భగభగ మండుతున్న భారత్.. ప్రపంచ దేశాలకు ల్యాన్సెట్ హెచ్చరిక!
భూగోళం నిప్పుల కొలిమిలా మారుతోంది. వాతావరణ మార్పుల ధాటికి ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఈ హీట్‌వేవ్‌ల ఉగ్రరూపానికి చిన్నారులు, వయోవృద్ధులు విలవిలలాడిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఎండల దెబ్బకు అత్యధికంగా ప్రభావితమవుతున్న దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలవడం అత్యంత ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయంగా వెలువడిన తాజా హెల్త్ రిపోర్ట్ ఈ దిగ్భ్రాంతికర నిజాలను బయటపెట్టింది.
ప్రసిద్ధ ల్యాన్సెట్ కౌంట్‌డౌన్ నివేదిక ప్రకారం.. వడగాలుల ముప్పును ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ అగ్ర వరుసలో ఉంది. మన దేశంతో పాటు చైనా, అమెరికా, రష్యా దేశాల్లో కూడా పసిపాపలు, వయోవృద్ధులు ఈ నిప్పుల గాలులకు విలవిలలాడిపోతున్నారు. గత కొన్ని ఏళ్లతో పోలిస్తే ఎండల తీవ్రత ప్రతిఒక్కరి ఆరోగ్యాన్ని కోలుకోలేని దెబ్బతీస్తోంది. వాతావరణంలో సంభవిస్తున్న అపారమైన మార్పుల వల్ల పసిపాపలకు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకునే శక్తి లేక అనారోగ్యాల బారిన పడుతుండగా, వయోవృద్ధులు అవయవాల పనితీరు మందగించి ప్రాణాలు కోల్పోతున్నారు.

రోజురోజుకూ దిగజారుతున్న పరిస్థితులు!
గత పదేళ్ల క్రితం ప్యారిస్ వాతావరణ ఒప్పందం కుదిరినప్పటికీ, భూతాపం పెరిగే వేగానికి.. ప్రపంచ దేశాలు తీసుకుంటున్న నివారణ చర్యలకు పొంతన కుదరడం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల గడిచిన పదేళ్ల కాలంలో ఎండల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఊహించని రీతిలో పెరిగాయి. 2016 నుంచి 2023 మధ్య కాలంలోనే దాదాపు 30 లక్షల మంది కేవలం తీవ్రమైన వేడి, వడగాలుల కారణంగా మరణించారని అంచనా వేస్తున్నారు. కేవలం వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న ఈ మరణాలు మలేరియా, హెచ్ఐవి వంటి వ్యాధుల వల్ల సంభవించే మరణాల కంటే కూడా ఎక్కువగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
వాతావరణ అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలి!
ఎండల దెబ్బ నుంచి ప్రజలను కాపాడుకోవడానికి గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ నిపుణులు పిలుపునిస్తున్నారు. ప్రతి దేశ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తక్షణమే తగ్గించాలని సూచిస్తున్నారు. స్వచ్ఛమైన ఇంధనం వినియోగాన్ని పెంచడం, పేద దేశాలకు రుణాల రూపంలో కాకుండా నేరుగా ఆర్థిక గ్రాంట్ల రూపంలో నిధులు అందించినప్పుడే ఈ వాతావరణ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలమని హెచ్చరిస్తున్నారు.














Click it and Unblock the Notifications
