సౌర తుఫాను ధాటికి స్తంభించిన రైల్వే వ్యవస్థ.. 16 నిమిషాల ఆలస్యంగా ట్రైన్స్
మనిషి సాంకేతికతపై ఆధారపడటం మొదలుపెట్టిన తొలి రోజుల్లోనే సూర్యుడు తన ప్రతాపం చూపించాడనేందుకు ఒక అద్భుతమైన చారిత్రక ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. సుమారు 185 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌లో కేవలం 16 నిమిషాల పాటు ఒక రైలు ఆగిపోవడానికి, భూమికి కోట్లాది కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడికి ఏంటి సంబంధం? ఆనాడు రైల్వే శాఖను గందరగోళానికి గురిచేసిన ఆ రహస్యం ఏమిటి? దశాబ్దాలుగా సైన్స్ పుస్తకాల్లో ఉన్న ఒక భారీ పొరపాటును పరిశోధకులు తాజాగా ఎలా సరిదిద్దారో ఈ కథనంలో చూద్దాం.
రైల్వే సిగ్నల్స్‌ను శాసించిన సౌర తుఫాను
చాలా కాలం కిందటి మాట. ఇంగ్లండ్‌లో రైలు బయలుదేరాల్సిన సమయంలో సడన్‌గా టెలిగ్రాఫ్ సిస్టమ్ పనిచేయడం మానేసింది. దీంతో రైల్వే అధికారులకు ట్రాక్ క్లియర్ గా ఉందా లేదా అనే విషయం అంతుచిక్కలేదు. పర్యవసానంగా రాత్రి 10:05 నిమిషాలకు బయలుదేరాల్సిన రైలును 16 నిమిషాలు నిలిపివేయాల్సి వచ్చింది. ఆ కాలంలో రైళ్ల రాకపోకలను పర్యవేక్షించడానికి ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ సిగ్నల్సే ఆధారం. సరిగ్గా అదే సమయంలో సూర్యుడిలో జరిగిన అంతర్గత ప్రక్రియ కారణంగా ఏర్పడిన అయిస్కాంత అల్లకల్లోలం.. భూమిపై ఉన్న ఆ టెలిగ్రాఫ్ పరికరాలను దెబ్బతీసింది. మానవ సాంకేతికతపై అంతరిక్ష వాతావరణం చూపిన తొలి ప్రభావాలలో ఇదొకటిగా చారిత్రక రికార్డుల్లో నిలిచింది.

చరిత్ర పుస్తకాల్లో దొర్లిన భారీ పొరపాటు
అయితే, ఈ ఘటనకు సంబంధించి ఒక కీలకమైన వివరంలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు దశాబ్దాలుగా తప్పులో కాలేశారు. ఈ సంఘటన 1841లో జరిగిందని అప్పట్లో ప్రచురితమైంది. కానీ, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ ప్రాంతంలో ఆ కాలానికి అసలు రైల్వే మార్గమే ప్రారంభం కాలేదు! స్ట్రాస్‌క్రాస్ గుండా వెళ్లే ఆ రైల్వే లైన్ 1846లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. దీంతో 1841 అనే డేట్ తప్పు అని స్పష్టమైంది. ఈ మిస్టరీని చేధించేందుకు రంగంలోకి దిగిన పరిశోధక బృందం.. 'స్పేస్ వెదర్' జర్నల్‌లో ఒక సరికొత్త అధ్యయనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం ఈ ఘటన 1841లో కాదు, సరిగ్గా అక్టోబర్ 18, 1848లో జరిగిందని తేల్చిచెప్పింది. 150 ఏళ్లకు పైగా సైన్స్ ప్రపంచాన్ని ముంచిన ఒక చిన్న పొరపాటును ఇలా సరిదిద్దారు.
పాత టైమింగ్స్, పత్రికల ఆధారంగా క్లూస్
ఈ మిస్టరీని ఎలాగైనా బద్దలు కొట్టాలని భావించిన పరిశోధకులు.. నాటి పాత రైల్వే టైమింగ్స్, అయిస్కాంత కొలతలు, పాత కాలపు వార్తాపత్రికలు, ఖగోళ పరిశీలనలను లోతుగా విశ్లేషించారు. అప్పట్లో గ్రీన్‌విచ్ అబ్జర్వేటరీ రికార్డులను పరిశీలిస్తే అక్టోబర్ 18, 1848 సాయంత్రం భారీ స్థాయిలో అయిస్కాంత ప్రకంపనలు సంభవించినట్లు తేలింది. అదే సమయంలో ఇంగ్లండ్ అంతటా ఆకాశంలో అద్భుతమైన కాంతులు వెదజల్లినట్లు పత్రికలు రాశాయి. ఖగోళ శాస్త్రవేత్తలు కూడా సూర్యుడిపై భారీ మచ్చలను గుర్తించారు. ఇవన్నీ కలిపి చూస్తే, నాటి సౌర కార్యకలాపాలే టెలిగ్రాఫ్ వ్యవస్థను స్తంభింపజేశాయని స్పష్టమైంది.
నేటి డిజిటల్ ప్రపంచానికి ఇదొక పెద్ద హెచ్చరిక
సూర్యుడి ఉపరితలంపై జరిగే మార్పులు భూమిపై ఉన్న పవర్ గ్రిడ్లు, శాటిలైట్లు, జీపీఎస్ నావిగేషన్, కమ్యూనికేషన్ వ్యవస్థలపై ఎంతటి ప్రభావం చూపుతాయో ఈ ఘటనే పెద్ద నిదర్శనం. ఆ కాలంలోనే సాంకేతికత ఎంత దుర్బలమైనదో ఈ ఉదాహరణ తెలియజేస్తోంది. నాటితో పోలిస్తే నేడు మానవాళి పూర్తిగా డిజిటల్, ఎలక్ట్రిక్ వ్యవస్థలపైనే ఆధారపడి జీవిస్తోంది. అందుకే, అంతరిక్ష వాతావరణంలో వచ్చే చిన్నపాటి మార్పులు కూడా భవిష్యత్తులో మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయనేదానికి ఈ చారిత్రక సంఘటన ఒక ముందస్తు హెచ్చరికగా నిలుస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.














Click it and Unblock the Notifications
