ప్రపంచపు అత్యంత పురాతన చెట్టు ఇదే! ఊపిరి పీల్చుకుంటున్న చరిత్ర
ప్రపంచంలో చరిత్ర ఎక్కడో ఒకచోట రాళ్లపైనో, పుస్తకాల్లోనో భద్రపరచబడి ఉంటుంది. కానీ, కొన్ని ప్రదేశాల్లో చరిత్ర ఇంకా ఊపిరి పీల్చుకుంటూ జీవిస్తూనే ఉంది. అమెరికాలోని కాలిఫోర్నియా తూర్పు పర్వత శ్రేణుల్లో అత్యంత దట్టమైన సున్నపురాయి కొండల మధ్య నిలబడిన 'గ్రేట్ బేసిన్ బ్రిసిల్‌కోన్ పైన్' చెట్లు అలాంటి ఒక సజీవ అద్భుతాన్నే ఆవిష్కరిస్తున్నాయి.
ఈ పర్వతాలపై పెరిగే కొన్ని చెట్ల వయస్సు అక్షరాలా 5,000 ఏళ్లకు పైమాటే! పురాతన ఈజిప్టు పిరమిడ్ల నిర్మాణం ప్రారంభమైన సమయంలోనే మొలకెత్తిన ఈ వృక్షాలు.. మానవ నాగరికతలు రూపుదిద్దుకోవడం, సామ్రాజ్యాలు కూలిపోవడం, భాషలు రూపాంతరం చెందడం వంటి విప్లవాత్మక మార్పులన్నింటికీ సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి.

అన్యగ్రహాన్ని తలపించే విచిత్ర అడవి..
ఈ బ్రిసిల్‌కోన్ పైన్ వృక్షాలు ఉన్న అడవి సాధారణ పచ్చటి దట్టమైన అడవుల్లా ఉండదు. చూడటానికి ఏదో వేరే గ్రహం మీద ఉన్న ప్రదేశంలా అనిపిస్తుంది. ఈ చెట్ల కాండాలు వంకర్లు తిరిగి, ఎండిపోయిన వెండి-బూడిద రంగులో ప్రాణం లేని ఆకారాల్లా కనిపిస్తాయి. కానీ, ఆ ఎండిపోయిన కొమ్మల చివర్లలో పచ్చటి సూదిలాంటి ఆకులు పూస్తూ 'మేము ఇంకా జీవించే ఉన్నాం' అని చాటిచెబుతుంటాయి. ఈ అడవిలోని 'మెతుసెలా' (Methuselah) అనే చెట్టు వయస్సు సుమారు 4,800 సంవత్సరాలకు పైగా ఉంటుంది. ఈ అత్యంత పురాతన వృక్షాన్ని పర్యాటకులు, సందర్శకుల నుండి కాపాడుకోవడానికి దాని ఖచ్చితమైన ప్రాంతాన్ని అత్యంత రహస్యంగా ఉంచడం విశేషం.
ప్రతికూల పరిస్థితులే ఆయురారోగ్యాల రహస్యం!
ఇంతటి కఠినమైన పర్వత వాతావరణంలో, గడ్డకట్టే చలి, సుడిగాలులు, నీటి కొరత ఉన్నప్పటికీ ఈ చెట్లు వేల ఏళ్లు ఎలా బతుకుతున్నాయనేది అందరినీ ఆశ్చర్యపరిచే అంశం. ఇవి అత్యంత నెమ్మదిగా పెరుగుతాయి. ఎంత నెమ్మదిగా అంటే.. వీటి కలప చాలా గట్టిగా, రసాయనిక సాంద్రతతో తయారుకావడం వల్ల పురుగులు, శిలీంధ్రాలు, చీడపీడలు దీని దరిదాపుల్లోకి కూడా రావు. అంతేకాకుండా, చెట్టులోని ఏదైనా ఒక భాగం ఎండిపోయినా లేదా చనిపోయినా, బెరడులో ఉన్న ఒక చిన్న సన్నని జీవ పొర వేర్ల నుంచి మిగిలిన కొమ్మలకు పోషకాలను అందిస్తూ చెట్టును బతికిస్తుంది. రూపం ఎండిపోయినా లోపల జీవాన్ని కాపాడుకోవడమే వీటి దీర్ఘాయుష్షు రహస్యం.
9,000 ఏళ్ల భూగోళ వాతావరణ చరిత్ర.. సైంటిస్టుల పరిశోధనలు!
ఈ ప్రాచీన వృక్షాలు కేవలం ప్రకృతి వింతలు మాత్రమే కాదు, విజ్ఞాన శాస్త్రానికి ఒక జీవ నిధి. ఈ చెట్ల కలపలో ఏర్పడే వలయాల (Tree Rings) వెడల్పును బట్టి గత వేలాది సంవత్సరాల్లో సంభవించిన వర్షపాతం, ఉష్ణోగ్రతలు, తీవ్ర కరువుల సమాచారాన్ని శాస్త్రవేత్తలు ఖచ్చితంగా లెక్కించగలుగుతున్నారు.
నాసా అంచనా ప్రకారం.. ఇక్కడి సజీవ, నిర్జీవ కలప ద్వారా దాదాపు 9,000 ఏళ్ల భూగోళ వాతావరణ చరిత్రను పరిశోధించవచ్చు. ఇటీవల కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ బ్రిసిల్‌కోన్ పైన్ చెట్టు జన్యుక్రమాన్ని (Genome Sequencing) పూర్తి చేసి, వీటి అపారమైన ఆయుర్దాయం వెనుక ఉన్న జీవశాస్త్ర రహస్యాలను ఛేదించే దిశగా మరో అడుగు ముందుకు వేశారు.














Click it and Unblock the Notifications
