చంద్రుడి గుట్టు దాగేలా లేదు- తొలి ఫొటోలో..!!
Blue Ghost Spacecraft: చందమామపై మరో సరికొత్త ప్రయోగానికి తెర లేచింది. అమెరికాకు చెందిన ఓ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ పరిశోధనలకు పూనుకుంది. ఈ సంస్థ పంపించిన స్పేస్‌క్రాఫ్ట్ బ్లూ ఘోస్ట్ విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ అయింది. పేలోడ్స్ సాఫ్ట్ ల్యాండింగ్ అయినట్లు ప్రకటించింది.
2023లో భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ.. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్.. చంద్రుడిపై అడుగు పెట్టిన విషయం తెలిసిందే. దాని తరువాత మళ్లీ జాబిల్లిపై ఓ స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ కాబోతోండటం ఇదే తొలిసారి. తాజా పరిశోధనలు సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రబిందువు అవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

అమెరికా టెక్సాస్‌కు చెందిన ఫైర్ ఫ్లై అనే సంస్థ ఈ బ్లూ ఘోస్ట్ స్పేస్ క్రాఫ్ట్‌ను చందమామ మీదికి పంపించింది. ఈ ఏడాది జనవరి 15వ తేదీన ఫ్లోరిడా మెరిట్ ఐలాండ్స్‌లో గల నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిందీ బ్లూ డ్రాగన్. కొద్దిసేపటి కిందటే జాబిల్లిపై అడుగు మోపింది. నాసాకు చెందిన 10 మంది సైంటిస్టులు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేశారు.
అక్కడి నుంచి తొలి ఫొటోను పంపించింది కూడా. దీన్ని ఫైర్ ఫ్లై సంస్థ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేసింది. బ్లూ ఘోస్ట్ ల్యాండర్‌కు అమర్చిన కెమెరా దీన్ని తీసింది. ఇందులో కొంతభాగం బంగారు రంగులో మెరిసిపోతున్న స్పేస్‌క్రాఫ్ట్ బయటి భాగం, మరి కొంతభాగం చంద్రుడి ఉపరితలం కనిపించింది. ల్యాండ్ అయినప్పుడు చెలరేగిన ధూళి ఇందులో రికార్డయింది.
ల్యాండింగ్ కోసం చందమామపై గల మేర్ క్రీసియం ప్రాంతాన్ని ఎంచుకుంది ఫైర్ ఫ్లై. మేర్ క్రీసియం అనేది ఓ బేసిన్. ఈశాన్య క్వాడ్రంట్ దిశలో ఉంటుందిది. దీని విస్తీర్ణం 740 కిలో మీటర్లు. 3.92 బిలియన్ సంవత్సరాల కిందట నెక్టేరియన్ యుగంలో ఇది ఏర్పడి ఉంటుందని నాసా గతంలో ప్రకటించింది.
లూనార్ ఆర్బిటర్ లేజర్ ఆల్టీమీటర్ డేటా ప్రకారం చంద్రుడి ఉపరితలం నుంచి 1.8 కిలో మీటర్లు దిగువన ఉంటుందీ క్రీసియం. దీని బయటి అంచు ఎత్తు 3.34 కిలో మీటర్లు. ఇందులో లావా ప్రవాహ లక్షణాలు ఉన్నట్లు గతంలో నాసా గుర్తించింది. ఇప్పుడు దీని మీదే ఫైర్ ఫ్లై సంస్థ పరిశోధనలు చేయనుంది.
Would you look at that view! #BlueGhost captured its first image on the Moon that embodies everything this bold, unstoppable Firefly team has worked so hard for over the last 3+ years. And we’re just getting started! Find out what's next for #BGM1 https://t.co/oEJhJu7KHx pic.twitter.com/NsdljgQOpu
— Firefly Aerospace (@Firefly_Space) March 2, 2025
లావా ప్రవహించడం వల్ల అక్కడ ఏర్పడిన హీట్ ఫ్లో, ఉపరితల వాతావరణ పరిస్థితులను తొలిదశలో అధ్యయనం చేస్తుందీ సంస్థ. థర్మల్ ఎవాల్యూషన్‌కు ఇది ఉపకరిస్తుందని తెలిపింది. చంద్రుడి అయస్కాంత క్షేత్రాలపైనా డేటాను సేకరిస్తుంది. చంద్రుడిపై రాత్రి సమయం ఆరంభమైన తరువాత ఏర్పడబోయే మైనస్ 240 డిగ్రీల చలిలో ఇది ఎలా పని చేస్తుందనేది చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications