డీజిల్ రైళ్లకు గుడ్ బై.. బ్యాటరీ ఎలక్ట్రిక్ రైళ్లు షురూ!
అమెరికాలోని చికాగో నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చేసే సరికొత్త టెక్నాలజీకి శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా డీజిల్ రైళ్లకు స్వస్తిపలికి పూర్తిగా పర్యావరణ హితమైన బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ రైళ్లను పట్టాలపైకి తీసుకువస్తున్నారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ రైలు తయారీ సంస్థ "స్టాడ్లర్" ఈ వినూత్నమైన బ్యాటరీ-ఎలక్ట్రిక్ ట్రైన్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ అమెరికాలో సున్నా ఉద్గారాల ప్రయాణీకుల రైలు సేవల వైపు సాగుతున్న ఓ కీలకమైన ముందడుగుగా నిలుస్తుంది.
ఈ అధునాతన బ్యాటరీ రైళ్లకు సంబంధించిన అత్యంత కీలకమైన విశేషం ఏమిటంటే.. వీటికి సంప్రదాయ విద్యుత్ రైళ్లలా మార్గం పొడవునా ఓవర్‌హెడ్ పవర్ కేబుల్స్ అవసరం ఉండదు. ఇవి పూర్తిగా రైలులో అమర్చిన శక్తివంతమైన లిథియం-అయాన్ బ్యాటరీల సహాయంతో నడుస్తాయి. దీనివల్ల భారీ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు అయ్యే అదనపు ఖర్చు, శ్రమ పూర్తిగా తప్పుతుంది.

ఈ రైళ్లను ఛార్జ్ చేయడం కూడా చాలా సులభం, సౌకర్యవంతంగా ఉంటుంది. రైల్వే యార్డులు, టెర్మినల్స్‌లో అందుబాటులో ఉండే ప్రామాణిక 480V కేబుల్స్, ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ల ద్వారా వీటిని సులభంగా రీచార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ప్రయాణంలో బ్రేకులు వేసే సమయంలో ఉత్పత్తి అయ్యే శక్తిని తిరిగి వినియోగించుకునే రీజెనరేటివ్ బ్రేకింగ్ విధానం ద్వారా కూడా బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి.
చికాగోకు చెందిన ప్రముఖ కమ్యూటర్ రైల్ నెట్వర్క్ అయిన 'మెట్రా' ఈ అత్యాధునిక బ్యాటరీ-ఎలక్ట్రిక్ రైళ్లలో మొదటి దశలో భాగంగా 8 రైళ్లను ఆర్డర్ చేసింది. ప్రయాణీకుల రాకపోకల కోసం ఈ కొత్త రైళ్లు 2028 నాటికి పూర్తిగా పట్టాలపైకి రానున్నాయి. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణం మరింత చౌకగా.. సులభంగా మారడమే కాకుండా పర్యావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది.
ఈ సాంకేతికత చికాగోకు మాత్రమే కొత్త అయినప్పటికీ.. ఐరోపాలో ఇది ఎప్పుడో విజయవంతమైంది. జర్మనీలో పాత డీజిల్ రైళ్ల స్థానంలో ఈ టెక్నాలజీని 2023 నుంచే విజయవంతంగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం స్టాడ్లర్ సంస్థ తయారు చేసిన బ్యాటరీ-ఎలక్ట్రిక్ రైళ్లు ఆఫ్రికాలోని ఎండల వేడి నుంచి ఆర్కిటిక్ సర్కిల్ గడ్డకట్టే చలి వరకు ప్రపంచవ్యాప్తంగా 24 దేశాల్లో ప్రతిరోజూ లక్షలాది కిలోమీటర్లు విజయవంతంగా ప్రయాణిస్తున్నాయి.
చికాగో నగరవాసులకు ఈ ఎలక్ట్రిక్ రైళ్లు ఎంతో ప్రత్యేకంగా నిలవనున్నాయి. నార్తర్న్ ఇల్లినాయిస్ ట్రాన్సిట్ అథారిటీ అంచనా ప్రకారం.. వీటి రాకతో నగరంలో వాయు కాలుష్యం, శబ్ధ కాలుష్యం భారీగా తగ్గుతాయి. విషపూరిత పొగలు, పెద్ద శబ్ధాల నుంచి ప్రజలకు విముక్తి లభిస్తుంది. విద్యుత్ లైన్లు వేయడం కష్టసాధ్యమైన, ఖర్చుతో కూడుకున్న మార్గాల్లోనూ తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ రైళ్లను నడపడానికి ఇది చక్కటి మార్గాన్ని చూపుతుంది. దీనివల్ల మారుమూల ప్రాంతాలకు కూడా మెరుగైన రైలు కనెక్షన్ లభించి, ప్రయాణీకులు అత్యంత నిశ్శబ్ధమైన, పరిశుభ్రమైన ప్రయాణ అనుభూతిని పొందవచ్చు.














Click it and Unblock the Notifications
