Chandrayaan-4: 2027లో చంద్రయాన్-4 ప్రయోగం.. చంద్రుడిపై నుంచి మట్టి సేకరణే లక్ష్యం
Chandrayaan-4: చంద్రుని ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి భూమికి తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా 2027లో భారత్ చంద్రయాన్ -4 మిషన్‌ను ప్రారంభించనుందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. చంద్రయాన్-4 మిషన్ లో ఎల్వీఎం-3 రాకెట్ కు సంబంధింతి పెండు వేర్వేరు ప్రయోగాలు ఉంటాయని.. ఈ మిషన్ లో ఐదు వేర్వేరు పరికరాలను మోసుకెళ్లి కక్ష్యలో సమీకరించబడతాయని చెప్పారు. మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
గగన్ యాన్ మిషన్ లో భారత వ్యోమగాములను ప్రత్యేకంగా రూపొందించిన అంతరిక్ష నౌకలో భూమి దిగువ కక్ష్యకు పంపించి సురక్షితంగా తిరిగి తీసుకురావడం జరుగుతుందని జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ మిషన్ వచ్చే ఏడాది ప్రారంభించబడుతుందన్నారు. 2026లో భారత్ సముద్రయాన్ ప్రయోగం కూడా నిర్వహిస్తుందన్నారు. ఈ ప్రయోగంలో భాగంగా ముగ్గురు శాస్త్రవేత్తలను జలాంతర్గామిలో 6,000 మీటర్ల లోతుకు తీసుకెళ్తారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో సముద్రయాన్ మిషన్ గురించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక వృద్ధి కోసం సముద్ర గర్భంలోని కీలకమైన ఖనిజాలు, అరుదైన లోహాలు, సముద్ర జీవ వైవిధ్యం వంటి విస్తారమైన వనరులను గుర్తించడంలో ఈ మిషన్ ప్రాముఖ్యత గురించి కేంద్ర మంత్రి చెప్పారు.

గత ఏడాది కేంద్ర కేబినెట్ చంద్రయాన్-4 మిషన్ ను ఆమోదించింది. ఈ మిషన్ 36 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ మిషన్ కోసం ప్రభుత్వం రూ. 2104.06 కోట్ల నిధిని అందించింది. ఇందులో చంద్రయాన్-4 అంతరిక్ష నౌక.. రెండు ఎల్వీఎం-3 రాకెట్లు, అంతరిక్ష నెట్ వర్క్, చంద్రయాన్-4తో నిరంతర సంబంధం కలిగి ఉండేలా డిజైన్ ను రూపొందించనున్నారు.
చంద్రయాన్-4 మిషన్ ఇలా..
చంద్రయాన్-4 మిషన్ ఒకేసారి ప్రయోగించబడదు. దీనిని రెండు భాగాలుగా ప్రారంభించనున్నారు. దీని తర్వాత దాని మాడ్యూల్స్ అంతరిక్షంలో అనుసంధానించబడతాయి. ఈ టెక్నాలజీ భవిష్యత్ లో భారత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. ఇస్రో ఇంతకు ముందు ఇలాంటి ప్రయోగం చేయలేదు. చంద్రయాన్-4కు సంబంధించిన భాగాలను అంతరిక్షంలోకి పంపి.. అంతరిక్షంలోనే సమీకరిస్తారు. ఈ మిషన్ ద్వారా ఇస్రో చంద్రుని మీద ఉన్న మట్టి నమునాలను తీసుకొని తిరిగి భూమిని చేరుతుంది. అంతరిక్షంలో మాడ్యూళ్లను కలపడం, వేరుచేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే.. భవిష్యత్ లో ఇండియన్ స్పేస్ స్టేషన్ ఈ పద్ధతిని ఉపయోగించి నిర్మించబడుతుంది. కాబట్టి చంద్రయాన్-4 మిషన్ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది.
2035లో భారత అంతరిక్ష కేంద్రం నిర్మాణం
చంద్రయాన్-4 ప్రయోగంపై సమీక్ష, ఖర్చు, వివరణాత్మక అధ్యయనం జరిగింది. ఇది ప్రభుత్వం, ఇస్రో విజన్ 2047లో భాగం. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రం నిర్మించాలని ఇస్రో ప్రయత్నిస్తోంది. 2040 నాటికి సొంత టెక్నాలజీ, సామర్థ్యాలతో చంద్రునికి పైగా భారతీయుడిని పంపగలమని ఇస్రో అంచనా వేసింది. భారత అంతరిక్ష కేంద్రాన్ని అనేక ముక్కలుగా ప్రయోగించి అంతరిక్షంలో సమీకరించనున్నారు. మొదటి భాగాన్ని ఎల్వీఎం-3 రాకెట్ ద్వారా అంతరిక్షంలో పంపుతారు. మొదటి ప్రయోగం 2028లో జరుగుతుంది భావిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నారు. దీని ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతారు. ఐదు వేర్వేరు భాగాలను కలిపి భారత అంతరిక్ష కేంద్రం నిర్మించబడుతుంది. మన శాస్త్రవేత్తలు దానిపైనే పని చేస్తున్నారు.












Click it and Unblock the Notifications