర్ తన ఖజానాలో బంగారంతో పాటు వెయ్యి కిలోలకు పైగా ఈ సిల్ఫియం మొక్కలను దాచి ఉంచాడంటేనే దీనికి ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. ఆధునిక లిబియా ప్రాంతంలో ఎక్కువగా పెరిగిన ఈ వింత మొక్క, ఆ తర్వాత కేవలం ఏడు శతాబ్దాల వ్యవధిలోనే పూర్తిగా కనుమరుగైపోయింది.

చరిత్ర పుటల్లో కనుమరుగైన ఒకే ఒక్క కాడ
క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ఈ మొక్కకు చెందిన "ఒకే ఒక్క కాడ" మిగిలిందని, దానిని అప్పటి రోమన్ చక్రవర్తి నీరోకు బహుమతిగా ఇచ్చారని ప్రముఖ రోమన్ చరిత్రకారుడు ప్లినీ రాసుకొచ్చారు. మానవ చరిత్రలో ఒక మొక్క జాతి పూర్తిగా అంతరించిపోవడంపై నమోదైన తొలి కథనం ఇదే కావడం గమనార్హం. ఆ తర్వాత మధ్యయుగంలో ఎందరో పరిశోధకులు, సాహసికులు దీని కోసం మూడు ఖండాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కాలక్రమేణా ఈ అద్భుత మొక్క గురించిన ముచ్చట కూడా అందరూ మరిచిపోయారు.
టర్కీ కొండలపై వెలుగుచూసిన పురాతన మూలిక
ఇస్తాంబుల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు మహమూత్ మిస్కీ, టర్కీలోని 'హసన్ పర్వతం' పై పెరుగుతున్న 'ఫెరులా డ్రూడియానా' అనే మొక్కే ప్రాచీన 'సిల్ఫియం' అని బలంగా చెబుతున్నారు. ప్రాచీన గ్రీకు నాణేలపై ముద్రించిన బొమ్మలు, పాత గ్రంథాల్లోని వివరణలతో ఈ మొక్క సంపూర్ణంగా సరిపోలుతోంది.
దట్టమైన వేర్లు, పసుపు రంగు పూలతో ఉన్న ఈ మొక్క క్యారెట్, పార్స్లీ కుటుంబానికి చెందినది. దీనిపై జరిపిన పరిశోధనల్లో క్యాన్సర్ నిరోధక, ఇన్ఫ్లమేషన్ తగ్గించే గర్భనిరోధక గుణాలు కలిగిన 30కి పైగా రసాయనాలు ఉన్నట్లు తేలింది. విశేషమేమిటంటే.. మేకలు, గొర్రెలు ఈ మొక్కను ఎంతో ఇష్టంగా తింటాయని, ప్రాచీన గ్రంథాల్లో సిల్ఫియం గురించి ఉన్న వివరణ కూడా సరిగ్గా ఇదే కావడం విశేషం.














Click it and Unblock the Notifications