3000 ఏళ్ల కిందటే నేత కళలో సంచలనం.. అరుదైన హిస్టారికల్ ప్రూఫ్!
పురావస్తు శాస్త్రంలో మరొక సంచలనాత్మక రహస్యం వెలుగులోకి వచ్చింది. సుమారు 3,000 ఏళ్ల క్రితం నాటి ప్రాచీన సంస్కృతికి అద్దం పట్టే అరుదైన వస్తువులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి ఒక వినూత్న విషయాన్ని కనుగొన్నారు. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉన్న ప్రసిద్ధ 'సాన్క్సింగ్దుయ్' పురావస్తు ప్రాంతంలో లభించిన నమూనాలను పరిశీలించగా, నాటి పూజా కార్యక్రమాలు , ఆధ్యాత్మిక ఆచారాలలో అత్యంత ఖరీదైన పట్టు వస్త్రాన్ని ఉపయోగించినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. నివేదికల ప్రకారం, అక్కడి పూజా గుండాల్లో దొరికిన కాంస్య ముసుగులు, బంగారు, జియెడ్ (రత్నాలు) ఏనుగు దంతాల వస్తువులపై పట్టు దారాల అవశేషాలు భద్రంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
కంటికి కనిపించని దారాలు.. ముసుగుపై రంగుల హంగులు!
శాస్త్రవేత్తలు అత్యాధునిక ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌లు , రసాయన పరీక్షల ద్వారా ఈ అవశేషాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఒక పెద్ద కాంస్య ముసుగు కుడి కన్ను , కంటిబొమ్మల భాగంలో పట్టు వస్త్రం సన్నని పొరలుగా అంటుకుని ఉండటాన్ని కనుగొన్నారు. అంతేకాకుండా, ఈ పట్టు వస్త్రంపై ఎరుపు రంగు ఆనవాళ్లు కూడా లభించాయి. పట్టు దారాల తయారీలో రకరకాల అల్లే పద్ధతులు వాడారని, కొన్ని సడలింపుగా ఉంటే మరికొన్ని చాలా గట్టిగా, నైపుణ్యంతో అల్లినట్లు తెలిసింది. ఆ కాలంలోనే ఇంతటి పరిణతి చెందిన నేత సాంకేతికత అందుబాటులో ఉండటం పరిశోధకులను సైతం విస్మయానికి గురిచేసింది.

పూజా క్రతువుల్లో 'పట్టు' ప్రసిద్ధి!
తవ్వకాలలో బయటపడిన ఈ పట్టు అవశేషాలు చాలా వరకు వస్తువుల అడుగుభాగంలో లేదా వాటి చుట్టూ చుట్టబడి ఉన్నాయి. ఒక వృత్తాకార కాంస్య ఆభరణంపై ఏకంగా ఐదు పొరల పట్టు వస్త్రం చుట్టి ఉన్నట్లు బయటపడింది. దీనిబట్టి ప్రాచీన 'షు' సాంస్కృతికి చెందిన ప్రజలు పవిత్రమైన బహుమతులను లేదా పూజా ద్రవ్యాలను దేవుళ్లకు సమర్పించే ముందు, వాటిని రక్షించేందుకు లేదా గౌరవసూచకంగా ఎరుపు రంగు వేసిన పట్టు వస్త్రాల్లో జాగ్రత్తగా చుట్టి సమర్పించేవారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
భూమిలో వేల ఏళ్లు ఎలా భద్రంగా ఉన్నాయి?
సాధారణంగా పట్టు వంటి సున్నితమైన వస్త్రాలు భూమిలో చాలా త్వరగా కలిసిపోతాయి. కానీ, సాన్క్సింగ్దుయ్ ప్రాంతంలోని భూగర్భ వాతావరణం, కాంస్య లోహాల తుప్పుతో ఏర్పడిన రసాయన చర్యల వల్ల ఈ పట్టు పోగులు మినిరలైజేషన్ చెంది తమ ఆకారాన్ని కోల్పోకుండా నిలిచిపోయాయి. కాల పరీక్షను తట్టుకుని వేల ఏళ్ల నాటి నాగరికతకు, నాటి మతసంప్రదాయాలకు ఈ పట్టు అవశేషాలు సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి.














Click it and Unblock the Notifications
