సూర్యకాంతితో ఛార్జింగ్ అయ్యే న్యాచురల్ మొక్కలు.. శాస్త్రవేత్తలు సృష్టించిన అద్భుతం!
మొక్కలు మనకు నీడినిస్తాయి, ప్రాణ వాయువునిస్తాయి.. ఇక నుంచి చీకటిలో వెలుగులు కూడా పంచబోతున్నాయి. పగటిపూట సూర్యరశ్మితో ఆహారాన్ని తయారు చేసుకుంటూ పచ్చగా కనిపించే జీవులుగానే మనకు తెలిసిన ప్రాణుల్ని.. రాత్రి వేళల్లో విద్యుత్ అవసరం లేకుండానే స్వయంగా వెలుగులను చిమ్మే వినూత్న మొక్కలుగా సృష్టించారు చైనా శాస్త్రవేత్తలు . అవతార్ సినిమాలో చూపించిన పండోరా గ్రహంపై మెరిసే చెట్ల తరహాలోనే, నిజ జీవితంలోనూ వెలుగులు చిమ్మే మొక్కలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. బయోటెక్నాలజీ, మెటీరియల్ సాయిన్స్, ప్లాంట్ ఇంజినీరింగ్ల సమ్మేళనంతో రూపొందిన ఈ సాంకేతికత భవిష్యత్తులో నగరాల విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.
స్వయంప్రకాశక వ్యవస్థతో వెలిగిపోతున్న మొక్కలు
చైనాకు చెందిన బయోటెక్నాలజీ పరిశోధకులు మిణుగురు పురుగులు, రాత్రివేళ మెరిసే వినూత్న శిలీంధ్రాల (ఫంగై)లోని జన్యువులను సేకరించి మొక్కల కణజాల వ్యవస్థలో ప్రవేశపెట్టారు. ఫంగల్ బయోలుమినిసెన్స్ పాత్రవే (FBP) ని మొక్కల జీవక్రియలోకి అనుసంధానించడం ద్వారా అవి నిరంతరం మృదువైన వెలుగును అందించేలా చేశారు. పొగాకు, రోజా, డాలియా, పెటూనియా, బిళ్లగన్నేరుతో సహా ఆరు కంటే ఎక్కువ జాతుల మొక్కలలో ఈ వెలుగులను విజయవంతంగా సృష్టించారు. ఇవి ఎటువంటి బాహ్య విద్యుత్ శక్తి సహాయం లేకుండా, తమలోని రసాయనిక శక్తిని వెలుగుగా మారుస్తాయి.

ఛార్జింగ్ చేసుకోగలిగే రంగురంగుల మొక్కలు
చైనాలోని జెజియాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేసి ప్రపంచంలోనే తొలిసారిగా 'రీఛార్జబుల్' విధానంలో పని చేసే రంగురంగుల మొక్కలను అభివృద్ధి చేశారు. ఫాస్ఫర్ అనే సూక్ష్మ పదార్థాలను మొక్కల పత్రాలలో ప్రవేశపెట్టడం ద్వారా ఇవి సూర్యకాంతి లేదా ఎల్ఈడీ వెలుగులను పీల్చుకుని తమలో దాచుకుంటాయి. అనంతరం చీకట్లో ఆ పీల్చుకున్న వెలుగును పచ్చ, ఎరుపు, నీలం, ఊదా రంగుల్లో బయటకు విడుదల చేస్తాయి. పరిశోధకులు దాదాపు 56 మెరిసే మొక్కలతో ఒక ప్రత్యేకమైన గోడను తయారు చేసి, ఆ వెలుతురులో చీకటిలో సులువుగా పుస్తకాలు చదువుకోవచ్చని నిరూపించారు.
భవిష్యత్తు నగరాలకు జీవించే వీధిదీపాలు
ప్రస్తుతానికి ఈ మొక్కలు అందించే వెలుతురు పరిమితంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో సాధారణ వీధిదీపాలకు ఇవి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. ఉద్యానవనాలు, పర్యాటక ప్రాంతాలు, రాత్రి వేళల్లో వీధుల అలంకరణలో ఈ జీవ సాంకేతికతను ఉపయోగిస్తే విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా కార్బన్ ఉద్గారాలను తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది దోహదపడుతుంది. శాస్త్రవేత్తలు ఇంకా ప్రకాశాన్ని, ఎక్కువ సమయం వెలిగే సామర్థ్యాన్ని పెంచేందుకు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే మన పట్నాలు, పల్లెలు రాత్రి వేళ కొత్త వెలుగులతో కళకళలాడనున్నాయి.














Click it and Unblock the Notifications
