Love Flower: 4 వేల ఏళ్ల నాటి జాడీలో అరుదైన ‘ప్రేమ పూల’ విత్తనాలు.
పురావస్తు శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఎన్నో విస్మయకర విషయాలు వెలుగుచూస్తుంటాయి. తాజాగా టర్కీ దేశంలో బయటపడిన ఒక పురాతన కుండ చారిత్రక వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. టర్కీలోని అంకారా నగర సమీపంలో ఉన్న గొల్బాసి ప్రాంతంలోని చారిత్రక 'కల్హోయుక్' దిబ్బపై పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో సుమారు 4 వేల ఏళ్ల నాటి హిట్టిటే కాలం నాటి ఒక మట్టి జాడీ లభించింది. ఆశ్చర్యకరంగా ఆ జాడీ లోపల భూమిపై మరెక్కడా దొరకని అత్యంత అరుదైన 'ప్రేమ పువ్వు' (లవ్ ఫ్లవర్) తాలూకు పురాతన విత్తనాలు బయటపడ్డాయి. కాంస్య యుగం నాటి కాలం నుంచే ఈ ప్రాంతంలో ఈ ప్రత్యేకమైన పూలు ఉన్నాయనేదానికి ఇది తిరుగులేని ఆధారమని నిపుణులు తేల్చారు.
అంకారా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డెర్య యిల్మాజ్ టెక్కిన్ నేతృత్వంలో ఈ తవ్వకాలు జరిగాయి. ఆ ప్రదేశంలోని ఒక పెద్ద భవనంలో లభించిన ఈ మట్టి జాడీకి పైన మూడు చిన్న నాబ్స్ ఉండగా, హ్యాండిల్, అంచు భాగం దెబ్బతిన్నాయి. అదే గదిలో పెద్ద నిల్వ పాత్రల అడుగుభాగాలు, కుండ పెంకులతో చేసిన నేత బరువులు, ఒనిడియన్ బ్లేడ్ ముక్కలు, మట్టితో చేసిన పొయ్యి అవశేషాలు లభించాయి. అంతేకాకుండా ఎద్దు తలల ఆకారంలో ఉన్న కల్ట్ బౌల్స్, అసంపూర్తిగా ఉన్న సీల్స్ (ముద్రలు) కూడా బయటపడటంతో.. అది ఒకప్పుడు పురాతన కాలం నాటి సీల్ కట్టర్ వర్క్‌షాప్ అయి ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.

కాంస్య యుగం నాటి వృక్ష సంపద.. శాస్త్రవేత్తల విశ్లేషణ
ఈ పురాతన ప్రదేశంలో లభించిన వృక్ష అవశేషాలను ఆర్కియోబాటనిస్టులు ఎమెల్ ఓబాక్-డొన్మెజ్, బార్బరోస్ యమన్ తనిఖీ చేశారు. నాటి కాలం నాటి గోధుమలు, బార్లీ, కందులు, పప్పుధాన్యాలతో పాటు ఓక్ విత్తనాలు, ఈ అరుదైన 'ప్రేమ పువ్వు' అవశేషాలను వారు గుర్తించారు. ఇవి రెండవ సహస్రాబ్ది నాటి పొరల్లో లభించాయి. ఈ జాడీలో దొరికిన విత్తనాలే ఈ జాతికి చెందిన అత్యంత పురాతనమైన విత్తన పదార్థాలుగా సైంటిస్టులు నిర్ధారించారు. అయితే, ఆ విత్తనాలను ఆ జాడీలో ఎందుకు భద్రపరిచారు? వాటి ప్రత్యేకత ఏమిటి? అనే కోణంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
అంతరించిపోయే దశలో 'సెంటారియా చిహాట్చెఫిఇ' పూలు
శాస్త్రీయ నామంగా 'సెంటారియా చిహాట్చెఫిఇ' అని పిలిచే ఈ అందమైన పూలను స్థానికంగా 'సెవ్గి చిచెక్' (ప్రేమ పువ్వు) అని పిలుస్తారు. భూమ్మీద కేవలం ఈ అంకారాలోని గొల్బాసి ప్రాంతంలో మాత్రమే ఇవి సహజంగా పెరుగుతాయి. భౌగోళికంగా అత్యంత పరిమిత ప్రాంతంలో లభించే ఈ ఎండమిక్ జాతి మొక్కలు ప్రస్తుతం తీవ్రమైన ప్రమాదంలో ఉన్నట్లు టర్కీ కన్జర్వేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. వేల ఏళ్లుగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడిన ఈ మొక్కలు, నేడు మానవ తప్పిదాల వల్ల అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి.ర్యలపై అధికారుల దృష్టి
ఈ అరుదైన మొక్కల మనుగడకు పట్టణీకరణ, విపరీతమైన వ్యవసాయం, కలుపు నివారణ మందుల వాడకం పెద్ద ముప్పుగా పరిణమించాయి. వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయడం వల్ల కూడా ఈ మొక్కలు దెబ్బతింటున్నట్లు గతంలో జరిగిన పరిశోధనలు స్పష్టం చేశాయి. ప్రత్యేకించి కెమికల్ హెర్బిసైడ్స్ వాడకం వల్ల మొక్కలు త్వరగా చనిపోవడమే కాకుండా విత్తనాల మొలకెత్తే సామర్థ్యం కూడా తీవ్రంగా పడిపోతోందని తేలింది. ఏదేమైనా, నాలుగు వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అరుదైన వృక్ష సంపదను కాపాడుకోవడానికి టర్కీ ప్రభుత్వం, పరిశోధకులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.














Click it and Unblock the Notifications
