జూమ్, బీబీసీ సహా 178 వెబ్‌సైట్లపై సైబర్ దాడి.. క్రిప్టో, బ్యాంక్ కార్డుల వివరాలు హాంఫట్!
ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయమైన, ప్రముఖ వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు భారీ సైబర్ దాడికి పాల్పడ్డారు. జూమ్, బీబీసీ, సీఎన్ఎన్, ఐకీయా, హెచ్‌ఎస్‌బీసీ, సేల్స్‌ఫోర్స్, గిట్‌ల్యాబ్ వంటి దిగ్గజ సంస్థలకు చెందిన దాదాపు 178 వెబ్‌సైట్లలో ప్రమాదకరమైన మాల్వేర్ చొరబడినట్లు తాజాగా వెల్లడైంది.ఈ దాడి ద్వారా హ్యాకర్లు వినియోగదారుల క్రిప్టోకరెన్సీ లావాదేవీలతో పాటు బ్యాంకు కార్డుల వివరాలను దొంగిలించారు.
థర్డ్-పార్టీ ప్లాట్‌ఫాం ద్వారా చొరబాటు
ఈ సైబర్ దాడిలో హ్యాకర్లు నేరుగా ఆయా కంపెనీల సర్వర్లను హ్యాక్ చేయకుండా 'ఆప్టిమైజ్లీ వెబ్' అనే థర్డ్-పార్టీ ప్లాట్‌ఫాంను ఆయుధంగా వాడుకున్నారు. వెబ్‌సైట్ డిజైన్లు, ఫీచర్లను పరీక్షించేందుకు కంపెనీలు ఈ ప్లాట్‌ఫామ్ అందించే జావా స్క్రిప్ట్ కోడ్‌ను తమ సైట్లలో వినియోగిస్తుంటాయి. హ్యాకర్లు ఇదే అదునుగా ఆప్టిమైజ్లీ ప్రాజెక్ట్ జావాస్క్రిప్ట్‌లో తమ ప్రమాదకర మాల్వేర్ కోడ్ ను చొప్పించారు. ఫలితంగా వెబ్‌సైట్ అసలు కోడ్‌లో ఎలాంటి మార్పులు కనిపించకపోయినా.. ఆప్టిమైజ్లీ అధికారిక సీడీఎన్ డొమైన్ ద్వారానే ఈ వైరస్ 178 సంస్థల వెబ్‌సైట్లలోకి వ్యాపించింది. స్వయంగా ఆప్టిమైజ్లీ వెబ్‌సైట్ కూడా ఈ దాడికి గురవడం గమనార్హం.

క్రిప్టో వాలెట్ అడ్రస్‌ల మార్పిడి.. బ్యాంకు కార్డుల స్కిమ్మింగ్
నవంబర్ 16న వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో హ్యాకర్లు అత్యంత తెలివిగా దోపిడీకి పాల్పడ్డారు. బిట్‌కాయిన్, ఎథీరియం, సోలానా, ట్రోన్, లైట్‌కాయిన్, డోజ్‌కాయిన్ వంటి క్రిప్టో నెట్వర్కుల వాలెట్ అడ్రస్‌లను ఈ మాల్వేర్ గుర్తించగలదు. వినియోగదారులు వెబ్‌సైట్‌లో వాలెట్ అడ్రస్‌ను కాపీ చేయగానే.. ఈ వైరస్ దాన్ని మార్చేసి ఆ స్థానంలో హ్యాకర్ల వాలెట్ అడ్రస్‌ను పేస్ట్ చేస్తుంది. దీంతో యూజర్లు తమకు తెలియకుండానే హ్యాకర్ల ఖాతాల్లోకి క్రిప్టోకరెన్సీని పంపించారు. ఇప్పటికే పలు క్రిప్టో లావాదేవీలు హ్యాకర్ల వాలెట్లకు చేరినట్లు నిర్ధారణ అయింది.
వెబ్‌సైట్లలో పేమెంట్ చేసేటప్పుడు యూజర్లు నమోదు చేసే డెబిట్, క్రెడిట్ కార్డు నంబర్లు, ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ వివరాలను ఈ మాల్వేర్ దొంగిలించి(స్కిమ్మింగ్), 'నేవిగేటర్.సెండ్‌బీకన్' టెక్నాలజీ సాయంతో నేరుగా హ్యాకర్ల సర్వర్‌కు చేరవేసింది. ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకునేందుకు ఇందులో 'కరుణ', 'డార్క్‌స్వోర్డ్' వంటి ఐవోఎస్ ఎక్స్‌ప్లాయిట్ కిట్లను కూడా జోడించారు. అంతేకాకుండా బ్రౌజర్ కుకీలు, స్క్రీన్‌షాట్లను కూడా ఇది తస్కరించగలదు.
వినియోగదారులకు నిపుణుల హెచ్చరిక
అధికారిక, పేరున్న వెబ్‌సైట్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా క్రిప్టో లేదా నగదు బదిలీ చేసే ముందు అవతలి వ్యక్తి వాలెట్ అడ్రస్, ఖాతా వివరాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవడం ద్వారా ఇలాంటి మోసాల బారి నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.













Click it and Unblock the Notifications
