నక్షత్రాల్ని నమిలేసి.. రోదసిలోకి విసిరేస్తున్న రాక్షసి
అంతరిక్షంలో కంటపడిన ప్రతిదానినీ గుటకాయస్వాహా చేసే రాక్షస రంధ్రాలుగా 'బ్లాక్ హోల్స్ కి పేరుంది. కాంతిని కూడా తన గురుత్వాకర్షణ శక్తితో పీల్చేసే ఈ కృష్ణబిలాలు.. తమ వైపు వచ్చే నక్షత్రాలను ముక్కలు ముక్కలు చేసి నమిలి మింగేస్తాయని ఇప్పటిదాకా శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. కానీ, యూరోపియన్ సదర్న్ అబ్జర్వేటరీకి చెందిన 'వెరీ లార్జ్ టెలిస్కోప్' సాయంతో ప్రసిద్ధ వార్విక్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన తాజా పరిశోధనలో ఒక విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది. బ్లాక్ హోల్స్ తాము లాక్కున్న నక్షత్రంలో సగానికి పైగా భాగాన్ని అంతరిక్షంలోకి ఉమ్మేస్తున్నాయని తేలింది!
భూమికి దాదాపు 8,800 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న 'స్విఫ్ట్ J1727.8-1613' (Swift J1727.8-1613) అనే బ్లాక్ హోల్ సిస్టమ్‌పై శాస్త్రవేత్తలు సుదీర్ఘంగా అధ్యయనం చేశారు. గతంలో ఒక శక్తివంతమైన ఎక్స్-రే పేలుడు వల్ల ఇది వెలుగులోకి వచ్చింది. తన పక్కనే ఉన్న ఒక నక్షత్రాన్ని రాక్షసంగా దగ్గరకు లాక్కుంటూ.. దానిలోని పదార్థాన్ని ఈ బ్లాక్ హోల్ లాగడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఉత్పన్నమైన విపరీతమైన వేడి వల్ల ఆ నక్షత్ర చక్రం అంతరిక్షంలో అత్యంత ప్రకాశవంతంగా మెరిసిపోయింది.

తిన్నంత తిని.. సగం అంతరిక్షంలోకి విసిరేస్తూ!
ఈ ప్రక్రియను పరిశోధకులు టెలిస్కోప్ ద్వారా వీడియో మోడ్‌లో నిశితంగా పరిశీలించారు. నక్షత్రం నుంచి లాక్కున్న పదార్థమంతా బ్లాక్ హోల్ పొట్టలోకి వెళ్లడం లేదని వారు గుర్తించారు. వేగవంతమైన వాయు తుఫానులు, హైస్పీడ్ జెట్స్ రూపంలో ఆ పదార్థంలో సగానికి పైగా భాగాన్ని అది బయటకు విసిరికొడుతోంది. చిత్రం ఏమిటంటే.. బ్లాక్ హోల్ తన ఆకలి తీర్చుకునే వేగం తగ్గిన తర్వాత కూడా ఈ వాయువులను అంతరిక్షంలోకి చిమ్మే ప్రక్రియ ఆగకపోవడం శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేసింది.
ఖగోళ విజ్ఞానంలో సరికొత్త అధ్యాయం!
బ్లాక్ హోల్స్ తాము లాక్కున్న నక్షత్ర పదార్థాన్ని పూర్తిగా అరిగించుకోలేవని, దాదాపు సగం నివేదనను తిరిగి రోదసిలోకి చల్లేస్తాయని విశ్వవిద్యాలయ పరిశోధకుడు నోయెల్ కాస్ట్రో సెగురా వెల్లడించారు. మనం అనుకున్నంత 'సమర్థవంతమైన భక్షకులు' ఇవి కాదని ఆయన స్పష్టం చేశారు. బ్లాక్ హోల్స్ చుట్టూ ఉండే వాతావరణం, గెలాక్సీల పరిణామ క్రమాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ కొత్త అధ్యయనం ఒక తిరుగులేని మలుపుగా మారనుంది.














Click it and Unblock the Notifications