భూమికి విషపు కిరణాల శాపం: అంటార్కిటికాపై ఓజోన్ రంధ్రం అమాంతం విస్తరణ
సూర్యుడి నుంచి వెలువడే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల నుండి భూమిని రక్షించే ఓజోన్ పొరలో ఏర్పడిన రంధ్రం ఈ సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లో అత్యంత వేగంగా విస్తరించింది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన కొపర్నికస్ అట్మాస్పియర్ మానిటరింగ్ సర్వీస్.. దీని వివరాలను వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం అంటార్కిటికా ఖండంపై ఉన్న ఈ ఓజోన్ రంధ్రం విస్తీర్ణం ఈ నెల 12వ తేదీ నాటికి ఏకంగా 2.5 కోట్ల చదరపు కిలోమీటర్లకు చేరుకుంది.
అంటార్కిటికాకు దక్షిణాన 60 డిగ్రీల అక్షాంశ పరిధిలో ఓజోన్ సాంద్రత 220 డాబ్సన్ యూనిట్ల కంటే తక్కువగా పడిపోయిన ప్రాంతాన్ని ఓజోన్ రంధ్రంగా గుర్తిస్తారు. నిజానికి ఆగస్టు నెలాఖరు నాటికి ఓజోన్ రంధ్రం విస్తీర్ణం 1.5 కోట్ల చదరపు కిలోమీటర్లు. ఇది సాధారణ సగటు కంటే వేగంగా ఈ పరిమాణానికి చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే దీని విస్తీర్ణం పెరుగుదల వేగం అనూహ్యం. ఈ నెల ప్రథమార్థంలోనే ఓజోన్ పొర రంధ్రం అసాధారణ రీతిలో విస్తరించడం శాస్త్రవేత్తలను దిగ్భ్రాంతికి గురి చేసింది.

ప్రస్తుత విస్తీర్ణం ఈ సీజన్ లో నమోదయ్యే సాధారణ సగటు కంటే దాదాపు 50 లక్షల చదరపు కిలోమీటర్లు అధికంగా ఉండటం గమనార్హం. ఓజోన్ పొర క్షీణతను అంచనా వేయడానికి రంధ్రం పరిమాణం మాత్రమే కాకుండా మరికొన్ని కీలక కొలమానాలను పరిగణనలోకి తీసుకుంటారు శాస్త్రవేత్తలు. ఒకే కొలమానం కాకుండా ఓజోన్ కనీస సాంద్రత, కొరత ఉన్న చోట దాని ద్రవ్యరాశి వంటి వివిధ అంశాలను కలిపి విశ్లేషించినప్పుడే దీని అసలు పరిస్థితి అవగతమవుతుంది.
అంటార్కిటికాపై ఓజోన్ రంధ్రం ఈ స్థాయిలో వేగంగా విస్తరించడానికి అక్కడ నెలకొన్న తీవ్రమైన చలి పరిస్థితులే ప్రధాన కారణమని పరిశోధకులు వెల్లడించారు. దక్షిణ ధ్రువానికి పైన దాదాపు 20 కిలోమీటర్ల ఎత్తులోని స్ట్రాటోస్పియర్ ఆవరణంలో ఉష్ణోగ్రతలు హఠాత్తుగా అడుగడుగునా పడిపోవడం వల్ల అక్కడ ప్రత్యేకంగా పోలార్ స్ట్రాటోస్పియర్ మేఘాలు ఏర్పడ్డాయి. ఈ మేఘాలు ఓజోన్ పొరకు హాని చేసే రసాయన ప్రక్రియలను మరింత వేగవంతం చేస్తాయి.
సూర్యుని నుంచి వచ్చే కాంతి ప్రసరించినప్పుడు ఈ మేఘాలలో జరిగే రసాయన చర్యల వల్ల క్లోరిన్, బ్రోమిన్ వంటి హాలోజన్ మూలకాలు ఉత్తేజితమవుతాయి. ఇవి ఓజోన్ పొరను అత్యంత వేగంగా నాశనం చేస్తాయి. అంటార్కిటికా శీతాకాలం ముగిసి వసంత కాలం ప్రారంభం అయ్యే ఆగస్టు నుండి నవంబర్ మధ్య ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో వీచే బలమైన పోలార్ వోర్టెక్స్.. అంటే చల్లటి గాలుల ప్రవాహం కారణంగా దీని తీవ్రత దీర్ఘకాలం పాటు స్థిరంగా నిలిచిపోతుంది. ఇప్పుడు అదే ఓజోన్ రంధ్రం విస్తీర్ణతకు దారి తీసింది.
దీనిపై కొపర్నికస్ అట్మాస్పియర్ మానిటరింగ్ సర్వీస్ డైరెక్టర్ లారెన్స్ రౌయిల్ మాట్లాడారు. వివిధ రసాయన, వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఓజోన్ రంధ్ర పరిమాణంలో ఏటా సహజ సిద్ధమైన మార్పులు సంభవిస్తాయని, ప్రస్తుత విస్తరణ వేగం పెరిగినప్పటికీ, దీర్ఘకాలికంగా చూస్తే ఓజోన్ పొర క్రమంగా పుంజుకుంటోందని పేర్కొన్నారు. మానవ నిర్మిత హానికర కారకాలు, ప్రకృతి సమతుల్యత మధ్య జరిగే క్లిష్టమైన మార్పులను అర్థం చేసుకోవడానికి నిరంతర పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు.
అంటార్కిటికా వసంత కాలం పొడుగునా ఈ రంధ్రంలో చోటుచేసుకునే ఉష్ణోగ్రత మార్పులు, ఓజోన్ క్షీణత తీవ్రతను తాము నిశితంగా పరిశీలిస్తూనే ఉంటామని వ్యాఖ్యానించారు. వాతావరణంలో స్వల్పకాలికంగా సంభవించే ఇటువంటి మార్పుల ప్రభావం తాత్కాలికమే అయినప్పటికీ.. పర్యావరణ పరిరక్షణ నిబంధనలను కఠినంగా అమలు చేయడం ద్వారా మాత్రమే భవిష్యత్ లో ఓజోన్ పొరను పూర్తిగా సాధారణ స్థితికి తీసుకురాగలమని అన్నారు.













Click it and Unblock the Notifications
