ఇది గాని ఢీ కొట్టిందంటే.. ఉంటుంది రా చారీ
Asteroid: అంతరిక్షంలో గతి తప్పిన ఓ గ్రహ శకలం భూమి వైపు దూసుకొస్తోంది. భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ అస్టరాయిడ్ ఎత్తు, వేగం.. అంతరిక్ష పరిశోధకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాని వైపు దృష్టి సారించేలా, కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టే పరిస్థితిని కల్పించింది.
విశ్వాంతరాల్లో గ్రహ శకలాలు, ఉల్కాపాతాలు సర్వసాధారణమే. అవి దారి తప్పి దిశా తెన్నూ లేకుండా తిరుగాడుతుంటాయి. అనేక అస్టరాయిడ్స్ భూమికి అత్యంత సమీపంలో దూసుకెళ్లిన సందర్భాలూ ఎన్నో ఉన్నాయి. వీటన్నింటికీ భిన్నంగా తాజాగా ఈ గ్రహ శకలం మాత్రం ఆందోళనకు గురి చేస్తోంది.

దీని పేరు 1997 క్యూకే 1 (1997 QK1). దీని ఎత్తు 990 అడుగులు. గంటకు 24,730 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఈ గ్రహశకలం ఆ నెల 20వ తేదీన భూమిని దాటి వెళ్తుంది. ఆ సమయంలో భూమి- ఈ అస్టరాయిడ్ కు మధ్య ఉండే దూరం.. దాదాపుగా 1.8 మిలియన్ కిలోమీటర్లు.
అంతరిక్ష ప్రమాణాల ప్రకారం ఇది అతి సమీపమే. అయినప్పటికీ- దీని వల్ల భూమికి ఎటువంటి ముప్పు లేదని నాసా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ గ్రహశకలం ఏటెన్ రకానికి చెందినది. ఈ రకానికి చెందిన గ్రహశకలాలు తరచూ భూ కక్ష్యను దాటుకుంటూ వెళ్తంటాయి. మనకు ముప్పు లేని ఆబ్జెక్టులుగా నాసా సైంటిస్టులు వెల్లడించారు.
అయినప్పటికీ- దీని కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే వస్తోన్నారు. ఎందుకంటే ఈ అస్టరాయిడ్ కక్ష్యలో వెంట్రుకవాసి మార్పులు కూడా వాటి మార్గాన్ని మార్చగలవు. దాని పాత్ వే భూమి వైపు తిరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నాసా, ఇస్రో వంటి అంతరిక్ష సంస్థలు ఇటువంటి వస్తువులను ట్రాక్ చేస్తున్నాయి.
ఈ గ్రహశకలాలు ప్రమాదకరమైనవా అంటే అవుననే చెబుతోంది నాసా. 30 అడుగుల వెడల్పు వరకు ఉన్న గ్రహశకలాలు సాధారణంగా 10-15 సంవత్సరాలకోసారి భూమిని ఢీకొంటుంటాయని, వాటి పరిమాణం తక్కువ కావడం వల్ల అవి అంతగా ప్రమాదానికి లేదా విధ్వంసానికి కారణం కాబోవని అంచనా వేస్తుంటారు.
2024 YR4 అనే గ్రహశకలం మాత్రం నాసాను భయపెట్టింది. 174 నుంచి 220 అడుగుల ఈ అస్టరాయిడ్ 2032లో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని ఈ ఏడాది ఫిబ్రవరిలో నాసా ప్రకటించింది కూడా. దీనికి గల అవకాశాలను 4.1 శాతంగా నిర్ధారించింది అప్పట్లో. ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ గ్రహశకలం 2032 డిసెంబర్ లో చంద్రుడిని ఢీకొట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications