బెంగళూరులో iPhone 18 Pro, 18 Pro Max అమ్మకాలు షురూ: స్టోర్ లొకేషన్.. !!
ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తోన్న యాపిల్ ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro), ఐఫోన్ 18 ప్రో మాక్స్ (iPhone 18 Pro Max)ల విక్రయాలు బెంగళూరులో ఆరంభం అయ్యాయి. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు అమ్మకాలు మొదలుపెట్టారు. ఈ ప్రీమియం మోడళ్లను అందరికంటే ముందే సొంతం చేసుకోవడానికి జనం అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. విపరీతమైన క్రేజ్ కనిపించింది. గంటల కొద్దీ పడిగాపులు పడి ఐఫోన్లు కొనుగోలు చేస్తోన్నారు.
ఢిల్లీలోని యాపిల్ సాకేత్, ముంబైలోని యాపిల్ బీకేసీ అధికారిక స్టోర్లతో పాటు బెంగళూరులోని ప్రధాన విక్రయ కేంద్రాల వద్ద కొనుగోలుదారులు భారీ సంఖ్యలో బారులు తీరారు. ఐఫోన్ కొనుగోలు చేయడం తమకు ఒక పండగలాంటిదని, ప్రతి ఏటా కొత్త మోడల్ లాంచ్ కాగానే కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారిందని పలువురు చెబుతున్నారు. యాపిల్ కొత్త పరికరాల లాంచ్ అనేది ఓ సాధారణ సేల్ లా కాకుండా అట్టహాసంగా సాగింది.

బెంగళూరు యలహంక సమీపంలోని ఫీనిక్స్ ఏసియన్ మాల్ లో యాపిల్ అధికారిక స్టోర్ వద్ద ఈ తెల్లవారు జాము నుంచే కొనుగోలుదారులు క్యూ కట్టారు. అమ్మకాలు ఆరంభం కాగానే ఎగబడ్డారు. ప్రస్తుతానికి బెంగళూరులో ఏషియన్ మాల్ స్టోర్ లో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. త్వరలో మిగిలిన చోట్ల వీటి అమ్మకాలు ఆరంభం కావొచ్చు. బెంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా ఆరు రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా నేరుగా సొంతం చేసుకోవచ్చు. ఢిల్లీ- సాకేత్, నాసిక్, ముంబై- బీకేసీ వంటి చోట్ల ఉన్నాయి ఈ రిటైల్ అవుట్ లెట్స్.
యాపిల్ అధికారిక వెబ్ సైట్, ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్ వంటి మల్టీ బ్రాండెడ్ షాప్స్ లోనూ ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఐఫోన్ 18 ప్రో సిరీస్ మోడళ్లలో అత్యాధునిక ఏ20 ప్రో (A20 Pro) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఐఫోన్ 18 ప్రో మోడల్ 6.3 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ప్రీమియమ్ మోడల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ డిస్ల ప్లే 6.9 అంగుళాలు.
మొదటిసారిగా ఈ ప్రో మోడళ్లలో బ్యాక్ సైడ్ మొత్తం మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలను అమర్చారు. మెయిన్ సెన్సార్, అల్ట్రా వైడ్ లెన్స్, టెలిఫొటో కెమెరా.. మూడూ కూడా 48 మెగాపిక్సెల్ తోనూ రూపుదిద్దుకున్నాయి. వీటి ద్వారా అత్యంత స్పష్టమైన ఫొటోలు, సినిమాటిక్ వీడియోలను రికార్డ్ చేయవచ్చు. సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 18 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. బ్యాటరీ బ్యాకప్, ఆపరేటింగ్ సులువుగా ఉందని కొనుగోలుదారులు చెబుతున్నారు.
ఐఫోన్ 18 ప్రో 256 జీబీ బేస్ వేరియంట్ ధర రూ. 1,64,900. ప్రీమియం డిజైన్‌తో గల 18 ప్రో మాక్స్ 256 జీబీ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 1,74,900 గా నిర్ణయించారు. ఐఫోన్ డ్యూయో (iPhone Duo) సైతం త్వరలో భారత్ లోకి అడుగుపెట్టనుంది. వినూత్న ఫోల్డబుల్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు అక్టోబర్ 23న ప్రారంభం కానున్నాయి.












Click it and Unblock the Notifications
