2,800 ఏళ్ల క్రితమే గంజాయి వాడిన మానవుడు.. చరిత్ర చెప్పని ‘మత్తు’ మంత్రం
మానవాళి చరిత్రలో మత్తు పదార్థాల వాడకంపై ప్రపంచ పరిశోధకులు ఒక సరికొత్త నిజాన్ని కనుగొన్నారు. ఇప్పటివరకు భావిస్తున్న అంచనాల కంటే దాదాపు 300 సంవత్సరాల ముందే మానవుడు గంజాయిని ఉపయోగించాడని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రముఖ పరిశోధనా పత్రిక 'సైన్స్'లో ప్రచురితమైన కథనం ప్రకారం.. దాదాపు 2,800 ఏళ్ల క్రితమే సైబీరియా ప్రాంతంలో నివసించిన ప్రాచీన సంచార తెగ అయిన 'సిథియన్లు' గంజాయిని మత్తు కోసం, ఆధ్యాత్మిక క్రతువుల కోసం వాడినట్లు పక్కా ఆధారాలు లభించాయి.
శ్మశాన వాటిక తవ్వకాల్లో దొరికిన అసలు నిజాలు
దక్షిణ సైబీరియాలోని 'ఉయుక్ వ్యాలీ' ప్రాంతంలో గల తున్నుంగ్-1 అనే ప్రాచీన సమాధి వద్ద జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకుడు జీనో కాస్పరి నేతృత్వంలోని పురావస్తు బృందం 2017 నుంచి తవ్వకాలు జరుపుతోంది. ఈ తవ్వకాల్లో బంగారు ఆభరణాలు, జంతువుల విగ్రహాలు, ఖడ్గాలు, మానవ అస్థిపంజరాలతో పాటు వందలాది గంజాయి విత్తనాలు లభించాయి. సందేహం వచ్చిన శాస్త్రవేత్తలు అక్కడ లభించిన మానవ వెండ్రుకలను ల్యాబ్‌లో పరీక్షించగా.. అందులో గంజాయిలో ఉండే 'టీహెచ్‌సీ' (THC - డెల్టా-9-టెట్రాహైడ్రోకానాబినోల్) కానాబినాల్ అనే మత్తు రసాయనాలు ఉన్నట్లు తేలింది.

ఆధ్యాత్మిక క్రతువులు.. బలి ఇచ్చే ముందు నిద్రమత్తు?
ఈ ప్రాచీన సంచార జాతులు గంజాయిని కేవలం వినోదం కోసమే కాకుండా ప్రత్యేకమైన అంత్యక్రియలు, ఆధ్యాత్మిక శమన్ సంప్రదాయాల్లో భాగంగా వాడినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. ఆ సమాధి వద్ద పదుల సంఖ్యలో గుర్రాల అస్థిపంజరాలు, బలి ఇచ్చినట్లు భావిస్తున్న మానవ అవశేషాలు దొరికాయి. ఏదైనా దారుణం లేదా ప్రాణత్యాగం చేసే ముందు బాధితులకు నొప్పి తెలియకుండా ఉండటానికి లేదా వారికి స్పృహ తప్పించేందుకు గంజాయిని ఔషధంగా ఇచ్చి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు.
సరికొత్త చర్చకు తెరతీసిన శోధన
తూర్పు ఆసియాలో దాదాపు 6,000 ఏళ్ల క్రితమే గంజాయి మొక్కలను నూనె విత్తనాల కోసం పెంచినట్లు చరిత్ర చెబుతున్నప్పటికీ.. దానిని మత్తు కోసం లేదా మానసిక ఉపశమనం కోసం ఎప్పటి నుంచి వాడటం ప్రారంభించారనే దానిపై స్పష్టత లేకుండేది. సైబీరియాలో లభించిన ఈ ఆధారాలు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న గంజాయి చట్టబద్ధత, వైద్యపరమైన ఉపయోగాల చర్చకు ఒక బలమైన చారిత్రక సాక్ష్యంగా నిలవనున్నాయి.














Click it and Unblock the Notifications
