భూమి హెల్త్ రిపోర్ట్.. ఇకనైనా మారకపోతే సర్వనాశనమే!
మనం నివసిస్తున్న ఈ సుందర ధరణి క్రమంగా తన సహజ సమతుల్యతను కోల్పోతూ విపత్కర పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతోంది. మానవ మనుగడ సురక్షితంగా సాగడానికి ప్రకృతి ప్రసాదించిన తొమ్మిది ప్లానెటరీ బౌండరీస్ లలో ఏకంగా ఏడు ఎల్లలను మానవాళి ఇప్పటికే దాటేసిందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
పాట్స్‌డామ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 60 మందికి పైగా శాస్త్రవేత్తలు రూపొందించిన '2026 ప్లానెటరీ హెల్త్ చెక్' నివేదిక ఈ దిగ్భ్రాంతికర నిజాలను వెల్లడించింది. రోజురోజుకూ పెరుగుతున్న పర్యావరణ ఒత్తిడి వల్ల భూగోళం ఊహించని విపత్తుల వైపు పయనిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
లక్ష్మణ రేఖ దాటిన ఆ 7 ముఖ్య వ్యవస్థలు ఇవే!
మానవ తప్పిదాల వల్ల సరిహద్దులు దాటిన ఆ ఏడు రంగాలు..
1- వాతావరణ మార్పులు,
2- జీవవైవిధ్య క్షీణత,
3- భూవినియోగ మార్పులు,
4-మంచినీటి లభ్యతలో హెచ్చుతగ్గులు,
5-జీవరసాయన ప్రవాహాలు (నైట్రోజన్, ఫాస్పరస్ కాలుష్యం),
6-ప్లాస్టిక్, రసాయనాల లాంటి కృత్రిమ పదార్థాల కాలుష్యం,
7- సముద్రాల ఆమ్లీకరణ (ఓషన్ ఎసిడిఫికేషన్)

మిగిలిన రెండు వ్యవస్థలైన ఓజోన్ పొర క్షీణత, వాతావరణంలో ధూళి కణాల (ఏరోసోల్స్) సాంద్రత మాత్రమే ప్రస్తుతం సురక్షిత పరిమితుల్లో ఉన్నాయి. ఓజోన్ పొరలో కొంత పురోగతి కనిపించినప్పటికీ, గాలిలోని ధూళి కణాలు కొన్ని ప్రాంతాల్లో ఇంకా తీవ్ర ముప్పుగానే పరిణమించాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
అమెజాన్ అడవులకు ముప్పు.. అంచనా మించిన విపత్తులు
ప్రకృతి అందించే సహజ రక్షణ వ్యవస్థలు మానవ కాలుష్యాన్ని భరించే శక్తిని కోల్పోతున్నాయని నివేదిక హెచ్చరిస్తోంది. ముఖ్యంగా భూమికి ఊపిరితిత్తుల వంటి అమూల్యమైన అమెజాన్ అడవులు దెబ్బతినడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అమెజాన్ అడవులు ధ్వంసమైతే ప్రపంచవ్యాప్తంగా ఆహారం, తాగునీటి భద్రతతో పాటు వాతావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుంది. అడవులు, చిత్తడి నేలలు, నదులు , సముద్రాలపై పడుతున్న ఒత్తిడి వల్ల భూగోళం పూడ్చలేని నష్టాన్ని చవిచూసే తీవ్ర ప్రమాదకర కేటగిరీలోకి అడుగుపెట్టిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇంకా మించిపోయింది లేదు.. సమిష్టి పోరాటానికి పిలుపు
అయితే పరిమితులు దాటినంత మాత్రాన తక్షణమే సర్వనాశనం జరిగిపోదని, కానీ కోలుకోలేని నష్టం జరిగే అవకాశాలు విపరీతంగా పెరుగుతాయని శాస్త్రవేత్తలు వివరించారు. పరిస్థితులు చేయిదాటిపోకముందే హరిత గృహ వాయువుల ఉద్గారాలను వెంటనే తగ్గించి, ప్రకృతి వ్యవస్థలను కాపాడుకుంటే భూమిని మళ్లీ సురక్షితమైన మండలానికి తీసుకురావచ్చని నివేదిక సహ రచయిత జోహన్ రాక్‌స్ట్రోమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. నిత్యం ఎదురవుతున్న తుఫానులు, వరదలు, కాలుష్యం వంటి సమస్యలను విడివిడిగా కాకుండా భూగోళానికి వచ్చిన సమగ్ర పర్యావరణ సంక్షోభంగా గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.














Click it and Unblock the Notifications
